మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడుతాయి.ఈ మేఘాలు అనుకూల పరిస్థితుల్లో వర్షం లేదా మంచు, వడగళ్లుగా మారి అవపాతం చెందుతాయి.ఈ ప్రక్రియ విపరీతంగా జరిగి అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా వరదలు వస్తాయి.ఏదైనా ప్రాంతంలో సాధారణ ప్రవాహ స్థాయిని మించి నీరు ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తాయి.వరద ఉధృతి పెరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.అయితే ఒక్కొక్క సారి ఆనకట్లలు తెగిపోవడం,భారీ వర్షాలు తదితర ప్రక్రియల వలన ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆకస్మాత్తుగా వరదలు వస్తాయి.
నది తనలో ఉంచుకోగలిగి మిగిలిన నీరు సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నదిగట్టును దాటి వరదలు సంభవిస్తే నది వరదలని,కుండపోత వర్షాలు, మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం, ఆనకట్టలు తెగిపోయి ఆకస్మాత్తుగా వచ్చే వరదలను మెరుపు వరదలని, సముద్రంలో ఉప్పెనలు,సునామీలు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లో ఏర్పడే వరదలను తీర ప్రాంత వరదలని, సముద్రాల్లో ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నీటి ప్రవాహాన్ని వెనక్కినెడతాయి.వీటి ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడే వరదలను నది ముఖద్వార వరదలని,సరైన మురుగు నీటి వ్యవస్థ, అక్రమ కట్టడ నిర్మాణాల వలన నగరాల్లో భారీ వర్షాలు, అధిక పరిమాణంలో నీటి సరఫరా గొట్టాలు పగిలినప్పుడు ఏర్పడే వరదలను పట్టణ వరదలని అని అంటారు.
కేంద్ర జల సంఘ వర్గీకరణ ప్రకారం వరద స్థాయిని బట్టి సాధారణ, సాధారణ కంటె ఎక్కువ,తీవ్రమైన, అత్యంత తీవ్రస్థాయిగా పేర్కొంటారు.సాధారణ కంటె ఎక్కువ వరద వస్తే’’ఎల్లో అలర్ట్’’, వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి ఫ్లడ్ లెవెల్ కు దిగువున ఉన్నప్పుడు తీవ్రంగా పరిగణించి ‘‘ఆరెంజ్ అలర్ట్’’ ప్రకటిస్తారు.అలాంటప్పుడు కేంద్ర జలసంఘం ప్రతి మూడు గంటలకు ఒకసారి ప్రత్యేక వరద సమాచారం జారీ చేస్తుంది.అత్యంత తీవ్రమైన వరద సమయాల్లో వరద అంచనా కేంద్రాల వద్ద నీటి ప్రవాహం అత్యధిక స్థాయి దాటి ప్రవహిస్తే ‘‘రెడ్ బులెటెన్’’జారీ చేసి ప్రతి గంటకు ఒక సారి వరద సమాచారం అందిస్తారు.రెడ్, ఆరంజ్ బులెటన్లు ప్రధాన మంత్రి కార్యాలయం వరకు వెళ్తాయి. ఎల్లో బులెటన్ ను వరద నష్టానివారణకు సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపుతారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై శ్రీరామ్ సాగర్,కాళేశ్వరం, భద్రాచలం, ధవళేశ్వరం, జూరాల,శ్రీశైలం,ప్రకాశం బ్యారేజ్,మంత్రాలయం వద్ద వరద అంచనాల కేంద్రాలు ఉన్నాయి.కేంద్ర జల సంఘం వరద హెచ్చరికల భాగంగా దేశ వ్యాప్తంగా 325 హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి.
ఇవి వైర్ లెస్, రేడియో,టి.వి, మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తాయి.వరదల వలన వంతెనలు,వాహనాలు, భవనాలు, మురికి నీటి వ్యవస్థ, రహదారులు,కాలువలు,ఇతర కట్టడాలు ప్రభావితమవుతాయి.వరదలలో మునిగి ప్రజలకు ప్రాణనష్టం,ఆస్తి నష్టం సంభవిస్తాయి.నదులలో నీరు కలుషితమయ్యి త్రాగు నీటికి ఆటంకం ఏర్పడుతుంది.వరద నీటి వలన నీరు కలుషితమయ్యి అంటువ్యాధులు ప్రబలుతాయి.సారవంతమైన భూమి నశించి వ్యవసాయానికి తీవ్ర నష్టం ఏర్పడి ఆహార కొరత ఏర్పడుతుంది. చెట్లకు శ్వాశ అందక వృక్ష జాతులు నశిస్తాయి. నదులపై ఆనకట్టలు, జలాశయాలు, నదుల అనుసంధానం చేస్తూ నదుల ఒడ్డున ఎత్తైన బలిష్టంగా ఉన్న చెట్లను పెంచడం వలన భూమి కోత ఏర్పడకుండ ఉండి వరదలను నియంత్రించవచ్చు.
ఆళవందార్ వేణు మాధవ్
హైదరాబాద్, 8686051752,




