రాష్ట్రంలో నేవీ రాడార్‌ స్టేషన్‌

వికారాబాద్‌ జిల్లా దామగూడెం ఫారెస్ట్‌లో 1174 హెక్టార్ల భూముల బదిలీ

సీఎం రేవంత్‌ రెడ్డితో తూర్పు నావికా దళం అధికారుల భేటీ

బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో సిఎం భేటీ..మూసీ అభివృద్ధి సహా లండన్‌ పర్యటన అంశాలపై చర్చ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లాలో నెలకొల్పుంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌ మిషన్‌ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్‌ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్‌ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్‌. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ రాడార్‌ స్టేషన్‌ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తుంది. రెండో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్‌ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్‌లన్నీ వొచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్‌ కార్తీక్‌ శంకర్‌, సర్కిల్‌ డీఈవో రోహిత్‌ భూపతి, కెప్టెన్‌ సందీప్‌ దాస్‌ బుధవారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డిని కలిశారు.

వికారాబాద్‌ డీఎఫ్‌ వో, నావల్‌ కమాండ్‌ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్‌ ప్రోటెక్షన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది. ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్‌లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ పూర్తవనుంది.

బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో సిఎం భేటీ..మూసీ అభివృద్ధి సహా లండన్‌ పర్యటన అంశాలపై చర్చ

లండన్‌ లోని థేమ్స్‌ రివర్‌ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్‌ పర్యటనలో అక్కడ థేమ్స్‌ నది నిర్వహిస్తున్న తీరు, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్‌లో హైదరాబాద్‌లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్‌ లైన్‌, థేమ్స్‌ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు.

ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్‌ హై కమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో భేటీ అయ్యారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. సీఎం దార్శనికతకు, నది పరీవాహిక ప్రాంత అభివృద్ధి చేపట్టటం పట్ల బ్రిటిష్‌ హై కమీషనర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్మెంట్‌, ఎకో టూరిజం కు తమ సహకారం ఉంటుందని ఎల్లిస్‌ అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, డిప్యూటీ హై కమీషనర్‌ గారేత్‌ వైన్‌ ఒవేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *