మునుగోడులో ఒక్కసారే తుఫాన్ ముందుండే నిశ్శబ్దం ఆవరించింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు, మోగిన కారు హారన్‌లు, ర్యాలీలు, నినాదాలు, చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ మంగళవారం మౌనం దాల్చడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు గత నెల రోజులుగా పలు రాజకీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరకు ఏమైతేనేమి నియోజకర్గం కాస్తా తెరిపిచ్చింది. అయితే ఇది తుఫాన్ ముందుండే ప్రశాంతతలా ఉంది. ఈ నెల మూడవ తేదీన తమ ప్రతాపమేమిటో చూపించేందుకు ఇక్కడి ప్రజలు నివురు కప్పిన నిప్పులా కాచుక్కూర్చున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు వేలాది మంది నియోజకవర్గంలో మకాం వేశారు. దాదాపు అన్ని గ్రామాల్లో వీరు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో ప్రతీ గ్రామం కోలాహలమయమైంది. పార్టీలు విసురుకునే విమర్శనాస్త్రాలు, ప్రత్యక్ష, పరోక్ష దాడులతో నిన్నటివరకు యావత్ నియోజకవర్గం రణరంగంగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం అయిదు గంటలతో ఈ మొత్తం ఎపిసోడ్‌కు తెరపడింది. గ్రామస్తులు మినహాయించి, వివిధ ప్రాంతాల నుండి వొచ్చిన వారంతా ఈ ప్రాంతం విడిచి వెళ్ళాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చేసిన సూచన మేరకు ప్రచారకులంతా తమ సూట్‌కేసులు సదురుకున్నారు. ఇంతకాలం వివిధ ప్రలోభాలకు లోనుచేసి, డబ్బు ఆశచూపి ఉండడంతో యావత్ నియోజక వర్గంలో ఈ సాయంత్రం నుండి విస్తృత తనఖీలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమయింది.
వాస్తవంగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడానికి ముందునుండే ఇక్కడ ఎన్నికల వేడి రాజుకోవడం ప్రారంభమయింది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దని కాంగ్రెస్, టిఆర్‌ఎస్, భారతీయ జనతాపార్టీలు దాదపు రెండు నెలలకు పైగా ఈ నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ వొచ్చాయి. సిట్టింగ్ స్థానమని కాంగ్రెస్, తెలంగాణను ఖబ్జా పెట్టేందుకు ఇక్కడి గెలుపు అనివార్యంగా భారతీయ జనతాపార్టీ, ఇటీవలె ప్రకటించిన జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌కు ఇదే చంపుడు పందెం కావాలని టిఆర్‌ఎస్ తమ శక్తి వంచన లేకుండా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి. వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కో తీరును అవలంబించాయి. ఈ మధ్య కాలంలో వొచ్చిన దసరా, దీపావళి పండుగలను కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా జరుపుకున్నాయి. వోటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఇవ్వాల్సిన తాయిలాలను ఇప్పటికే ఆ పార్టీలు అందజేశాయి. ఆయా గ్రామాల ప్రజల సమస్యలన్నిటికీ తమను గెలిపించడం ఒక్కటే మార్గంగా చెప్పుకుంటూ వొచ్చాయి. ఇక మిగిలింది వోటరు తీర్పు మాత్రమే. అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వోటరన్న ఎవరికి విజయాన్ని చేకూర్చేది అంతుబట్టకుండా ఉంది. అభ్యర్థులందరి దగ్గరా అన్నీ పొందిన వోటర్ల నాడిని పట్టుకోవడం సాధ్యపడటంలేదు. తమను ఎటు తేలుస్తారోనని అభ్యర్థులిప్పుడు అంతర్‌మథనంలో పడిపోయారు.
తమ భవిష్యత్ ప్రణాళికకు ఈ ఎన్నిక ఒక మెట్టు అన్నదిప్పుడు అన్ని పార్టీల్లో ఉంది. ఇక్కడ గెలిస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో గర్వంగా తిరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిజెపి, టిఆర్‌ఎస్‌కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను తుడిచి పెట్టేందుకు బిజెపి చాలాకాలంగా ప్రణాళికలు రచిస్తున్నది. దక్షిణాదిలో తమ పార్టీని విస్తృతం చేసేందుకు తెలంగాణ గెలుపే తమకు సరైనదిగా ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పైగా ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక భారతీయ జనతాపార్టీ సృష్టే అన్నది విస్తృత ప్రచారంలో ఉంది. అన్నిటికీ మించి తాజాగా టిఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటంలేదన్న నింద ఆ పార్టీపైన ఉంది. ఉప్పులో నిప్పులా ఉన్న ఈ రెండు పార్టీలు కొంతకాలంగా కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి.
అయితే ఈ ఎన్నికల్లో బిజెపిని జండాకు ఎక్కించడంలో టిఆర్‌ఎస్ విజయవంతం అయిందన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. తనపై వొచ్చిన నిందను బాపుకోవడంతోపాటు, తమను నిందల పాలు చేసిన టిఆర్‌ఎస్‌కు చరమగీతం పాడే కార్యక్రమంలో ఇప్పుడు బిజెపి ఉంది. దాంతో ఇక్కడి గెలుపు ఈ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎంఎల్‌ఏ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాడన్న విషయాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది ఆ పార్టీ. దానితోపాటు కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాలకోసమే పార్టీని, పదవినీ విడిచి పెట్టాడంటూ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ శక్తిమేర కృషి చేసింది కూడా. కాగా, తన రాజీనామా తోనే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందని చెబుతూ వొచ్చిన రాజగోపాల్‌రెడ్డి మాటలను అటు కాంగ్రెస్, ఇటు టిఆర్‌ఎస్ తిప్పికొట్టడంలో పోటీపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల వెనుక ఉన్న అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
గెస్ట్ ఎడిట్ … మండువ రవీందర్‌రావు




