రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు
విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు
వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు
అసెంబ్లీలో 2024-24కు వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ పద్దు రూ.2,75,891 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు దానికి తగినట్లుగానే కేటాయింపులు జరిపినట్లు భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్‌ను వోట్ ఆన్ అకౌంట్‌గా ప్రవేశ పెట్టడం అయిష్టంగా ఉన్నా కేంద్రం వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినందున తప్పలేదన్నారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ అందుకు గాను బడ్జెట్‌లో రూ.53,196 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే ఈ సారి విద్యారంగానికి పెద్ద పీట వేశారు.
గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ. 18.955 కోట్లు కేటాయించి 14,406 కోట్లు ఖర్చు చేయగా ఈ సారి కొంత పెంచి రూ.21.389 కోట్లు కేటాయించారు. ఇక బడ్జెట్‌లో వివిధ రంగాల కేటాయింపులను పరిశీలిస్తే…మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు, వ్యవసాయానికి రూ.19.746 కోట్లు, విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు, యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించారు.
నిరుద్యోగులకు భరోసా..టీఎస్‌పీఎస్సీకి బ్జడెట్‌లో రూ.40 కోట్లు
బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీకి బ్జడెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..యువకులను రెచ్చగొట్టడం కాదు. అక్కున చేర్చుకుంటాం. వారికి ఆసరాగా ఉంటాం ఆదుకుంటాం. జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తాం. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుంది. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం. గ్రూప్ `1లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నాం. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ గ్రూప్ `1 ఉద్యోగాలను ఇవ్వలేదని అన్నారు.
నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు…బడ్జెట్‌లో రూ. 7,740 కోట్లు
ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రకటించారు. గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లని మోసం చేసిందని..కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఇళ్లు లేనివారికి ఇండ్లు, స్థలం ఉంటే.. నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తామని.. ఆ నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల500 ఇండ్ల చొప్పున ఇస్తామని.. ఈ బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు కేటాయించామన్నారాయన. పంచాయతీరాజ్ శాఖకు రూ. 40,080 కోట్లు కేటాయించామని వివరించారు. ఉపాధి కల్పన జోన్‌గా మూసీ పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు.
అందమైన హారంలా మూసీ అభివృద్ధికి వేయికోట్లు
బడ్జెట్‌లో మూసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతామని భట్టి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంటు ప్రాజెక్టులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, ఓల్డ్ సిటీలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణహిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఇందులో భాగంగా అమలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు చార్మినార్ హైటెక్‌సిటీ, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి పర్యాటక స్థలాలతో పోటీపడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు.
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్…ఉచిత విద్యుత్ పథకానికి రూ.2 వేల 418 కోట్లు
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క చెప్పారు. ఇందుకుగాను బ్జడెట్‌లో రూ.2 వేల 418 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకున్నా.. ఇచ్చినట్లు ప్రచారం చేసిందని విమర్శించారు. విద్యుత్ డిస్కమ్‌లకు నిధులు చెల్లించక పోవడంతో.. అవి అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. రాష్ట్రంలో ట్రాన్స్ కో, డిస్కమ్‌లకు ఈ బ్జడెట్ లో రూ.16 వేల 825 కోట్లు కేటాయించడం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు.
టూరిజం సర్క్యూట్‌గా అనుసంధానంతో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, భద్రాచలం, జమాలాపురం( చిన్న తిరుపతి), ధర్మపురిలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్యూట్‌గా ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ దేవస్థానాలను మరింత ఆకర్షణీయంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. గిరిజనుల అతిపెద్ద జాతరైన మేడారం జాతరను ఘనంగా నిర్వహించబోతున్నామని.. సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. భక్తులు వీలుగా బంగారం మొక్కలు చెల్లించుకునేందుకు వీలుగా ఆన్ లైన్ పోర్టల్ కూడా ప్రారంభించామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది.





