‘‘రాష్ట్రంలోనైతే మునుగోడు పేరు ప్రజల ఎరుకలో శాశ్వతం నిలిచిపోతది. అయితే ఇంత జరిగినా ఇక్కడి వోటర్లు లౌక్యం ప్రదర్శించి అన్ని పార్టీలకు ఒక విధంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించినా కేవలం పది వేల మెజారిటీనిచ్చి గెలుపు మీ ఒక్కరి ద్వారా లభించ లేదు. కమ్యూనిస్టులు సహకరిస్తేనే సాధ్యమయింది. కనుక భవిష్యత్తులో దాన్ని బట్టి నడుచుకోవాలనే హెచ్చరికను జారీచేశారు. ఇక బిజెపికి కూడా పార్టీ ప్రయోజనాల కోసం తమపై, రాష్ట్రంపై సిట్టింగ్ ఎంఎల్‌ఏ, అంతో ఇంతో పేరున్న అభ్యర్థి అనే ధైర్యంతో ఎలాగైనా గెలుపు తమదేననే అతి విశ్వాసంతో అనవసరంగా తమపై ఎన్నికను రుద్దితే సహించబోమని, ఇకనైనా ఇటువంటి చర్యలు, ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.’’
మునుగోడులో ఉప ఎన్నిక తతంగం పూర్తయింది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాన్ని గెలిచిన రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేసినప్పటి నుంచి ఈ ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఒక విధంగా జాతీయ స్థాయిలోనూ ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. మూడు ప్రధాన పార్టీల నాయకులు నియోజక వర్గంలోని ప్రతి వోటరును వ్యక్తిగతంగా ఒకటికన్నా ఎక్కువ సార్లే కలుసుకుని ఉంటారు. దానికి కారణాలు అనేకం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారేందుకు ఆ పార్టీ అధినేత నిర్ణయించుకోవడంతో వారికి ఈ ఎన్నికలో గెలుపు తప్పనిసరయింది. ఎందుకంటే ఈ ఎన్నికలో ఓడిపోతే పార్టీ రాజకీయంగా చాలా దెబ్బతినే అవకాశముంది. స్వరాష్ట్రంలో ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలువలేని పార్టీ జాతీయ రాజకీయాల్లో ఏం వెలుగబెడుతుందనే విమర్శలు ప్రతిపక్షాల నుండి వెల్లువెత్తడమే కాకుండా నైతికంగా బలహీనపడి జాతీయ పార్టీగా భవిష్యత్తు ఆదిలోనే హంసపాదుగా మారే అవకాశముండడంతో ఆ పార్టీ ఈ ఎన్నికను చావో రేవో అనే విధంగా తీసుకుని మొత్తం మంత్రులు, ఎంపిలు, ఎంఎఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, నాయకులను, పార్టీ మొత్తాన్ని అక్కడే మోహరించి ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
చివరికి ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం నియోజక వర్గంలోని ఒక గ్రామానికి ఇంఛార్జ్‌గా వ్యవహరించారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సిఎం కెసిఆర్ రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక బిజెపి విషయానికొస్తే దేశంలో మిగతా ప్రాంతాల్లో విస్తరణను ఏదో విధంగా విజయవంతంగా పూర్తి చేసుకుని తమ పార్టీ విస్తరణను కొనసాగిస్తున్న బిజెపి ఇప్పుడు దక్షిణాది మీద దృష్టి సారించినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో వొచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో ఇటీవలి కాలంలో రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. అందుకు మొదటి అడుగుగా కాంగ్రెస్ ఎంఎల్‌ఏ రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికకు తెరలేపారు. రఘునందన్ రావు, ఈటల లాగానే కోమటిరెడ్టి స్థానికంగా బలమున్న నేత అన్న నమ్మకంతో గెలుపు తథ్యమని వారు పూర్తి విశ్వాసంతో రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో తమ సర్వ శక్తులు ఒడ్డి ఏ విధంగానైనా గెలుపు సాధించి తమ లక్ష్యానికి బలమైన పునాది వేయాలనుకున్నారు. దాంతో వారు కూడా కెసిఆర్‌ను ఎదుర్కునేందుకు సర్వ శక్తులు ఒడ్డారనడంలో సందేహం లేదు. ఇక కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం కావడంతో వారికీ ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అదే సమయంలో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కొనసాగుతుండడంతో ప్రచారంలో వెనుకబడిపోయింది. దాంతో రాష్ట్ర నాయకుల అరకొర సహకారంతో అభ్యర్థి ఒంటరిగానే ప్రచారం చేయాల్సి వొచ్చింది. అదీ కాక కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీకి గుదిబండగా మారడం, ఆర్థికంగా ఇతర అభ్యర్థులతో పోటీ పడలేక పోవడంతో పోటీలో నిలువలేక పోయింది.
