రాజ దండమా! రాజకీయ దండమా!

  ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్  ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న మినట్స్ లోనూ ఈ కధనం లేదు.ఏ పత్రిక కూడా ఈ కథనం గురించి రాయలేదు. మరి  అమిత్ షా, నిర్మలా సీతారామన్ లు ప్రచారం చేస్తున్న సెంఘాల్ అసలు కథనం ఏమిటనేది విశ్లేషించడం అవసరమైనదే!  
రాజకీయాల్లో టక్కు టమారవిద్యలు రావటమే కాదు, వాటిని సమయస్ఫూర్తితో వినియోగించుకోవడం ముఖ్యం. ఆ సమయస్ఫూర్తి  డెబ్బై ఐదేళ్ళుగా భారతావని మరచిపోయిన సాధారణ సెంఘాల్  ను అత్యంత అసాధారణ , అద్భుతమైన అంశంగా మార్చవచ్చు. దేశ చరిత్రలో ఈ ఆదివారం ఒక కొత్త పేజీ ఆవిష్కృతం కానుంది.అద్భుతమైన కళాకృతులు, నిర్మాణ కౌశలంతో  రూపుదిద్దుకున్న భారత కొత్త పార్లమెంట్ భవనాన్ని నేడు  ప్రధాని మోదీ  ప్రారంభించనున్నారు. ,ప్రతిపక్షాల భిన్నాభిప్రాయాలు,విమర్శల నేపధ్యంలో ఈ ఆవిష్కరణ జరుగనుంది.అహ్మదాబాద్‌కు చెందిన హెచ్.సి.పి.డిజైనర్ బిమల్ పటేల్ డిజైన్ చేయగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా , జోన్-5 భూకంపాలను తట్టుకునేలా, రెండేళ్ల 5 నెలల 18 రోజుల  వ్యవధిలో ఈ భవన నిర్మాణం 12 వందల కోట్ల ఖర్చుతో పూర్తయింది.
   ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ డిజైన్ చేసిన బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు భవనానికి నేటితో కాలం చెల్లింది. అప్పట్లో  83 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మితమైన దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు. ఈ పాత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంటు భవనం నిర్మించబడింది.ప్రస్తుత నూతన పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని,పార్లమెంట్ అనేది భారత గణతంత్రానికి అత్యున్నత చట్టసభ అని, దానికి అత్యున్నత రాజ్యాంగ అధికారి భారత రాష్ట్రపతి అనే విషయం మోదీ  విస్మరించారనేది ప్రధాన విమర్శ.హిందూత్వ వాదిగా పేరున్న వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి రోజైన మే 28న పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించటం కాంగ్రెస్  తదితర జాతీయ నాయకులను అవమానించడమే అనేది మరో విమర్శ. భాజపా పై ప్రతిపక్షాలు ఇంతకాలంగా చేసిన ఏ ఒక్క విమర్శ అయినా చర్చలోకి వచ్చిన దాఖలా లేదనే విషయం గమనంలో ఉంచుకోవాల్సిన విషయం.
భాజపా పనితీరుపై విమర్శలు
భారత్ లో  కొరోనానంతర ఆర్ధిక సంక్షోభాన్ని భా.జ.పా. తనకు అనుకూలంగా మల్చుకుని మధ్య తరగతి,సామాన్య తరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసింది.జాతీయ ఆస్తులను కారుచౌకగా ప్రయివేట్ పెట్టుబడిదారులకు అమ్మివేస్తూ వస్తూంది.అకస్మాత్తుగా పెద్దనోట్ల రద్దుతో దేశ జనాభాను  ద్రవ్యపెట్టుబడులకు మళ్ళించి బ్యాంకులను యూనిఫైడ్ చేస్తూ ఆర్ధిక రంగాన్ని అతలాకుతలం చేసిన భాజపా మరోసారి రెండువేల నోటు ఛలామణీ రద్దుచేస్తూ,దానిని రిజర్వ్ బ్యాంక్ వారిచేత ప్రకటింప చేసింది. న్యాయవ్యవస్థను సైతం గుప్పిట లోకి తీసుకుంది.‌రూపంలో మనుధర్మ వ్యవస్థకు చేరువగా కనిపించినా, సారంలో  క్రోని కాపిటలిస్ట్ విధానాలకు అనుకూలమైన అనేక చట్టాలను రూపొందిస్తున్నది.  డిప్యూటీ స్పీకర్ నియమాకం లేకపోవటం,మూజువాణి వోటుతో బిల్లులు చర్చ లేకుండా ఆమోదించడం, బిల్లులపై చర్చకు పట్టుబడితే విపక్ష సభ్యులను  సస్పెండ్ చేసి బిల్లులు ఆమోదింప చేసుకొన్నారు. దొంగచాటు బిల్లులను ద్రవ్యబిల్లులలో చేర్చి ఆమోదింపచేసుకోవటం,అధికార పార్టీ సభ్యులే సభను గందరగోళం పరిచేలా చేసి హడావుడిగా రైతాంగ వ్యతిరేకచట్టాల తదితర తమ బిల్లులను ఆమోదించుకోవటం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహస్య పరిచారు. చివరకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎం.పి.రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఒక్క సీటు గెలిచిన చోట కూడా ముఖ్యమంత్రి గా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం చేసుకోగలుగుతుంది. మైదాన ప్రాంత, కొండ నివాసిత గిరిజనుల మధ్య చిచ్చు పెట్టవచ్చు భారత దేశంలో దశాబ్దాల కాలంగా  విశ్వహిందూ పరిషత్ సంఘపరివారం కలలుకన్న మనుధర్మ పునాదులపై అఖండ  హిందూరాజ్య స్థాపనకు బిజెపి తన తొమ్మిదేళ్ళ అధికారంలో తన పని నిర్విఘ్నంగా చేసుకుపోతుంది.ప్రతి పక్షాలపై, ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతూ భాజపా తన అంతర్గత లక్ష్యాల వైపు అనుకున్న దానికన్నా వేగంగానే పయనించ గలిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతిమరూపమైన ఫాసిజం కోరలు చాచుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను భూస్థాపితం చేయనుందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సహజంగా ఏ స్థాయి విమర్శలనైనా పట్టించుకోనే సాంప్రదాయం లేని భాజపా తనదైన సొంత శైలిలో యావత్ భారతావనికి ఈ విమర్శలు వినిపించకుండా వారిని కొత్త దారులు మల్లించింది.అదే “సెంఘాల్”అనబడే  చిత్ర కథ
*సెంఘాల్ కథా…కమామీషు
     ఒక రాజు నుండి మరొక రాజు అధికారం హస్తగతం చేసుకునే సందర్భంలో అందుకునే అధికార రాజదండం పేరే “సెంఘాల్”.ఈ. సెంఘాల్  పై భా.జ.పా. ప్రచారం ఇప్పటికే ప్రజలలోకి బాగా చేరుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే  ఆగస్ట్ 14 అర్ధరాత్రి నాటి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బ్రిటీష్ గవర్నర్ నుండి అధికార మార్పిడికి  గుర్తుగా ఈ సెంఘాల్ ను స్వీకరించాడనేది విషయం. ఇందుకోసం రాజాజీ ప్రత్యేకంగా పాత గ్రంథాలు తిరగేసి చివరకు నాటి చోళవంశ
సాంప్రదాయాల్లో సెంఘాల్ విషయాన్ని కనుగొన్నారు. ” తిరువావలుదురైఅధీనం” మఠంలో ప్రత్యేకంగా వెండితో  చేయించి బంగారు పూత పూసిన ఐదడుగుల సెంఘాల్ సత్యం ధర్మానికి చిహ్నంగా దాని పై భాగాన ఒక నంది బొమ్మను కల్పిం
చారు.దానిని ఆ మఠానికి చెందిన రెండవ స్వామి ఒకరు ప్రత్యేక విమానంలో దిల్లీకి తెచ్చారు. అప్పటి మొదటి  గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ కు అందించి, తిరిగి పుచ్చుకొని గంగాజలంతో శుద్ధిచేసి ఆగస్ట్ పద్నాలుగు రాత్రి అధికార మార్పిడికి ముందు ఆ సెంఘాల్ ను నెహ్రూ కు మౌంట్ బాటెన్ ద్వారా ఇప్పించారు.న్యాయానికి, పవిత్రతకు చిహ్నంగా సెంఘాల్ పై భాగాన ఒక నంది బొమ్మను చెక్కారు. ఇది పూర్తిగా హిందూ మతానికి చెందిన తంతు.  మౌంట్ బాటెన్
రాజరికపు ప్రతినిధి, ఆనాటి కాబోయే ప్రధాని నెహ్రూ రాజరికపు ప్రతినిధి కాదుకదా! విశాల భారతావని ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రతినిధి. రాజు నుండి రాజుకు అందచేసే సెంఘాల్ ను భారత ప్రజలు తమ ప్రజాస్వామ్య ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న నెహ్రూ స్వీకరించాడనేది నమ్మశక్యంగా లేదుకదా! అయితే భాజపా చెప్పేది ఈ కధనం.నెహ్రూ ఈ హిందూ సాంప్రదాయం తీరును నిర్లక్ష్యం చేస్తూ ఆ సెంఘాల్ ను అలహాబాద్ లో మ్యూజియంలో ఉంచారని, కాంగ్రెస్ హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేసిందనేటానికి ఇది ఉదాహరణ అనే కథనం భాజపా  ప్రజలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది ఇదే నిజమైతే డెబ్బై ఐదేళ్ళుగా మ్యూజియంలో ఉన్న ఈ సెంఘాల్ ను భాజపా ఇంతకాలంగా ఎలా మర్చిపోయింది అనేది కూడా ప్రశ్ననే! “తుగ్లక్” పత్రికలో ప్రచురించబడే వరకు వెలుగు చూడని సెంఘాల్ ఇప్పుడు భాజపా  రాజకీయాలకు “మంత్రదండం”ఎలా అయిందనేది ఆలోచించాల్సిన విషయం.
    ఇప్పుడు ఈ సెంఘాల్ ను పార్లమెంట్ భవనంలో స్పీకర్ ఆసనం కుడి పక్కన వేద మంత్రోచ్ఛారణల మధ్యన ప్రధాని మోదీ  ప్రతిష్టించబోతున్నారు. ఇది దక్షిణ భారతంలో రేపు ఎన్నికలు జరగనున్న తమిళనాడు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో కి చెందిన లోతైన అంశం.తమిళ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించటం ద్వారా దక్షిణాది ప్రజల హృదయాలను చూరగొనటంలో భాగంగా ఈ తంతును భాజపా “రీల్స్” తీస్తుందని అర్ధం చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రహసనాన్ని నిఖార్సుగా వ్యతిరేకించే రాజకీయ పక్షాలను హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకులని ప్రజలు భావించే అవకాశం వుంటుంది.సెక్యులర్ భావజాలానికి కేంద్ర స్థానమైన పార్లమెంట్ భవనంలో ఒక మతానికి చెందిన సాంప్రదాయాన్ని నెలకొల్పటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పే సాహసం ఏ రాజకీయ పక్షం చేసే పరిస్థితిలో లేదు.దేశప్రజలు స్వాతంత్ర్యం,సార్వభౌమాధికార కేంద్రం అయినా పార్లమెంట్ భవనం ప్రారంభానికి దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ను,ఉప రాష్ట్రపతి నా ఆహ్వానించాడు పోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మోదీ  విశ్వగురువుగా భాసిల్లుతున్న తరుణంలో ఈ పార్లమెంట్ భవనం ప్రారంభ ఖ్యాతిని వేరొకరికి ఇచ్చే అవకాశాన్ని ఊహించలేము. ఈ ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్  ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న మినట్స్ లోనూ ఈ కధనం లేదు.ఏ పత్రిక కూడా ఈ కథనం గురించి రాయలేదు. మరి  అమిత్ షా, నిర్మలా సీతారామన్ లు ప్రచారం చేస్తున్న సెంఘాల్ అసలు కథనం ఏమిటనేది విశ్లేషించడం అవసరమైనదే!
సెంఘాల్ వాస్తవం ఏమిటి?
    దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన సందర్భంగా తొలి ప్రధాని కాబోతున్న జవహర్ లాల్ నెహ్రూ కు అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో అభినందిస్తూ కానుకలు అందచేశారు ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నై కి సమీపాన గల ఒక శైవ మఠం “తిరువావలుదురై అధీనం”కు చెందిన ప్రధాన స్వామి “అంబాలవాన దేశిక స్వామి” నెహ్రూ కు ఇచ్చేందుకు చేయించిన కానుకను ఈ సెంఘాల్.చెన్నైలో ప్రఖ్యాత బంగారు వర్తకులు “ఉమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్” వద్ద .”ఉమ్మిడి యతి రాజులు”(96)(ఇంకా ఆరోగ్యంగా వున్నట్టు సమాచారం)తో వెండితో చేయించి,బంగారు పూత పూయించిన ఐదడుగుల పొన్ను కర్ర. ఇట్టి సెంఘాల్ ను “అంబాలవాన దేశిక స్వామి” స్వాతంత్ర్య దినం వేడుకల్లో ప్రధాని నెహ్రూ కు కానుకగా ఇచ్చినట్టు నాటి ప్రధాన పత్రికల్లో అచ్చయిన సమాచారం.
ఈ వాస్తవాన్ని సేకరించి దానికి సంఘపరివారం అల్లిన చిత్రకథ ప్రజలలోకి ఇప్పటికే చేరిపోయింది. నిజం గడప దాటక ముందే అబద్దం ఊరు చుట్టి వస్తుందనడానికి ఇదే ఉదాహరణ.కేవలం తమిళనాట జరుగబోయే ఎన్నికల్లో భాజపా తమిళ సంస్కృతి, సాంప్రదాయనికి  విలువ ఇచ్చిందని,తమిళుల వోట్లు దండుకోవటానికి ఉపయోగపడవచ్చు. గిరిజన మహిళ అయినా  దేశ ప్రథమమహిళ , రాష్ట్రపతి ద్రౌపదిముర్మును పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదనే విమర్శ ను పక్కదారి పట్టించేందుకు ఈ సెంఘాల్ చిత్రకథ ఉపకరించవచ్చు. హిట్లర్ ఒక్క గోబెల్స్ నే తన అసత్యపు చిత్రకథలకు వినియోగించాడు కానీ ఇక్కడి భాజపాకు ప్రత్యకంగా లక్షలాది మందితో ఒక గోబెల్స్ సైన్యం గల సామాజిక మాధ్యమాల ప్రత్యేక విభాగం ఉండటం ఉపయుక్తపడుతూన్నది. చరిత్రను కలుషితం చేయటం కొన్ని సందర్భాల్లో కాదు ఏ సందర్భంలోనూ వీలు కాదనే విషయం సంఘపరివారం ఇప్పటికైనా గ్రహించాలి.
-అజయ్,  వరంగల్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *