జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం
ఆదిలాబాద్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోని బీడీ ఎన్టీ ల్యాబ్‌ను కేటీఆర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తుందన్నారు. ఆదిలాబాద్ లాంటి పట్టణాలకు ఐటీ విస్తరించడం సంతోషకరమైన విషయమన్నారు. ఇక్కడి ఉద్యోగులు అమెరికా కంపెనీలతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీడీ ఎన్టీ ల్యాబ్ భవనం కోసం రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మూతపడిన సీసీఐని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తామన్న పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సిమెంట్ వినియోగం పెరిగి ప్రయివేటు పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయని గుర్తు చేశారు. సీసీఐని ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్న కేంద్ర నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కాశ్మీరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రి కేటీఆర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టుతో పాటు ఫ్యామిలీ కోర్టును నిర్మల్‌కు తరలించేందుకు ఇంద్రకరణ్ రెడ్డి కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ వైఖరికి నిరసనగా జిల్లాలోని న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు.
అంతకుముందు ఆదిలాబాద్‌లో ఏర్పాటైన ఐటీ కంపెనీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. కంపెనీ ఆధునీకరణకు నిధులు ఇస్తామన్న ఆయన..ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి 120మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎకరాల భూమి, రూ. కోటిన్నర నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. విదేశాల్లో ఉన్నవారు ముందుకొస్తే…ఆదిలాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్ ఆహ్లాదకరమైన ప్రాంతమన్న మంత్రి… టూరిజంను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.



