లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం
మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు

image.png
న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత.. మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘ్వాల్‌ ‌దిగువ సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ ‌పేరుతో ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఇది ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావించాలి. బుధవారం నుంచి లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుంది. ఆ తర్వాత వోటింగ్‌ ‌నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 27 ఏళ్ల తర్వాత మోదీ సర్కార్‌.. ‌మహిళా రిజర్వేషన్లపై కొత్త బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. కాగా..కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం విశేషం.
తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు వేర్వేరు కావడం వల్ల గతంలోకి పోకుండా తాజాగా దీనిపై చర్చకు సహకరించాలి. కొత్తదానికి పాతది ఒకటే కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే, ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ..2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వొస్తాయని కేంద్రం చెబుతుంది.
image.png
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్‌ ‌పక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.  దీని స్వరూపం ఎలా ఉన్నా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు గట్టెక్కడం ముఖ్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బిల్లుకు.. విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తుంది. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చితే..చట్టసభల్లో 15 ఏళ్లపాటు మహిళకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్‌ ‌పక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళలకు ఈ 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15ఏళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. తదుపరి వీటిని పెంచుకునే అవకాశం ఉంది. ఈ కోటాలోనే ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడోవంతు సీట్లను కేటాయిస్తారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు. కాగా.. ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ, శాసన మండళ్లకు వర్తించవు.
మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ
మహిళా బిల్లు తమదేనని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.రిక రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతిస్తుండగా మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి మోదీజీ పదేండ్లు ఎందుకు వేచిచూశారని కాంగ్రెస్‌ ‌నేత కపిల్‌ ‌సిబల్‌ ‌ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మహిళా బిల్లుకు మోదీ సర్కార్‌ ‌మోక్షం కల్పించడం నిజమైతే 2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓబీసీ మహిళలకు ప్రభుత్వం కోటా కల్పించని పక్షంలో రానున్న సాధారణ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదని కపిల్‌ ‌సిబల్‌ ‌హెచ్చరించారు. భారత్‌ ‌నిజంగా సుసంప్ననం కావాలంటే 50 శాతం జనాభాను నిర్ణాయక పక్రియలో భాగస్వామ్యం కల్పించాలని కాంగ్రెస్‌ ‌ప్రధానకార్యదర్శి, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ‌వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ప్రాధాన్యతను సోనియాగాంధీ, మన్మోహన్‌ ‌సింగ్‌లు గుర్తెరగడంతో మహిళా బిల్లును 2010లో రాజ్యసభలో ఆమోదం పొందేందుకు కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. కాషాయ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లోక్‌సభలో బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్‌ ‌చేశారు.
మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా కేశవ రావు మాట్లాడుతూ కొన్ని పార్టీలు బిల్లు వ్యతికిస్తున్నట్లె తెలిపారు. మహిళా బిల్లుకు కవిత ఒక్కరే కాకుండా అనేక మంది పోరాటం చేశారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *