మోదీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలన్న ఖర్గే మాటలు

నిస్తేజమా….నిర్వేదమా?

వొచ్చే లోకసభ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్రమోదీని గెలిపిస్తే, అవి దేశానికి చివరి ఎన్నికలంటూ  కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్న తీరుపై పలువురు  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సారధ్యంలో కొనసాగుతున్న ఎన్‌డిఏ కూటమిని ఓడిరచేందుకు కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలియన్స్‌) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి ఎన్నికలకు ముందే  విడిపోతుండడంతో  బిజెపిని ఓడిరచాలన్న  ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్‌ లక్ష్యం దెబ్బతింటున్నది. ఒకవేళ అదే జరిగితే ఇక కనుచూపుమేరలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమన్నది మిధ్యగానే మారే అవకాశంలేకపోలేదు. అది ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది. ఈసారి బిజెపి అధికారంలోకి వొస్తే ఇక ఎన్నికలన్నవి      ఉండవని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల డెహరాడూన్‌లో రాహుల్‌ భారత్‌ జోడో న్యాయయాత్ర ర్యాలీని ప్రారంభిస్తున్న  క్రమంలో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఒడిసాలోని భువనేశ్వర్‌లో మరోసారి పునరుద్ఘాటించడం గమనార్హం.

కొద్ది కాలం క్రింత అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరిగేనాటివరకు కూడా కాంగ్రెస్‌లో వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో నరేంద్రమోదీని మూడవసారి ప్రధానిని కానివ్వమన్న నమ్మకంగా ఉండిరది. కాని, ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇండియా కూటమిలో లుకలుకలు మొదలైనాయి. అంతకు ముందు కూటమిలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం కావాలనుకున్నవారు కూడా ఆ పార్టీకి దూరంగా ఉండడం గమనార్హం. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆయా పార్టీలు  మరింత దూరాన్ని పాటిస్తున్నాయి.  భారతీయ జనతాపార్టీ విధానాలను మొదటినుండీ వ్యతిరేకిస్తూ వొచ్చిన దిల్ల్లీ కేంద్రంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలు కూటమి నిర్ణయాలకు భిన్నంగా ప్రకటనలు చేయడం గమనార్హం. దిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్న లోకసభ ఎన్నికల్లో తమ పార్టీలు ఒంటరిగానే పోటీచేస్తాయని ప్రకటించడం కూటమి విచ్చిన్నానికి దారితీసింది. అయితే బీహార్‌ సంఘటన మరింత దారుణంగా మారింది. వాస్తవంగా కూటమిని కూడగట్టడంలో ప్రధాన పాత్ర నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఒక విధంగా కూటమికి పెద్ద షాకే ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలోని  జెడియు, ఆర్జెడి కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా బిజెపితో చేతులు కలిపి, బీహర్‌లో కూడా బిజెపీ అనుకూల వాతావరణాన్ని కల్పించడం ఇండియా కూటమికి, ముఖ్యం గా కాంగ్రెస్‌కు మింగుడు పడకుండా పోయింది. ఈ సంఘటన దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపేదిగా మారింది. ఎన్డీయేకు కీలక నేతగా వ్యవహరించిన నితీష్‌ ఎన్డీఏను ఇబ్బందిలో పడేసినట్లు అయింది. ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పుడు పాట్నాలలో జరిగిన మొదటి సమావేశం ఆయన అధ్యక్షతనే జరిగింది. ఆ తర్వాత బెంగుళూరు, ముంబైలలో జరిగిన సమావేశాల్లో కూటమిని కాంగ్రెస్‌ హైజాక్‌ చేసిందన్న ఆలోచనతోపాటు, తనకు ప్రాధాన్యత తగ్గుతున్నదన్న అభిప్రాయమే నితీష్‌కు మార్‌ బిజెపితో చేతులు కలుపడానికి కారణంగా మారినట్లు తెలుస్తున్నది. దీనికితోడు ఎంపి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అడిగిన స్థానాలను కాంగ్రెస్‌ ఇవ్వలేదని అలిగిన ఆ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌తో దూరం పాటిస్తుండడం, కేరళలో ఇప్పటికే సిపిఎం, కాంగ్రెస్‌కు సరిపడక పోవడంలాంటి పలు సంఘటనలు ఇండియా కూటమి సంఘటితం కావడానికి బదులు ఎవరికివారే అన్నట్లుగా తయారైంది. కూటిమి ఏర్పడినప్పుడు దాదాపు 26 రాజకీయ పార్టీలు అందులో భాగస్వామ్యమైనాయి. అయితే పైన పేర్కొన్న పార్టీలే  అంతోఇంతో ఎంపీ సీట్లు కలిగి ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ చిన్నచితక పార్టీలు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే  ఇంకా ఒంటరి పోరు చేయాలనుకుంటున్న పార్టీలేవైనా ఉంటే ముందుగానే ప్రకటించాలని తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ పేర్కొనడం కూడా గమనించాల్సిన విషయం. కూటమి పార్టీలన్నీ కలిసి ఉండాలని, ఒకే గొంతుక వినిపించేవిగా ఉండాలేగాని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన మీడియాద్వారా స్నేహ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఖర్గే బిజెపిపై చేసిన విమర్శ నిస్తేజంగా చేసిందేనని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తు న్నారు. మరోసారి మోదీకి అధికారమిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందంటున్న ఖర్గే, రష్యా  అధ్యక్షుడు పుతిన్‌లా మోదీ నియంతగా తయారవుతాడని, తనకు అనుకూలంగా అవసరమైతే రాజ్యాంగంలో సవరణలుచేసే అవకాశం కూడా లేకపోలేదని ఆయన ప్రజలను హెచ్చరిస్తున్న తీరు తమ గెలపుపై   ఆ పార్టీకి అపనమ్మకాన్ని చెప్పకనే చెబుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి లేని రాష్ట్రాల్లోని నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలను ఇడి, ఇన్‌కం ట్యాక్స్‌ సంస్థలను ప్రయోగించి లొంగదీసుకోవాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నదని అందుకే వోటర్లు ఈ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించకపోతే, ప్రజాస్వామ్యంలో ఇవే ఆఖరి  ఎన్నికలవు తాయంటున్న ఖర్గే మాటల్లో నిర్వేదం ధ్వనిస్తున్నదంటున్నారు.

 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *