తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ నాయకగణం విరుచుకుపడింది. వాస్తవంగా అనేక గ్రామాల్లో పది గంటలపాటు కూడా విద్యుత్ ఉండటంలేదని ఆరోపిస్తుంది. వివిధ సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరాపై నమోదు అవుతున్న లాగ్ బుక్‌లను పరిశీలించిన తర్వాతే తామీ ఆరోపణ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షాలను మీడియా ముందు పెట్టడంతో అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ వొచ్చాయి. ఇప్పుడు బిబెపి డబుల్ బెడ్ రూమ్‌ల కేటాయింపు విషయాన్ని తీసుకుని అధికార పార్టీపై బాణాన్ని ఎక్కుపెట్టింది. వాస్తవంగా డబుల్ బెడ్ రూమ్‌ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు నేడు జరుగుతున్న పనితీరుకు పొంతన లేకుండా పోయిందంటూ బిజెపితో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు చాలాకాలంగా ఆరోపిస్తూనే ఉన్నాయి.
రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పటి నుండీ చెబుతూనే ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన సింగిల్ బెడ్ రూమ్‌లు కనీస నివాస యోగ్యంగా లేవని, ఒక ఇంట్లో పెండ్లి కావాల్సిన పిల్లలు లేదా అల్లుడు వొస్తే ప్రత్యేక గది లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారంటూ అందుకు డబుల్ బెడ్రూములు కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాక్షత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పలుమార్లు పలు సభల్లో పేర్కొన్న విషయం తెలియంది కాదు. నిరుపేద వర్గాలకు ఆత్మగౌరవానికి ఈ ఇళ్ళు ప్రతీకగా నిలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. మనిషికి కూడు, గుడ్డ ఎంత అవసరమో గూడు కూడా ప్రాథమిక అవసరాల్లో అంత ముఖ్యం అంటూ ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ ఇళ్ళ నిర్మాణంలో జాప్యం జరుగుతూ వొస్తుంది. ఇందుకు కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడం, నిర్ణయించిన బడ్జెట్లో ఇళ్ళను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం లాంటి కొన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తప్పలేదు. అయితే నిర్మాణం చేసిన వాటిని కూడా పేద ప్రజలకు అప్పగించక పోవడం లాంటి సమస్యలు కూడా లేకపోలేదు. జరుగుతున్న జాప్యంతో లబ్దిదారులుగా భావిస్తున్న కొందరు బలవంతంగా ఇళ్ళలో ప్రవేశించడం, ప్రభుత్వం వారిని ఖాళీచేయించడం లాంటి తంతు జరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వొచ్చే ఆగస్టులో డబుల్ బెడ్ రూమ్‌ల కేటాయింపు జరుగుతుందని ఇటీవల రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో నిర్మాణమైన వాటి విషయాన్నే ఆయన ప్రకటించినట్లు తెలుస్తున్నది.
ఈలోగానే కట్టిన ఇళ్ళను పరిశీలిస్తామంటు బిజెపి నాయకులు బయలుదేరటం పెద్ద గందరగోళానికి దారితీసింది. బాట సింగారంలో కట్టిన ఇళ్ళను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంఎల్ఏ రఘునందన్‌రావులు బయలుదేరటం, వారిని పోలీసులు అడ్డుకోవడం కాస్తా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఇటీవలనే కిషన్‌రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అప్పటికి ఆయన ఆ పదవిని చేపట్టక పోయినా ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. తామేమీ ధర్నాలు చేయడానికో, సమావేశాలు నిర్వహించడానికో వెళ్ళడం లేదని, కేవలం వాటి నాణ్యతను పరిశీలించడానికి కూడా వెళ్ళనివ్వకపోవడం పట్ల కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాట సింగారం ఇళ్ళ నాణ్యతను పరిశీలించేందుకు బయలుదేరుతున్నారన్న సమాచారంతో పలువురు బిజెపి నాయకులను రాష్ట్ర పోలీసులు గృహనిర్భందం చేయడంతో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. కట్టిన ఇళ్ళను చూడడానికి తమకు అనుమతించడం లేదంటేనే వాటి నాణ్యత సరిగాలేదని పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్లేనని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా మంచి నాణ్యతతో కట్టి ఉంటే ప్రభుత్వానికి భయమెందుకంటున్నారు. ఈ ఇళ్ళ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని అందుకే తాము వాటిని చూడాలనుకుంటున్నామంటున్నారు బిజెపి నాయకులు.
ముఖ్యంగా కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి దేశంలో ఎక్కడైన తిరిగే అధికారం ఉందంటుండగా, మణిపూర్‌కు ఎందుకు వెళ్ళడం లేదని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బిఆర్ఎస్ ఎదురు దాడి చేస్తుంది. ఒక డబుల్ బెడ్ రూమ్‌పైన కేంద్ర ప్రభుత్వం కేవలం లక్షా 50 వేలు మాత్రమే ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల 65 వేల రూపాయలను వెచ్చిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అంటున్నారు. నిజంగానే పేదల ఇళ్ళపై రాష్ట్రంలోని బిజెపి నాయకులకు ప్రేమ ఉంటే ఈ ఇళ్ళ విషయంలో కేంద్రం నుండి రావాల్సిన 600 కోట్ల రూపాయలను ఇప్పించాలని ఆయన వారిని సవాల్ చేస్తున్నారు. తొమ్మిదేళ్ళ కాలంలో ఏనాడు పేదల ఇళ్ళపైన లేని ప్రేమ ఇవ్వాళే బిజెపికి పుట్టుకు రావడమన్నది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని శ్రీనివాసయాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. అంతేకాదు గతంలో డబల్ బెడ్ రూమ్‌ల ప్రారంభోత్సవానికి కిషన్‌రెడ్డి తనతోపాటే పాల్గొన్నారని, ఇప్పుడు కూడా వొస్తానంటే తానే దగ్గరుండి తీసుకు పోయేవాడినని మంత్రి చెబుతున్నారు. మొత్తానికి నిన్న కాంగ్రెస్ కరెంట్‌తో ఇవ్వాళ బిజెపి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ అంశంతో అధికార బిఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.




