కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు బహిర్గతం
ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్ నేతల ప్లాన్
మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన
రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు
బిఆర్ఎస్ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ
విూడియా సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమపై తప్పులు తోసే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరంలో నిజానిజాలను తెలియచేసేందుకు మార్చి1న ‘ఛలో మేడిగడ్డ’కు కెటిఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మాజీ మంత్రులతో కలసి తెలంగాణ భవన్లో కేటీఆర్ విూడియాతో మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలు కొట్టుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు తక్షణమే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అనేక ప్రాజెక్టులకు ఇలాంటి దుస్థితి వొచ్చిందని కొన్ని రుజువులు చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వల్లే పాతాళ గంగ పైకి వొచ్చిందని.. భూగర్భ జలమట్టం పెరిగిందని అన్నారు. తెలంగాణలో ఎత్తిపోతలకు తప్ప మరోమార్గం లేదని అన్నారు. ఇందుకోసం ఎంతడబ్బయినా ఖర్చుచేసి నీరు వాడుకోవాల్సిందేనని అన్నారు. ప్రజల అవసరాల ముందు డబ్బు ఖర్చు లెక్క కాదన్నారు. అయితే ఈ వాస్తవాలను వక్రీకరించి కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు నీరు కావాలంటే ఎత్తి పోయాల్సిందేనని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితి అలా ఉందని, మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇంజినీర్స్ చెప్పారు కాబట్టే ఎత్తిపోతలకు డిజైన్ చేశామని కేటీఆర్ వివరించారు. ఖర్చులు, లాభాల లెక్కలు వేస్తే హాస్పిటల్స్, ఐఐటిలు కట్టొద్దని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీళ్లు రాకుండానే తెలంగాణ భూముల ధరలు పెరిగాయా..అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. అసలు పనిని తాము చేశామని.. మిగిలిపోయిన కొసరు పని చేయకుండా తమను బద్నాం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. మార్చ్ 1న ‘చలో మేడిగడ్డ’కు ఉదయం 8 గంటలకు 200 మందితో మేడిగడ్డకు వెళ్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలందరితో కలిసి దశల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి కాంగ్రెస్ వాళ్లు వొస్తానంటే వాళ్లను కూడా తీసుకెళ్తామన్నారు. అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. దురదృష్టవశాత్తు రెండు పిల్లర్లకు పగుళ్లు వొచ్చాయని..గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు కేటీఆర్. బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ కూలిందని గుర్తు చేశారు. తెలంగాణలో కడెం ప్రాజెక్టు, సింగూరు, మూసి గేట్లు కొట్టుకుపోయాయని, గుండ్లవాగు ప్రాజెక్ట్ సైతం కొట్టుకు పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
గుజరాత్లో మచ్చు ప్రాజెక్ట్ కూలిపోతే 2వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో మూడు పియర్స్ కుంగితే సరి చేయొచ్చని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ కట్టి రీపేర్ చేయొచ్చన్నారు. మేడిగడ్డపై విచారణ చేయాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తమ విూద ఉన్న కోపాన్ని రైతులపై చూపొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి పొలిటికల్ మైలేజి పొందే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవుచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరుతో ఇచ్చిన బిల్డప్ చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలంటించారు. ముందు చేయాల్సిన పని చేయండని ప్రభుత్వ పెద్దలకు హితవుచెప్పారు. కాగ్ రిపోర్ట్ భగవద్గీత కురాన్, బైబిల్ కాదని గత కాంగ్రెస్ పాలకులే చెప్పారని పేర్కొన్నారు. ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమానికి అవసరమైతే అనుమతి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో కాళేశ్వరం వెళ్లి.. దశలవారీగా అన్ని చోట్లకు వెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న అధికార కాంగ్రెస్ నేతలకు చూపిస్తామని స్పష్టం చేశారు. దశల వారీగా ప్రాజెక్టును సందర్శించి..ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. అధికార కాంగ్రెస్ మేడిగడ్డపై చేస్తున్న కుట్రను బహిర్ఘతం చేస్తామని కేటీఆర్ అన్నారు. పాడైన బ్యారేజీలు మరమ్మతుకు ఇంజినీరింగ్ పరిష్కారాలు ఉన్నాయని, ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆ 3 పిల్లర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించవచ్చునని, మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే..అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే తాము చెప్పామన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలని, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు నిర్వహించాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని కోరారు. రానున్న వర్షాకాలంలో వొచ్చే వరదతో 3 బ్యారేజీలను కొట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా నేతలు డ్రామాలు ఆపి పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.





