రుణమాఫీ సరే… ఆరు నెలలుగా రైతు బాధల సంగతేమిటి?

  • అనర్హుల పేరిట రైతు బంధు పంపిణీలో తీవ్ర జాప్యం
  • రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ విమర్శలు

రైతుల రుణ మాఫీ విషయంలో కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం ప్రకటిం చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసేవిధంగా శుక్రవారంనాటి మంత్రి వర్గం తీర్మానించింది. రుణ మాఫీ విషయంలో మరింత జాప్యం జరుగకుండా రెండు లక్షల రూపాయలను ఏక మొత్తంగా ఒకే విడుతలో మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తమ మంత్రివర్గం తీర్మానించిన విషయాన్ని స్వయంగా సిఎం రేవంత్‌రెడ్డి మీడియా సమక్షంలో వివరించారు.  అయితే అందుకు కొన్ని నిబంధనలను అమలుపరుస్తున్నట్లు కూడా తెలిపారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంటే 2023 డిసెంబర్‌ 9న రుణమాఫీ అమలు పరుస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్‌ 7న రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు డిసెంబర్‌ 9న రుణమాఫీని అమలుపరుస్తామని మాట ఇచ్చారు. కాని, అందుకు కోట్లాది రూపాలయలు అవసరం కావడంతో దాన్ని ఆరు నెలలకు పొడిగించారు.

 

అయితే ఈ ఆరునెలల పాటు రైతు పడిన కష్టాల మాటేమిటని బిఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు రుణమాఫీని వాయిదా వేస్తూనే, రైతుబంధు అమలులో కూడా తీవ్ర జాప్యం చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డిలు ఇటీవల మీడియా సమావేశంలో రైతాంగం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ ప్రభుత్వ కాలంలో సకాలంలో అందజేస్తున్న రైతు బంధును ఈ ప్రభుత్వం అందజేయకపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురైన విషయాన్ని వారు గుర్తుచేశారు. కావాలని రైతు బంధు నిధులను సకాలంలో విడుదల చేయకుండా, వాటన్నిటినీ  రైతు రుణమాఫీ  కోసం ప్రోగు చేసినట్లు స్పష్టమవుతున్నదన్నది వారి అభియోగం.

ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెట్టకుండా ఆరు నెలలాగు అన్నం పెడుతా అన్నట్లు ప్రభుత్వం తీరు ఉన్నదన్నారు. రైతు బంధు విషయంలో తమ ప్రభుత్వం అనర్హులకు కూడా ఇచ్చిందన్న సాకుతో కాలయాపన చేస్తున్నారంటున్న వీరు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత మూడు పంట సీజన్‌లు గడిచిపోయాయి. ఈ మూడు సీజన్‌లలో అర్హులు, అనర్హుల జాబితాను తయారు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలుపుతుందంటూ వారు విరుచుకుపడ్డారు. రైతు బంధు విషయంలో గొప్పగా పదిహేను వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ కనీసం తమ ప్రభుత్వ కాలంలో ఇచ్చినట్లు పదివేలైనా సక్రమంగా రైతులకు అందజేయలేదని, దీంతో చాలామంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వొచ్చిందంటూ వారు ఆరోపించారు.

ఇదిలా ఉంటే రైతు రుణమాఫీకి ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 31వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాల్సి ఉంది. ఈ నిధులన్నిటినీ ఏక మొత్తంగానే వితరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిరది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు ఇందుకు కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించింది.  శాసనసభ ఎన్నికల హామీల్లో భాగంగా రైతుల వ్యవసాయ రుణాలను రెండు లక్షల వరకు తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని వరంగల్‌ నడిబొడ్డున 2022 మే 6న ఏర్పాటు చేసిన సభలో  ‘వరంగల్‌ డిక్లరేషన్‌ ’ పేరున కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికి అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలను మాత్రమే ప్రకటించగా, అధికారం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని అప్పట్లో తీవ్ర విమర్శలు వొచ్చాయి.

కాని, అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్‌ పార్టీ తన మాటను నిలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆరు నెలల ఆలస్యంగా అయినా సరే ఆగస్టు 15 లోగా తమ హామీని అమలు చేస్తామని తాజాగా జరిగిన మంత్రి మండలిలో ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా ఈ పక్రియ జూలై నుండే ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం తన మాట నిలుపుకునే విషయంలో ఆరునెలలు  జాప్యం చేయడంవల్ల ఈ ఆరునెలలపాటు రైతులపై పడే వడ్డీ మాటేమిటని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. తొలకరి వానలు పడడంతోనే వ్యవసాయ పనులను  ప్రారంభించిన  రైతాంగానికి ముందుగా అందించాల్సిన ఆర్థిక సహాయం అందక  రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్న విషయాన్నికూడా వారు గుర్తుచేస్తున్నారు.
   -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *