( ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా…)
విజ్ఞానాన్ని అందరికీ పంచాలి. చదువుల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచాలి.అజ్ఞానానికి అందని విజ్ఞానం వలన ఫలితం శూన్యం. నగ్నంగా నడయాడిన నాటి రాతియుగపు అనాగరికం కాలగర్భంలో కలిసి,చరిత్ర శకలంగా మిగిలింది. జంతు రక్తమాంసాలతో ఆకలి తీర్చుకున్న ఆది మానవ అవతారం అంతరించింది. మాటలు నేర్చి,భాషలు కనుగొని,మస్తకాల్లో జ్ఞానం నింపుకున్న మానవ జాతి మహిలో ఉన్నతం. ఆలోచనల్లో శిఖర సమానం.అజ్ఞానమనే చీకటిని తరిమేసి, అంతులేని జ్ఞాన సాగరాన్ని మధించి, విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మించి, అద్భుతాలకు ఆలవాలమైన ధరణీ తలంలో అసాధ్యాలను మేథస్సుతో సుసాధ్యం చేసిన మానవ జీవుల పయనంలో సాగుతున్న పెను మలుపులు విజ్ఞానానికి మేలు కొలుపులు. భూమ్యాకాశాలను శాసిస్తూ, భువనంపై విజయ ఢంకా మోగించి, గగనంపై ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్న మానవ విజ్ఞాన తృష్ణకు విరామమెక్కడ? ఆలోచనల కు అంతమెక్కడ? అందనంత దూరంలో ఉన్న జాబిల్లిని గాంచి ‘‘చందమామ రావే…. జాబిల్లి రావే’’ అంటూ గోరుముద్దలు తినేపించే కాలం గతించింది.చందురునిపై ఫ్లాట్లు కొనేందుకు పాట్లు పడే రోజులొచ్చాయి. నక్షత్రాలను చూపించి నిద్ర పుచ్చే గతం అంతరించింది.ఖగోళాన్ని మరో భూగోళంగా మార్చే కాలం దగ్గరకొచ్చింది.
మూఢత్వానికి ముగింపు పలికి,శాస్త్రీయతకు తలొగ్గి నమస్కరించే కాలం నిరీక్షిస్తున్నది. మూంత్వం,మూఢత్వం జూలు విదిల్చి,పంజా విసిరితే విజ్ఞానాన్ని,సత్యాన్ని బ్రతికించి, బలిపీఠమెక్కిన శాస్త్ర,తత్వవేత్తల బలిదానాల ఫలమే వర్తమానం మనకందించిన ఆధునిక విజ్ఞాన భరిత సుఖమయ జీవితం. మూఢత్వం నుండి శాస్త్రీయత వైపు సాగిన విజ్ఞాన శాస్త్ర ప్రస్థానం ఎన్నో ప్రతిబంధకాలకు ప్రతిరూపం. అనాగరికం నుండి నాగరికం వైపు…రాతి యుగం నుండి రోబో యుగం వైపు నడిపించిన విజ్ఞాన తృష్ణ అలుపెరుగని ప్రయోగాలకు ఆలవాలం.
మానవ అంతరంగం ఆలోచనల హరివిల్లు.
మానవ మస్తిష్కం అనంతమైన పరిశోధన లకు పుట్టినిల్లు. విజ్ఞానం పెరిగినా అంతరిం చని అజ్ఞానం మహాపరాధం.సెన్స్ లేకుండా వినియోగించే సైన్స్ మూఢత్వం కంటే ప్రమాదం. నేరాలను పెంచే విజ్ఞానం మానవాళిని మింగేసే మహా ఉపద్రవం. వర్తమాన ప్రపంచంలో విజ్ఞానం విరబూసింది- అజ్ఞానం అరవిరిసింది.




