వాల్మీకి బోయలపై వివక్ష ఇంక ఎన్నాళ్ళు..?

పల్లకి ఎక్కిన ప్రభువు కాదోయ్‌ అది మోసిన బోయిలెవరు అంటూ ఓ మహాకవి ఓ సందర్భాన శ్రామిక కులాల ఉత్పత్తి విలువను వాళ్ల వెట్టి విధానాన్ని రాసుకొచ్చాడు.ఈ దేశానికే ఆదర్శమని కథలు కథలుగా చెప్పుకునే రాముని చరిత్రను రాసిన వాల్మీకి రుషి వారసులుగా, రాజులకు రాజ్యాలకు రక్షణ కోటలుగా తమ శరీర బలాలను అందించిన జాతి బోయలది.
కులీన పాలన నుండి రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య విధానం వచ్చిన నేటికి బోయ వాల్మీకిల జీవన స్థితిగతులు బండమీద బరిబత్తల బత్కుల అట్లనే కాలిపోతున్నాయి.వాల్మీకి బోయలు పూర్వం నుండి కొండ ప్రాంతాలలో కొనలలో దట్టమైన అడవులలో నివాసం ఉంటూ గిరిజనులుగా వేటగాళ్ళుగా జీవనం సాగిస్తున్నారు. శరీర సౌష్టవం దృఢంగా మానసికంగా ఎంతో ధైర్యవంతులుగా ఉండి క్రూరమైన మృగాలను వేటాడంలో దిట్టలు.ఇంకా అత్యంత నమ్మకస్తులనే పేరుంది. రాజ్యాలను నిలుపుకోవడంలో రాజులకు కుడి భుజాలుగా నిలిచారు.నేటి ఆధునిక కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో అనంతపురం నుండి మొదలకొని మరెన్నో నియోజకవర్గాలలో ఆధిపత్య వర్గాలకు అధికారం రావాలంటే ఖచ్చితంగా బోయ వాల్మీకులదే కీలక పాత్ర.

అక్షరాస్యతకు నాగరిక సమాజానికి దూరంగా విసిరివేసి రాయలసీమలో స్వార్థ రాజకీయాలకు బోయలను పావులుగా అంగ రక్షకులుగా వాడుకొని కక్ష్య పూరితంగా ఇరు వర్గాలుగా చీలగొట్టి కత్తులతో బాంబులతో ఇండ్లమీద దాడులు చేసుకునేటట్లు చేసి ఉన్న యవ్వనమంత జైళ్లలో అజ్ఞాతంలో కుటుంబాలకు పిల్లలకు దూరమైపోయి దుర్భర దారిద్య్రంతో ఉన్నది బోయ వాల్మీకిలే.
ఏ జాతులకైన రాజ్యాధికారం అనేది ప్రధాన ఆయువుపట్టు డా.బి.ఆర్‌ . అం‌బేడ్కర్‌ ఒక చోట అంటాడు రాజ్యాధికారానికి దూరమైన జాతులు చరిత్రలో అంతరించిపోతాయనీ ఇది వందకు వందశాతం నిజం.రెండు రాష్టాలలో వాల్మీకి బోయలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో అక్కడ తిష్ట వేసిన ఆధిపత్య అగ్రకుల నాయకులు బోయలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా వాడుకొని ప్రధాన రాజకీయ పదవులను ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. ఇంత జరిగిన ఇప్పటికీ వాల్మీకి జనాభా అత్యధికంగా ఉన్న గద్వాల పెనుకొండ ధర్మారం అనంతపురం రాయదుర్గం లాంటి ప్రాంతాలలో పోలీసు స్టేషన్లు కోర్టుల  చుట్టూ తిరుగుతూ చేయని నేరాలకు శిక్ష అనుభవిస్తూ హంతకులుగా దొంగలుగా బలనైన ముద్రవేసి కనీసం రేపటి చదువుకున్న యువత కూడా కులం పేరు చెప్పుకోకుండా చేశారు కొందరు అసూయపర ఆధిపత్య రాజకీయ నాయకులు.

రాయలసీమ మొదలుకొని కర్ణాటక తెలంగాణ కోనసీమ దక్షిణ ప్రాంతందాకా విస్తరించిన జాతి బోయలది.బోయ వాల్మీకులకు కులముంటది కులవృత్తి ఉండదు.ఈ సమాజంలో కులమున్న ప్రతి కులానికి ఏదో ఒక చేతిపని తోడైవుంటది కానీ బోయ వాల్మీకులు అందుకు దూరం. ఈ దేశానికి స్వతంత్రం సిద్దించిన తొలిదశ ప్రభుత్వ పరిపాలనలో ఎస్టీలుగా ఉన్న కులం అనేక రాజకీయ కుట్రల అనంతరం బి.సి.ఏ లోకి మార్చడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం సిద్దించిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా ఈ ఉద్యమం ప్రస్తావనకు వచ్చిన ఇంకా బిల్లు అమలుకానీ దశలోనే ఉంది. కర్ణాటక తకిన రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలలో బోయ కులం ఎస్టీ జాబితాలో ఉంది.గిరిజన తెగలకు చెందిన జాతులు విద్యకు దూరమై కనీసం ప్రభుత్వం అందించే ఫలాలకు నోచుకోకుండా ఉంటూ తమ అస్థిత్వానికే మనుగడ కరువైన దశలో బోయ వాల్మీకులు ఉన్నారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వాల్మీకులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం తీరా ముగిసాకా మర్చిపోవడం ప్రభుత్వాల అలసత్వానికి నిదర్శనం.

వాల్మీకి బోయ కులం సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో కొందరూ కులం మీద కక్ష్యగట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు మోకాలడ్డుపెడుతున్నారు. వాల్మీకి బోయ కులానికి తెగింపు తెలివికి తోడు రిజర్వేషన్‌ అమలైతే కొందరి అజమాయిషీ నడవదని ఉద్యమంపై నీళ్ళు చల్లుతున్నారు.వచ్చే ఆరు నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండగ ఉంటుంది. కావున ప్రతి రాజకీయ పార్టీ ప్రకటించే మేనిఫెస్టోలో బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే డిమాండ్‌ ‌ను ప్రధానంగా చేస్తేనే రేపటి వాల్మీకి బోయల ప్రధాన డిమాండ్‌ ‌నేరవేరుతుంది లేకుంటే మరొక్క ఐదేండ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది.
image.png
అవనిశ్రీ, కవి,రచయిత
జోగులాంబ గద్వాల జిల్లా
9985419424.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *