మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు

జయశంకర్‌ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, జనవరి 10:  మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావుఅలియాస్‌ దామోదర్‌ (అలియాస్‌ మల్లన్న)ను ఆ పార్టీ నియమించినట్లు సమాచారం.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతోపాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఛత్తీస్గఢ్‌ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు. గతంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి 21, జూన్‌ 2021లో మృతిచెందిన విషయం విదితమే. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది.

ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు మావోయిస్టు నేత ఆజాద్‌ సైతం తనవంతు ప్రయత్నాలు  చేయగా,చివరికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ అలియాస్‌ మల్లన్నను నియమించింది.  ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు,ఏఓబీ రాష్ట్ర జోనల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, పీఎల్బీఏ బెటాలియన్‌ కమాండర్‌ మడివి హిడ్మా అలియాస్‌ హిద్మాతోపాటు మరికొందరు కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కారావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్న బడే చొక్కా రావు బాధ్యతలు చేపట్టడం గోదావరి పరిపాక ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ పట్టు సాధించేందుకు చర్యలకు శ్రీకారం చెప్పినట్లుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *