లౌకికత్వాన్ని కాపాడుకుందాం..
దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం..
ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను పరిరక్షించుకుందాం…
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో
‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు
(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, ఏప్రిల్ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా సివిల్ సొసైటీ కొన్ని రాష్ట్రాల్లో ఆ పనిలో ఉందని, ఈ పరిస్థితుల్లో తెలుగు కవులుగా తమ బాధ్యత ఏమిటని ప్రశ్నించుకుని, కవులు కవితలు రాసి, వాగ్గేయ కారులు పాటలు రాసి తమ భావాలు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవి, గాయకులు గొంత్తెత్తారు. ఆదివారం సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్….దొడ్డి కొమురయ్య హాల్‌లో జరిగిన కవి గాయక సమూహ గానంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కవి, గాయకులు తమ కవితలు, పాటల రూపంలో ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువల పరిరక్షణకోసం కలం, గళం ఎత్తారు.
ఈ సందర్బంగా జరిగిన ప్రారంభ సభకు సమన్వయ కర్తగా కవి స్కైబాబ వ్యవహరించగా.. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి కె. శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, విజృభించే అవకాశమున్న మనువాదం, దాని అత్యంత బాధితులుగా ఉన్న దళితులు, స్త్రీలు, మైనారిటీలు, ఆదివాసీలు, బీసీలు, సెక్యులరిజం-రాజ్యాంగ పరిరక్షణ, మత సామరస్యం, భరత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రతిష్టించే దుష్ట ప్రయత్నం,
భిన్నత్వాన్న, భిన్న సంస్కృతులను, ప్రశ్నించే గొంతులను కాపాడుకోవడం లాంటి ఎన్నో అంశాలమీద కవిత్వం, పాటలతో సాహిత్యకారులుగా తమవంతు గొంత్తెత్తారు. అన్ని జిల్లాల, అన్ని వర్గాల కవులు, వాగ్గేయకారులెందరో ఈ కార్యక్రంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా మొత్తం 12 సెషన్లలో సభలు జరిగాయి. ఈ సెషన్లలో దాదాపు 200 మందికి పైగా కవులు, రచయితలు పాల్గొన్న కవి, గాయక సమూహగానం కవితలు, పాటలతో ఎంతో సందడిగా..సరదాగానూ సాగింది.





