రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు
 పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం
 రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..?

ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా పాలకుల్లో చిత్తశుద్ది లేని కారణంగా ప్రజల జీవన విధానంలో మార్పులు రావడం లేదు. నిరుద్యోగం  తీరడం లేదు. నిజానికి భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధులుగా, సమాన వాటాదారులుగా ప్రకటించింది. అయినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి?  ఇది రాజ్యాంగం లోపమా.. లేక నాయకుల లోపమా అన్నది చర్చించాలి. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల నేతలు చర్చించాలి. ఎక్కడ వైఫల్యం చెందుతున్నామో గుర్తించాలి. రాజ్యాంగం ఇంతకాలం కేవలం రాజకీయనాయకుల అవసరాలను మాత్రమే తీర్చింది. పెత్తందారీలకు మాత్రమే మేలు చేసింది. బడాబాబులను మరింత పెద్దవారుగా ఎదగడానికి దోహదపడిరది. సామాన్యులు సామాన్యుల గానే ఉండి పోయారు. విద్య,ఉద్యోగం, వైద్యం వంటి వాటిల్లో ఖచ్చితమైన హావిరీని పొందలేకపోయారు. ఇవన్నీ చర్చించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. రాజ్యంగం లో ఉన్న అంశాలను చర్చించాలి. ఎక్కడ మనం విఫలం అయ్యమో చర్చించాలి. కారకులు ఎవరో తేల్చాలి. రాజ్యాంగం అంటూ మార్చాల్సి వస్తే రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉండేలా చూసుకోవాలి. రాజ్యాంగం అంటే శిలాశాసనంగా ఉండాలి. దానిని కాదని పక్కకు తొలగితే ఉరివేసే విధంగా శిక్షలు ఉండాలి. భయం ఉంటే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. నిజానికి రాజ్యాంగాన్ని ప్రజలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరంపై చర్చచేయాలి.

కేవలం కొన్ని చట్టాలను మార్చడం వల్ల లాభం లేదు. రాజకీయ నాయకుల అభీష్టం మేరకు కాకుండా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, సమాజాంలో అసవరాలకు అనుగుణంగా..మారిన ప్రపంచగతికి అనుగుణంగా మన రాజ్యాంగంలో మార్పులపై చర్చించాల్సి ఉంది. ఒకే వ్యక్తి జీవిత పర్యంతం పదవులను పట్టుకుని వేలాడే పద్దతి పోవాలి. రిజర్వేషన్లు ఒకే కుటుంబంలో జీవితాంతం అనుభవించే దశ పోవాలి. 130 కోట్ల మందికి అనుగుణంగా రాజ్యాంగం మారాలి. అంతరికీ సమాన ఫలాలు దక్కేలా చట్టాలు ఉండాలి. రిజర్వేషన్ల ఫలాలు అన్ని కుటుంబాలకు వరుసగా అందాలంటే ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే దక్కాలి. రాజకీయంగా కూడా రిజర్వేషన్లు రావాలి. సర్పంచ్‌ మొదలు ఎంపిలు, ఎమ్మెల్యేల వరకు ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండకుండా.. అమెరికా తరహాలో రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడు ప్రజలకు మరిన్ని అవకాశాలు వస్తాయి.  మేధావుల సమక్షంలో ప్రజల అభీష్టం మేరకు మార్పులు,చేర్పులపై క్షేత్రస్థాయిలో చర్చించాలి. ప్రజల నుంచి సూచనలు స్వీకరించాలి. ప్రస్తు రాజ్యాంగం మూలాలను విడవకుండా పటిష్ట రాజ్యాంగాన్ని పునర్‌ రచించుకునేందుకు సిద్దపడాలి. అలా చేయడం ద్వారా ప్రజలకు రాజ్యాంగ రక్షణ దక్కగలదు. నిరంతరా యంగా రాజకీయ నేతలు పదవులు పట్టుకుని వేలాడడం వల్లనే రాజ్యాంగం అపహాస్యం అవుతోంది. పేదలకు రక్షణ కల్పించలేకపోతున్నది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా పాలన చేస్తున్నారు. తాము చెప్పిందే రాజ్యాంగం అన్నరీతిలో సాగుతున్నారు.

అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందివ్వలేకపోవడం వల్ల రాజ్యాంగం అపహాస్యం అవుతోంది. ఇది రాజకీయ నాయకుల కురుచ బుద్ది వల్ల, స్వార్థం వల్ల, అధికార యావ వల్ల అని తేలింది.అందుకు కారణం రాజకీయాలే అని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆందోళన చెబుతు న్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తి కొరవడిరది.  అంబేడ్కర్‌ పేరు చెప్పి విగ్రహాలు పెట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.పేదరికంపై విజయం సాధించ గలిగే చర్యలు జరగడంలేదు. నిర్ణయాలు ఉండడం లేదు. ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేని జాతీయ విద్యావిధానం అవసరమా అన్నది చర్చించాలి. ఉద్యోగాలు కల్పించలేని చదువులు అవసరమా అన్నది చర్చించాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన దగ్గర్నుంచీ లెక్కలేసుకుంటే ప్రజలకన్నా వ్యాపారులు, కార్పోరేట్లు, రాజకీయ నేతలే బాగు పడ్డారు. వారికోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతూ వస్తున్నారు. వోట్లను కొల్లగొట్టి అధికారం చెలాయిస్తున్నారు. నీతి వాక్యాలు ప్రవచిస్తున్న రాజకీయ నాయకులు అంతా ఇందుకు అతీతం కాదు. రాజ్యాంగం పటిష్టంగా ఉండి..రాజకీయ నాయకుల పెత్తనం లేకుంటే ఇలా అనర్థాలు జరిగేవా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి.  ప్రతిసారి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి చేసే ప్రసంగం ఒక లాంఛనప్రాయమే అయినా రాష్ట్రపతి ప్రసంగాలకు ఎంతో ప్రామాణికత ఉంటుంది.

నిజానికి ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రాష్ట్రపతి చదువుతారు. అలాగే రాష్టాల్ల్రో గవర్నర్‌ ప్రసంగాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు తయారుచేసిన ప్రసంగ పాఠాలను చదువు తారు. అయితే రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఈ సందర్భంగా ఏద్కెనా అభ్యంతరాలు చెప్పిన సందర్భం బహు అరుదు. ఆత్మవిమర్శ చేసుకుని ప్రసంగాన్ని రూపొందించి ఉంటే ఇలా జరిగేది కాదు. అనేకానేక సమస్యల ను ప్రస్తావిస్తూ..పరిష్కరించిన వాటి గురించి ప్రసంగంలో ప్రస్తావించి ఉంటే హుందాగా ఉండేది. ప్రతి రాష్ట్రపతి, తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం మామూలే. కాని, ఇతర రాజకీయ నాయకులు సభలో చేసే ప్రసంగాలు, ఎన్నికల సభల్లో చేసే ప్రసంగాలకు అది భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ గణాంక వివరాలను ప్రస్తావించడం మాత్రమే కాక, దేశ ప్రజలను చ్కెతన్యపరిచే, వారికి ఆత్మస్ఠయిర్యం కలిగించే, భవిష్యత్‌ పట్ల ప్రేరణ కలిగించే అనేక అంశాలు ఇందులో చోటుచేసుకుని ఉండాల్సింది. కాని ఏటా రాష్ట్రపతి, గవర్నర్‌ ప్రసంగాల్లో అలాంటి మార్పులు కానరావడం లేదు. ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని  ప్రసంగాల్లో  చెప్పిస్తున్నారు. ఇందుకు రాష్ట్రపతి, గవర్నర్లను తప్పు పట్టాల్సింది లేదు.

ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే వారు రాసిచ్చిన ప్రసంగం మాత్రమే వారు చదువుతారు. సొంతంగా చేసిన ప్రంగంకాదు కనుక తప్పు పట్టడానికి లేదు. ప్రజలను ఆదుకోవడంలో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రతిపక్షాలు ఎంత నిరసన వ్యక్తం చేసినా పార్లమెంట్‌లో  సమాధానం చెప్పేందుకు  ప్రభుత్వం ముందుకు రావడంలేదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అటు ప్రభుత్వ పక్షాన, ఇటు ప్రతిపక్షాల తరఫున సమర్థంగా మాట్లాడే నేతలు లేకపోవడం కూడా కారణంగా చూడాలి. ఆర్థిక సర్వేలోనే ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.  దీనిపై చర్చించి ముందుకు సాగే ఆలోచన ఎక్కడా కానరావడం లేదు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, వారు గందరగోళం సృష్టిస్తే నెపం వారివిరీదకు నెట్టివేసి తమ ఇష్టారాజ్యంగా బిల్లులను ఆమోదింప చేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది.

పాలకులు అంటే పన్నులు వేయడం..తాము అనుకున్న పనులు చేసుకోవడం… దర్జాగా ఏసీ  గదుల్లో సుఖాలు అనుభవించడం.. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేయడం వంటివన్నీ ప్రజల జీవితాలను పణంగా పెట్టి చేయాల్సిన ఆగత్యం ఉందా అన్నది ఆలోచన చేయాలి. గత కొన్నేళ్లు పార్లమెంట్‌ సమావేశాలు సరిగా సాగడం లేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం,మద్దతు ధరలు,రైతుల సమస్యలు, కరోనా సమస్యల గురించి చర్చ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. మన రాజ్యాంగం పటిష్టంగా ఉన్నా వీటిపై చర్చ జరగక పోవడానికి గల కారాణాలు ఏమిటన్నది ముందు చర్చించాలి. అంటే రాజకీయపెత్తనమే దీనికి కారణమని అర్థం అవుతోంది. ఇలా జరగడం అసవరమా అన్నది ముందుగా ఆలోచనచేయాలి. ఇందుకు గల కారాణాలను చర్చించడంలో తప్పులేదు.

-ఎం. శ్రీనివాస్‌,
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *