ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి

  • వరదలతో ప్రజల్లో ఆందోళన
  • ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు
  • రామప్ప ఆలయంలోకి వరద నీరు
  • ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు

ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ ‌దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు దగ్గర గోదావరి ఉగ్రరూపం చూపిస్తుంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంతం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్‌ అలెర్ట్ ‌జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18.89 వి•టర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ఎడతెరిపిలేని వర్షాలతో అన్నదాతకూ అపారనష్టం వాటిల్లింది.

లక్షల ఎకరాల్లో పంటలు నీటముని దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నీరే దర్శనమిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి నది తన మహోగ్రరూపంతో వణికిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భీకరంగా పోటెత్తుతుంది. ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటడంతో తీర ప్రాంతాల్లోని గ్రామాలు జలమయం అయ్యాయి. వేలాదిమంది జనం నిరాశ్రయులయ్యారు. రెండు జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల జోరు ఇంకా తగ్గక పోవడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి తీరంలో ఉన్న గ్రామాల్లోకి బ్యాక్‌ ‌వాటర్‌ ‌చేరటంతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.

విద్యుత్‌ ‌సరఫరా నిలిచి పోవటంతో పాటు నిత్యావసర సరుకులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి ఈ స్థాయిలో ఉప్పొంగడం 1986లో జరిగిందని, 36 ఏళ్లకు ఇప్పుడు మళ్లీ ప్రవహిస్తుందని చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతుంది. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతుంది.

రామప్ప దేవాలయం ఇసుక దిబ్బపై ఎంతో నేర్పు, పరిజ్ఞానంతో నిర్మించిన రాతి కట్టడం కావడంతో అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటుంది. పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలంలో ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రామప్ప ఆలయం చుట్టూ వరదనీరు చేరడంతో నలుమూలలా మురుగుకాల్వల్లో పూడిక మట్టి చేరింది. రామప్ప ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 2020లో ఆలయం ఈశాన్య భాగంలోని ప్రహరీ వర్షాలకు కూలింది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. 2017లో ఆలయానికి వెళ్లే మార్గంలో.. ప్రస్తుత పార్కింగ్‌ ‌స్థలానికి దగ్గరలోని శివాలయం కూడా కూలి పోయింది.

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు
ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. మేఘావృతంగా ఉండి ముసురు కురుస్తున్నా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వొచ్చారు. ఆరు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. జిల్లాలో అతి పెద్దదయిన ఖానాపూర్‌ ‌మండలంలోని పాకాల చెరువు 30 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి పోసింది. దుగ్గొండి మండలంలోని గుండం చెరువు, చెన్నారావుపేటలోని ముత్తడి చెరువు, నర్సంపేటలోని మాధన్నపేట చెరువు, నల్లబెల్లిలో రంగాయ చెరువు మత్తడి పోస్తున్నాయి. వర్షాలతో నగరంలో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా వరదనీరు సాఫీగా వెళ్లేలా బల్దియా అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నదాతలు తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు కొంటూ దుక్కులు దున్నుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *