ఒంటరితనం
పెల్లుబుకెత్తిన క్షణాల్లో
ఎద ఇముడ్చుకోలేని
జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా,
ఆవేదనలే సుడిగాలులై
హృదిని అతలాకుతలం
చేస్తోన్న సమయంలో,
గొంతుగోడలో కూరుకుపోయిన,
తరలిరాని గత స్మృతులను
మననం చేసుకొంటోన్న
అలసిన నిస్సహాయ మనసు
బాధిస్తూ,రోదిస్తూ
శిశిరపు వాకిట నిలిచి
నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే
జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా,
అవధులు లేని గగనతలంలో
విహరిస్తోన్న మౌనానికి
ఎన్ని ఊసుల బాసటో…
మౌనం మాట్లాడడమంటే
ఇదే కాబోలు.
మౌనం ఎంత గొప్పది
ప్రశ్నా తనదే,జవాబూ తనదే
అక్కడే పోరాటం
అందులోనే ఆరాటం
అదో చీకటి గుహ
నిర్ణయాలే వెలుగు.
– వేమూరిశ్రీనివాస్‌,99121 28967,  ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *