- యోగాతో శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు పెంపునకు సామర్థ్యం
- ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని, యోగా సాధన చేసే వారందరి శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని ఇస్తుందని రరాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ‘‘యోగా -మనకోసం మరియు సమాజం కోసం’’ అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 నేపథ్యమని, వ్యక్తుల శ్రేయస్సును మెరుగుపరచడానికి , ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేయడానికి యోగా మంచి శక్తిని ఇస్తుందనేది ఈ సంవత్సరం నేపథ్య ఉద్ధేశ్యమని ప్రజలకు తన సందేశంలో పేర్కొన్నారు. 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 సందర్భంగా అందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
మనస్సు, శరీరాల మధ్య సమతుల్యతను సాధించడంలో యోగా సహాయపడుతుందని, రోజూ యోగా సాధన చేస్తే, అది శరీరం మనస్సు యొక్క సంపూర్ణ కలయికలో సహాయపడుతుందని, ఇది సాధన చేసే వారి సర్వతోముఖ శ్రేయస్సుకు సానుకూలంగా దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన నిర్విరామ కృషికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి రోజూ యోగా సాధన చేయాలని ఆయన ్పజలను కోరారు.