ఇక విషయానికొస్తే ఏ విధంగా, ఎంత మెజిరిటీతో గెలిచినా ప్రజాస్వామ్యంలో గెలుపు గెలుపే కాబట్టి అంకెలపరంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల విజయం సాధించినా అసలు విజయం మునుగోడు నియోజక వర్గ ప్రజలదిగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ప్రలోభాలను ఎరచూపినా, పోటీలు పడి హామీలు గుప్పించినా వారు ప్రదర్శించిన లౌక్యం ఇక్కడ చెపుకోదగ్గ అంశం. దాదాపుగా రెండు నెలల నుంచి నియోజక వర్గ ప్రజలకు నిత్యకల్యాణం, పచ్చతోరణం అన్నట్లు విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. మొత్తం రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడే మకాం వేయడంతో మద్యం షాపులు, చిరు వ్యాపారాలు, హోటళ్లు, అద్దె రూమ్‌లు మొదలైన వారందరూ దండిగా సంపాదించుకున్నారు. మద్యం అమ్మకాలయితే రికార్టు స్థాయిలో అమ్ముడయినట్లు వార్తలు వొచ్చాయి. అంతే కాకుండా నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు కూడా ఎకాఎకి రెక్కలొచ్చాయి. పోటీలతో హామీల వర్షం కురిసింది. ఇక డబ్బుల పందేరంలో, ప్రలోభాలలో కూడా రికార్డులు బద్ధలైనట్లు వార్తల్లో వింటున్నాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ మునుగోడు నియోజక వర్గం వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోనైతే మునుగోడు పేరు ప్రజల ఎరుకలో శాశ్వతం నిలిచిపోతది. అయితే ఇంత జరిగినా ఇక్కడి వోటర్లు లౌక్యం ప్రదర్శించి అన్ని పార్టీలకు ఒక విధంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
టిఆర్‌ఎస్‌ను గెలిపించినా కేవలం పది వేల మెజారిటీనిచ్చి గెలుపు మీ ఒక్కరి ద్వారా లభించ లేదు. కమ్యూనిస్టులు సహకరిస్తేనే సాధ్యమయింది. కనుక భవిష్యత్తులో దాన్ని బట్టి నడుచుకోవాలనే హెచ్చరికను జారీచేశారు. ఇక బిజెపికి కూడా పార్టీ ప్రయోజనాల కోసం తమపై, రాష్ట్రంపై సిట్టింగ్ ఎంఎల్‌ఏ, అంతో ఇంతో పేరున్న అభ్యర్థి అనే ధైర్యంతో ఎలాగైనా గెలుపు తమదేననే అతి విశ్వాసంతో అనవసరంగా తమపై ఎన్నికను రుద్దితే సహించబోమని, ఇకనైనా ఇటువంటి చర్యలు, ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇక నియోజక వర్గంలో తమ సంప్రదాయక వోట్లన్ని తమకే వొస్తాయని, గ్రూపు తగాదాలు మానుకుని ఐక్యంగా ఉండకుండా ఏదైతే అదయిందని పోటీలో నిలిస్తే ఫలితం ఈ విధంగానే ఉంటుందని కాంగ్రెస్‌ను హెచ్చరించారు. మొత్తానికి అవకాశమున్నంతా అందిపుచ్చుకుని, ప్రలోభాలకు లోనుకాకుండా విజ్ఞతతో, లౌక్యంతో వ్యవహరించి పార్టీలకు కనివిప్పు కలిగించిన నియోజక వర్గ వోటర్లే ఇక్కడ నిజమైన విజేతలు.
– వి రామ్మోహన్ రావు




