రిజర్వేషన్లపై రేవంత్‌ తప్పుడు ప్రచారం

మాటల్ని వెనక్కి తీసుకుని  క్షమాపణ చెప్పాలి
 లేకుంటే ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాం..
 బీజేపీ ఓటమి కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కమ్మక్కయ్యాయి..
 అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీలది డూప్‌ఫైట్‌..
హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందం టూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసం హరించుకోవాలని లేకుంటే మఖ్యమంత్రిని కూడా కోర్టుకు ఈడుస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మంథని నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ నారాయణ రెడ్డి, కార్మిక సంఘ నాయకుడు కాంతారెడ్డి, భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజేష్‌ నాయక్‌ తో పాటు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఇతర నాయకులు కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి కిషన్‌ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…లోక్‌ సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు..బిజెపిని నిలువరించేందుకు జతకట్టాయని అన్నారు. ఈ రెండు పార్టీలకు తోడుగా ఎంఐఎం పార్టీ కుమ్మక్కై ఒప్పందం ప్రకారం బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ…తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో కిందిస్థాయి నాయకులెవ్వరూ వారి మాటలను నమ్మడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని గ్రామగ్రామన ప్రజలందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మజ్లిస్‌ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఓల్డ్‌ సిటీలో ఓవైసీని గెలిపించాలని పార్టీ హైకమాండ్‌ నుంచి ఆదేశాలొచ్చాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఫిరోజ్‌ ఖాన్‌ బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సైలంట్‌గా కనపడుతున్నాయని,   బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు డూప్‌ ఫైటింగ్‌ చేసుకుంటూ లోక్‌ సభ ఎన్నికల్లో డ్రామాను రక్తికట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటన అవాస్తమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందన్నారు. బిజెపిపై , ఆర్‌ఎస్‌ఎస్‌ పై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ఈ విషయాన్ని ఖండిరచారని తెలిపారు. రేవంత్‌ రెడ్డికి నైతికత ఉంటే చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చి, 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. గ్యారంటీలను అమలు చేయక బొక్కబోర్లా పడిరదని, హామీల అమలులో విఫలమై రేవంత్‌ రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డిని రైతులు, యువత, మహిళలు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు. చివరకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందనే భయంతో అబద్ధాలతో బయటపడాలనే దురుద్దేశంతో కుట్ర చేస్తోంది. అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.   దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని,  ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా..మోదీ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు.

నరేంద్ర మోదీ అన్ని వర్గాల ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో విజయం సాధించేలా ముందుకెళ్తున్నారని చెప్పారు. మార్ఫింగ్‌ వీడియోలు, ట్విస్టడ్‌ ఆడియోలు, ఏ-1 జనరేటెడ్‌ ఇమేజ్‌లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, హోమ్‌ మంత్రి అమిత్‌ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్‌ చేయడం నేరమని, మార్ఫింగ్‌ వీడియోలను ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనిశ్చిత పరిస్థితిలో మార్ఫింగ్‌ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని,  రిజర్వేషన్లు పోతాయంటూ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నమేనని ఆరోపించారు.  రేవంత్‌ రెడ్డి శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే యత్నం చేశారని,  ఘర్షణలు రేపాలని కుట్ర చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ చివరి శ్వాస వరకు పేద ప్రజలకు రిజర్వేషన్లను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, పేదలకు మరింత మేలు జరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ కూడా స్పష్టంగా చెప్పారన్నారు.

కేంద్రం కృష్ణా నదీజలాలను ఎత్తుకుపోతుందంటూ కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీల నీరు చాలంటూ సంతకం పెట్టిన కేసీఆర్‌.. నేడు చెప్పుకునేందుకు ఏమీలేక కేంద్రంపై నిందలేస్తున్నారని ధ్వజమెత్తారు.  కేంద్రంలో హంగ్‌ వొస్తుందంటూ, తాను చక్రం తిప్పుతానంటూ కేసీఆర్‌ పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కూతురు దిల్లీకి వెళ్లి బీరు-బ్రాందీ స్కామ్‌లో చక్రం తిప్పింది చాలదా..అంటూ ఎద్దేవా చేశారు.  బిజెపికి 400 సీట్లలో విజయం సాధించడం పక్కా అని, కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో కూర్చుని ఏం చక్రం తిప్పుతారో చూస్తామని అన్నారు. అక్షింతలు కలిపి పంచుడు.. తీర్థాలు, పులిహోర, ప్రసాదంతో ఊరేగింపులు చేస్తూ వోట్లు దొబ్బుతారంటూ.. కేసీఆర్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌..రెండు పార్టీలూ తమ స్వార్థ రాజకీయం కోసం తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మవొద్దని కిషన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *