ప్రవహించే కాలవాహినిలో
దిగజారిపోతున్న
మానవతావిలువలకు దర్పణంగా,
మృగాళ్ల అకృత్యాలకు సాక్షీభూతమై
లోకం వెలుగు చూసిన,
కామాతురతతో
ఆటల కొమ్మకు పూసిన
ఓ విషపు పువ్వు,
దాని రక్షణకై
దృఢమైన కంచె.

ఓ అభాగినిల్లారా!
మీ పోరాటం స్ఫూర్తిదాయకం.
నిశిదారులెప్పటికైనా
వేకువతోవకు
చేరక తప్పదని గుర్తెరిగి,
ఎవరి సహాయం కోసం
ఎదురు చూడక,
ఆత్మవిశ్వాసపు నడకయై,
ఎన్నో విజయాల్ని రుచి చూసిన
మీ చేతుల్తో
అహంకారపు ముళ్లపొదల్ని
తొలగించి,
పశువులకన్నా హీనంగా
ప్రవర్తించేవారికి
కళ్ళూ, ఒళ్ళూ కుళ్ళిపోయే
శిక్షలు విధించండి.
అవే పొదల మధ్యలోంచి
పొంచి చూసే
మేకవన్నె పులుల
కోరలు పీకేయండి.

అప్పుడే…
కారుచీకటిలో సైతం
చిరుదివ్వెలై మెరవగలరు.
మరిన్ని నిశి నేత్రాలకు
ప్రేరణల శశియై నిలవగలరు.

– వేమూరి శ్రీనివాస్‌
                    9912128967
                     ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *