పూర్తి సబ్సిడీతో అందించే విధంగా జిఓ జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలోని బిసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని సిఎం స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని సిఎం అన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునీ తహజీబ్‌ను కాపాడే పక్రియ కొనసాగుతూనే వుంటుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


