వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం
 కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు
 బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది
 ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని అన్నారు. ఈ పదిహేను రోజుల్లోనే చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. అభివృద్దికి తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో తెలిపారు. ప్రజలంతా తమ వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో భాజపా  ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడుతూ…ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలవాల న్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై మోదీ పలు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిందని, ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్మక్కయి గతంలో విూరు తిన్నారు..ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉందని విమర్శలు చేశారు. ఈ అవినీతిపై విచారణలో కాంగ్రెస్‌ చిత్తశుద్దితో ముందుకు సాగడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ వొచ్చినా పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో సమ్మక్క`సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించామని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని, ప్రజల కలల సాకారం కోసమే తాను పనిచేస్తానని, మోదీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని అన్నారు. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణలో పెడతామని మోదీ అన్నారు.

image.png

ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ… పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేవిూ లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనలో కూడా వొచ్చే మార్పు ఏవిూ ఉండబోదని పెదవి విరించారు. రెండు పార్టీల విధానం ఒక్కటేనని విమర్శించారు. కుటుంబ పాలనలో ఒకటి దోచుకోవడం రెండు అబద్దాలు వ్యాప్తి చేయడమే వారి విధానాలు అని విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఏం చేస్తుందని ప్రశ్నించారు మోదీ. కుటుంబ పాలనలో ఉన్న పార్టీలన్నీ ఒక్కటవుతాయని వారిని నమ్మొద్దని ప్రజలకు మోదీ సూచించారు. కాళేశ్వరం విషయంలో కూడా రెండు పార్టీలు కుమ్మక్కయాయని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రమే దేశాభివృద్ధి లక్ష్యంతో పాలన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను చేస్తున్న పర్యటనలు ఎన్నికలకు సంబంధం లేదన్న మోదీ… తాను వికసిత్‌ భారత్‌లో భాగమవ్వాలని ప్రజలను కోరేందుకే వస్తున్నట్టు ప్రకటించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించినట్టు వివరించారు మోదీ.

రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ ఇవాళ ప్రారంభంచిన మరికొన్ని ప్రాజెక్టులు అన్నింటిని కూడా ప్రజలకు తెలిపారు. ఆదిలాబాద్‌కు చాలా చరిత్ర ఉందని ఎందరో స్ఫూర్తినిచ్చే నేతలు ఉన్నారని అన్నారు మోదీ. ఇలాంటి ప్రాంతం నుంచే ముర్ము అనే మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తెలంగాణలోని గిరిజన నేతల్లో కూడా పేరున్న వాళ్లు ఉన్నారని వివరించారు. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని… సమ్మక్క సారలమ్మ ట్రైబల్‌ యూనివర్సిటీ, పసుపు బోర్డు ఇలా చాలా విషయాల్లో తెలంగాణకు తోడ్పాటు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపిలు సోయం బాపూరావు, బండి సంజయ్‌, అర్వింద్‌, ఈటెల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *