అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
న్యూదిల్లీ,జూన్20: జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్ (పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్ పరీక్ష జరిగింది.
దీనిని ఎన్‌టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. అందులోని వివరాల ప్రకారం.. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని యూజీసీ నిర్దారించింది.
దీంతో పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. తేదీని తరువాత ప్రకటిస్తామని తెలిపింది. అదే సమయంలో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నామని వెల్లడించింది. యూజీసీ నెట్ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ఈ పరీక్షను కేంద్రం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ పరీక్షపై తీవ్ర వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో నెట్ పరీక్షలోనూ అవకతకవలు జరగడం, పరీక్ష రద్దు కావడం సంచలనం సృష్టించింది.





