23,890 గ్రామాలు, ఆవాసాలకు, 142 పట్టణ స్థానిక సంస్థలలో 100 శాతం తాగునీటి సౌకర్యం
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 6 వేల కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు
గ్రామీణ ప్రాంతాల్లో 57 లక్షల కుటుంబాలకు, 23,511 స్కూల్స్‌కు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ కింద తాగునీరు
ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన కేంద్రం
తెలంగాణలో ఒకనాడు ఎండాకాలం వొస్తుందంటే చాలు తాగునీటి కోసం మహిళలు పడే ఇబ్బందులు వర్ణణాతీతం… బిందెలు పట్టుకుని ఎండలో కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకునే వారు. పట్టణాల్లో నల్లాల వద్ద బిందెలతో కొట్లాటలు నిత్య కృత్యం. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నప్పటికి. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకలేదు. వందల అడుగుల లోతునఉండే భూగర్భ జలాలులో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేది. పాలకుల నిర్లక్ష్యానికి ఫ్లోరోసిస్‌తో ప్రజలు నడి వయస్సులో నే కాళ్ళు వంకర పోయి వృద్ధులయ్యేవారు. చెంతనే గోదావరి వున్నప్పటికి సురక్షిత తాగునీరు అందక ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వర్షాకాలంలో మురికి నీరు తాగుట వలన నీటి కారక వ్యాధులతో మంచం పట్టిన ఏజెన్సీ అనే వార్తలు వొచ్చేవి. దశాబ్దాల పాటు ప్రభుత్వాలను వేడుకున్నప్పటికీ ప్లోరోసిస్ సమస్య పరిష్కారం కాలేదు. నాడు చట్ట సభల్లో తాగునీటి సమస్య చర్చనీయాంశమైంది. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు ఆందోళనలు నిత్యం జరిగేవి. ఉమ్మడి పాలకుల వివక్షకు చేతకానితనానికి ఇదొక నిదర్శనం.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో అన్ని సమస్యలకూ పరిష్కారం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఉద్యమనేతే అయిన కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడంతో మహిళల కష్టాలు తొలగాయి. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిన మంచినీటి పథకం అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయుటకు రూ.45 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా జల జల పారే నీటిని వొడిసిపట్టి ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధిచేసి పైపుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్లు చొప్పున సరఫరా అవుతున్నది. ఏటా 68 టీఎంసీ ల తాగునీటిని సరఫరా చేస్తున్నది. 2048 సంవత్సరం నాటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో 86.11 టీఎంసీల నీటిని సరఫరా చేయుటకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. కృష్ణా గోదావరి జలాలను మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ లోని ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్నది.
మిషన్ భగీరథ పథకానికి అనేక అవార్డులు లభించాయి. వినూత్న వరవడితో నల్లాల ద్వారా నది జలాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం యొక్క కృషిని మన్ కి బాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. నీతి ఆయోగ్, జల శక్తి మంత్రిత్వ శాఖ, 15వ ఆర్థిక సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రశంశలు అందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీటిని నల్లాల ద్వారా రెగ్యులర్‌గా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మిషన్ భగీరథ పథకాన్ని ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా ప్రభుత్వం అమలు చేస్తున్నది. భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ ప్రాజెక్టు ను 26 సెగ్మెంట్‌లు, 34 సబ్ సెగ్మెంట్స్‌గా విభజించారు. 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే దశాబ్దాల తాగునీటి సమస్యను పరిష్కరించి పరిపాలనా దక్షతను చాటుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంకు దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చారు.




