తక్షణం అమలులోకి రానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది తక్షణం అమల్లోకి వొస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము(ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వొచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది.
ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వొచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటి దాకా అటవీ శాఖ వసూలు చేస్తున్నది. ఇలా వొచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్లిక్ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తుంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నారు. జాతరకు వొచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ కోరింది.



