మునిగోడులో గెలిచింది ఎవరు … ఓడింది ఎవరు ?

మునిగోడు ఉప ఎన్నికల్లో వాస్తవంగా గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరన్న విషయంలో రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా నైతికంగా తామే గెలిచామంటోంది బిజెపి. అధికార పార్టీ తన అధికార దర్పాన్ని విస్తృతంగా వాడుకోవడం వల్ల సాంకేతికంగా టిఆర్‌ఎస్‌ ‌గెలిచినా ఆ గెలుపు గెలుపు అనిపించుకోదన్నది బిజెపి వర్గాలంటున్నమాట. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌కు బిజెపి చెమటలు పెట్టించిందనడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్‌ ‌తదితర పార్టీల్లా బిజెపిని అంత సులభంగా ఎదుర్కోలేమన్న విషయం టిఆర్‌ఎస్‌కు అర్థమైంది కాబట్టే నిద్రాహారాలుమాని, ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తేనే అంతంత మాత్రం మెజార్టీ వచ్చిందన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు రాష్ట్ర మంత్రి వర్గమేకాదు, ఆ పార్టీ ఎంపిలు, శాసనసభ్యులు, ఎంఎల్సీలు, జడ్‌పి చేర్మన్‌లు, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారంతా కలిసి వేల సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటేనే టిఆర్‌ఎస్‌ అత్తెసరు మెజార్టీని సాధించింది.

నియోజకవర్గంలోని ఒకటి రెండు మినహా దాదాపు అన్ని మండలాల్లో కూడా రెండు వందల నుండి అయిదు వందల లోపు మెజార్టీనే టిఆర్‌ఎస్‌కు వచ్చాయంటే బిజెపి ఎంత టఫ్‌ ‌ఫైట్‌ ఇచ్చిందన్నది స్పష్టమవుతున్నది. ఇక డబ్బుల విషయానికొస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ వెచ్చించిన నగదు కోట్లలో ఉంటుందన్నది ఇక్కడ జరిగిన పంపకాలను చూసిన వారెవరైనా చెప్పగలుగుతారు. ఒక విధంగా ఈ నియోజకవర్గానికి ఉన్న సమస్యలన్నీ ఇక్కడ వెచ్చించిన డబ్బుతో తీరిపోయేవంటున్నారు స్థానికులు. లక్షలు, కోట్లల్లో డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా వెచ్చించడంలో ఏ పార్టీ తక్కువేమీ తినలేదన్నది మాత్రం వాస్తవం. వాస్తవంగా ముదిగొండలో మొదటినుండి కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ ‌ప్రభావం ఎక్కువ. అతర్వాత టిఆర్‌ఎస్‌ ‌కొంతమేర ఇక్కడ పుంజుకోగలిగింది. కాగా బిజెపికి ఇక్కడ మొదటినుండి స్థానం లభించలేదు. 2014లో బిజెపి ఇక్కడ టిడిపితో పొత్తుతో 27వేలకు పైగా వోట్లు సాధించగలిగింది. కాని, 2018లో వచ్చేసరికి కనీసం డిపాజిట్‌కూడా దక్కలేదు. అప్పుడు బిజెపి సాధించుకున్న వోట్లు కేవలం 12వేల పైచిలుకు మాత్రమే. దానితో పోలిస్తే ఈసారి బిజెపి పరిస్థితి చాలా వరకు మెరుగైంది.

ఈ సారి 86 వేల 485 వోట్లను సాధించుకోవడమంటే ఆ పార్టీకి ప్రజల ఆమోదం మెండుగా లభించిందన్న విషయం స్పష్టమవుతున్నది. అయితే ఆ మాత్రం బిజెపికి వోట్లు పెరగడానికి అభ్యర్థి బలమే కారణంగా విశ్లేషిస్తున్నారు. వాస్తవంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి బలం చూసుకుని ఆ పార్టీ రంగంలోకి దిగిందన్న వాదన ఉంది. ఈ నియోజకవర్గంలో ఆ మాటకు వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచి పట్టున్న విషయం ఎవరూ కాదనలేనిది. ప్రధానంగా రాజగోపాల్‌రెడ్డికి దానధర్మాలు, ఆపదలో ఉన్న వారిని అర్థికంగా హార్థికంగా ఆదుకుంటాడన్న పేరుంది. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో మరింత పట్టు సాధించేందుకు ఆయనపైన ఆకర్ష్ ‌పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారానే ఈ ఎన్నికలను బిజెపి సృష్టించిందన్న విషయం విస్తృత ప్రచారం జరగడం ఒక విధంగా బిజెపికి మైనస్‌ అయిందికూడా. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడంద్వారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల టెండర్‌ను సంపాదించుకోగలిగా డంటూ టిఆర్‌ఎస్‌ ‌చేసిన ప్రచారం వోటర్లమీద తీవ్ర ప్రభావం చూపించింది. దానికి తగినట్లుగా ఆయనకూడా పబ్లిక్‌గా ఆ విషయాన్ని ఒప్పుకోవడం మరింత డామేజీ చేసింది. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన సోదరుడు తమ్ముడి గెలుపుకోసం చేసిన ప్రయత్నాలుకూడా బెడిసి కొట్టాయి. ఇంతటి వ్యతిరేకతలోకూడా ఆయన గత ఎన్నికల్లో 6.5 శాతం నుండి 38.4 శాతానికి వోట్లను గుంజుకు రాగలిగాడంటే తమదే పరోక్ష గెలుపంటున్నాయి బిజెపి శ్రేణులు. ఇక తెరాస విషయానికొస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఆ ‌పార్టీ నాయకుంతా తమ అభ్యర్థి కనీసం ముప్పై వేల మెజార్టీతో గెలుస్తాడన్న ధీమా వ్యక్తంచేస్తూ వచ్చారు.

కాని, వోట్ల లెక్కింపు ప్రారంభంనుండి ఏ మండలంలో కూడా ఆ పార్టీకి రెండు మూడు వందలకన్నా ఎక్కువ మెజార్టీ రాకపోవడం, మొత్తంమీద పదివేల మెజార్టీయే రావడాన్ని పెద్ద విజయమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాత్రం మెజార్టీ రావడానికి ఉభయ కమ్యూనిస్టుల మద్దతేనని, లెఫ్ట్ ‌పార్టీలు సహకరించకపోతే ఆ మెజార్టీ కూడా వచ్చేదికాదని, ఇక్కడ కూడా హుజురాబాద్‌ ‌పునరావృతం అయ్యేదన్న వాదన వినిపిస్తున్నది. ఇకపోతే కాంగ్రెస్‌దంతా స్వయం అపరాధమే. చేతులార తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని కోల్పోయిందాపార్టీ. కాంగ్రెస్‌ ‌కంచుకోటగా ఉన్న నల్లగొండ నాయకులమద్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించడంలో ఆ పార్టీ అధిష్టానవర్గం పూర్తిగా విఫలమవడం ఈ ఫలితాలపై ప్రభావాన్ని చూపించింది. పార్టీ పరంగా అనేక పదవులు అలంకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడిపోతున్నాడన్న విషయం చాలా ముందుగానే ప్రచారంలో ఉన్న ఆయనను నిలువరించుకోలేకపోయింది.

ఉన్న ఆరుగిరిలో ఒకరిని కోల్పోవడంతో ఇప్పుడా పార్టీ ఎంఎల్‌ఏల సంఖ్య అయిదుకు పడిపోయింది. ఒక్క రాజగోపాల్‌రెడ్డినే కాదు ఆ పార్టీలోని హేమాహేమీలు చాలా మంది అటు బిజెపి, ఇటు టిఆర్‌ఎస్‌లో చేరుతున్న అచేతనంగా ఉండడంకూడా ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. చివరకు ఎంతకు దిగజారిందంటే ఇవ్వాళ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ పడిన పాల్వాయి స్రవంతి 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినప్పుడు 27వేల పై చిలుకు ఓట్లు సాధించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తే అంతకు మించి రావాల్సి ఉండగా అంతకు తక్కువగా 23 వేల 906 వోట్లు వచ్చాయి. కాగా 2018 ఎన్నికల్లో వచ్చిన వోట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆనాడు 48.9 శాతం వోట్లు సాధించుకున్న ఈ పార్టీ ఈసారి కేవలం 10.6 శాతానికే పరిమితమైంది. అంటే ప్రజల్లో ఆ పార్టీపట్ల ఆదరణ ఎలా తగ్గుతున్నదన్నది స్పష్టమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *