గురునానక్ ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే…
- కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం
- ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం
- పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేశానికే కాకుండా ప్రపంచానికే ప్రేమ, సోదరభావం, సహనం యొక్క మార్గాన్ని చూపించారని రాహుల్ గాంధీ అన్నారు. కానీ నేడు నరేంద్ర మోడీ నేతృత్వంత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుందని మండిపడ్డారు. అయితే పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ భయం, హింస, ద్వేషానికి చోటు లేదని అన్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టి విధానాలతో పారిశ్రామిక, తయారీ కేంద్రంగా ఉన్న లుథియానాలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలను మోడీ నాశనం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఎంపిక చేసిన ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తున్నదని, చిన్న వ్యాపారుల కోసం కాదని రాహుల్ అన్నారు.
లూధియానాకు చైనాతో పోటీపడే అవకాశమున్నా కేంద్ర ప్రభుత్వం అలా తయారు చేయడంలో విఫలమైందని రాహుల్ గాంధీ అన్నారు. మాంచెస్టర్‌కన్నా లూధియానాకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నా ప్రధాని మోదీ నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి విధానాలతో నష్టం వాటిల్లిందన్నారు. వ్యాపారులకు మద్దతు ఇవ్వడంలో, సహాయం చేయడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. దేశంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషం, భయం, హింసను ఎదుర్కునడానికే తాను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర ప్రారంభించానన్నారు. సోదరుల మధ్య, వివిధ కులాలు, వర్గాల మధ్య పరస్పరం ద్వేషం రాజేస్తున్నారన్నారు. ఈ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడి వేరే మార్గంలో నడవడానికే తాను యాత్రను ప్రారంభించానన్నారు. ‘‘నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్ రహే హై’ అన్నారు. యాత్రలో ద్వేషం కనిపించదని, ఎవరూ మీ కులం లేదా మీ మతం ఏమిటని అడగరని అన్నారు.
పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
దేశ సమైఖ్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సెప్టెంబర్ 7న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 118వ రోజు గురువారం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగింది. ఉదయం లూధియానా దోరాహా నుండి ప్రారంభించగా పంజాబ్ పిసిసి అధ్యక్షులు అమరిందర్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ ఛత్రీ, స్థానిక పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా లూధియానాలో ప్రజలు రోడ్డుకిరువైపులా నిలబడి చేతులూపుతూ, జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సమ్రాలా చౌక్ చేరుకోగా అక్కడ ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. మార్గమధ్యంలో నంద్‌పూర్ గ్రామంలో సాధారణ రైతు కర్మ్ సింగ్ ఇంట్లోకి వెళ్లి కాసేపు కష్టసుఖాలు తెలుసుకున్నారు. గురువారం యాత్ర మొత్తంగా 25 కిలోమీటర్ల మేర సాగింది.




