కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ అధ్యక్షుడి ఎన్నికను మాత్రం ఆ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడాన్ని నిజంగా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న మరో జాతీయ పార్టీ భారతీయ జనతాపార్టీ ఇటీవల తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి కాల వ్యవధిని పొడిగించిందేగాని, కాంగ్రెస్‌లాగా ఎన్నిక జరుపలేదన్న అపవాద మోస్తున్నది. గతంలో కూడా ఆ పార్టీ తన అధ్యక్షులను ఎంపిక చేసిందేగాని, ఆ పదవికి ఎన్నిక జరుపలేదన్న వాదన ఉంది. కాగా, కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తాజాగా అధ్యక్ష స్థానానికి ఎన్నిక జరిపింది. ఈ పోటీలో ఎనబై ఏళ్ళ అనుభవ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించాడు.
ఈ నెల 26న ఆయన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా, ఈ పోటీలో ఓటమిని చవిచూసిన శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గేతో కలిసి పార్టీ అభివృద్ధికి దోహదపడుతానని చెప్పటం ఆహ్వానించదగిన విషయం. కాంగ్రెస్ పార్టీలో పోటీ పడిన అభ్యర్థులు ఆ తర్వాత కాలంలో పెద్దగా కలిసి ఉండడం అరుదు. కాని శశిథరూర్ స్యయంగా మల్లిఖార్జున ఖర్గే ఇంటికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలపడమన్నది శుభపరిణామం. అయితే నూటా ముప్పై ఏళ్ళ ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నది. అనేక రాష్ట్రాల్లో వర్గపోరు కారణంగా ఆ పార్టీ పరిధి కుంచించుకు పోతున్నది. కేంద్రంలో అధికారం కోల్పోయిన నాటినుండి నేటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఆ పార్టీ అపజయాలనే చవిచూడాల్సి వొచ్చింది. అందుకు సమర్థవంతమైన నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితిలో కొత్త నాయకుడిని ఎన్నుకొవడంద్వారా పార్టీలో కొంత కదలికైతే వొచ్చిందనుకుంటున్నారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న మల్లిఖార్జున ఖర్గే పార్టీలో చాలా సీనియర్ నాయకుడు.
ఎనభై సంవత్సరాల వయస్సులో ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నారు. దాదాపు 24 ఏళ్ళ తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఆయన ఎన్నికకావడం విశేషమే. అయితే ఆయన ఈ పదవికి ఎన్నిక కావడానికి ఒక విధంగా గాంధీ కుటుంబమే కారణమన్నది తెలియందికాదు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలను చవిచూస్తున్న నేపధ్యంలో వారి కుటుం•ంపై వొచ్చిన మచ్చను తొలగించుకు నేందుకు తమ కుటుంబేతర వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలన్న వారి దృఢ సంకల్పం ఖర్గేకు అవకాశంగా మారింది. ఇందుకు గాంధీ కుటుంబ సహకారం పూర్తిగా లభించిందన్న విషయం జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా రాహుల్‌గాంధీకి అతి సన్నిహితుడిగా మెదలుతున్న ఖర్గే రాహుల్ ఆలోచనలను పార్టీలో ఏ మేరకు అమలు చేస్తారన్నది చూడాల్సిఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గేకు పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలపై సంపూర్ణ హక్కు ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇంతవరకు సోనియా, రాహుల్ పార్టీ అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని పరిష్కరిస్తుండగా ఇప్పుడు ఖర్గేకు ఆ స్వేచ్ఛ లభించింది. ముఖ్యంగా పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాహుల్‌గాంధీ లక్ష్యాన్ని ఖర్గే ఏమేరకు అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే పార్టీలో యువకులకే ప్రాధాన్యత నిస్తానని చెప్పడం ఇక్కడ గమనార్హం. రాబోయే ఎన్నికల్లో టికెట్ చాలా వరకు యువకులకే ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం చూస్తే రాహుల్ తన ఆలోచనను ఆయన ద్వారా అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సమర్థతకు పరీక్షా సమయంకూడా దగ్గరే ఉంది. ఆయన ఎన్నిక సమయంలోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ప్రకటన వెలువడింది. గుజరాత్ మాడల్ అంటూ దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసుకుంటున్న ఆ రాష్ట్ర నాయకద్వయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంవాఖ మంత్రి అమిత్‌షాను ఆయన ఎదుర్కోవాలంటే అందుకు తమ పార్టీని ముందుగా సిద్దంచేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద పడింది. మొదటినుండీ కాంగ్రెస్‌పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నది తెలియందికాదు. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రకటనలు చేయడం, పార్టీని ఇరుకున పెట్టడం కొత్తేమీకాదు. అలాంటి స్థితినుండి పార్టీని తన నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అలా కాదని పూర్వంలాగా ప్రతీ అంశంమీద గాంధీల సలహా, సంప్రదింపులకే పరిమితమవుతాడా అన్నది ముందుముందుగాని తేలదు. మరో పద్దెనిమిది నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్తానానికి సవాల్‌గా నిలువనున్నాయి. వాటన్నిటికన్నా ముందు రేపు తెలంగాణలోని మునుగోడు లో జరుగనున్న ఉప ఎన్నిక ఆయనకు మొదటి పరీక్షగా నిలువనుంది.




