కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒక వైపు హ్యాట్రిక్ సాధించేందుకు అధికార బిఆర్‌ఎస్ అనేక పథకాలను రచిస్తూ, నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల ముందు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆపార్టీకిప్పుడు కలిసి వొచ్చింది. ఈ ఉత్సవాలను ఒక రోజుతో ముగించకుండా దాదాపు 22 రోజులపాటు రాష్ట్రంలో గత తొమ్మిదేళ్ళుగా చేపట్టిన విభిన్న పథకాలతో నాయకుల సారధ్యంలో ప్రజల ముందుకు తీసుకుపోయే ప్రణాళికను అమలు పరుస్తున్నది. అయితే ప్రధాన విపక్షాలైన బిజెపి, కాంగ్రెస్‌కూడా ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా వినియోగించు కుంటూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో రానున్న ఎన్నికలకు ఈ ఉత్సవాలు ఒక టర్నింగ్ పాయింట్‌గా ఉండాలన్నది ఆయాపార్టీల ఆలోచన. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండు సార్లుగా అధికారంలో కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌ను ఎలాగైనా గద్దె దించాలన్నది ఈ రెండు పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలుకూడా తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
విపక్షాలు పోటీపడుతున్న ఈ పరుగుపందెంలో నిన్నటి వరకు మొదటివరుసలో ఉన్నది తామేనని బిజెపి భావిస్తూ వొచ్చింది. అధికార టిఆర్‌ఎస్‌ను ఢీ కొనగల శక్తి తమకే ఉందన్న ధీమాతో ఉండింది. ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో అప్పటినుండి ఆ పార్టీ డీలాపడుతూ వొచ్చింది. నిన్నమొన్నటివరకు తెలంగాణ విషయంలో ప్రకటించిన ధీమా ఇప్పుడు కనిపించడంలేదు. ప్రధాని అంతటివాడే పలుసార్లు కర్ణాటకలో పర్యటించినా అక్కడ కాంగ్రెస్‌కు పెద్దగా స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల ప్రభావంతో తెలంగాణలో సులభంగా విజయం సాధించవొచ్చనుకున్న బిజెపి కలలు కల్లలైపోయాయి. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ జూలు విదులుస్తున్నది. నిన్నటి వరకు మూడవ స్థానంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు బిజెపిని పక్కకు నెట్టి రెండవ స్థానంలోకి వొచ్చిందన్న ఉత్సాహం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నది, దీంతో నిన్నటివరకు కాంగ్రెస్‌తో పాటు, అధికార బిఆర్‌ఎస్‌లో నిరుత్సాహంగా ఉన్న నేతలు బిజెపిలోకి దూకటానికి సిద్ధంగా ఉన్న వారంతా ఒక్కసారే పునరాలోచనలో పడిపోయారు. బిజెపి గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో తామా పార్టీలోకి పోవడం ఎంతవరకు సమంజసమన్న మీమాంసలోపడిపోయారు. దానికి తగినట్లుగా కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ బిజెపిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయ•పడడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చాలా మంది సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నట్లు ఇటీవల వెలువడుతున్న వార్తల వల్ల తెలుస్తున్నది.
బండి సంజయ్ ఒంటెద్దు పోకడతో వివిధ పార్టీలనుండి ఆ పార్టీలో చేరిన వారుకూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీలనుండి వొచ్చినవారిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని, వారికి ఎలాంటి ప్రాతినిధ్యం లభించడంలేదన్న ఆరోపణలు వొస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో రానున్న శాసనసభ ఎన్నికలముందు పార్టీలో ఈ విభేదాలు పొడసూపడం ఇప్పుడు ఆ పార్టీ అధిష్టాన వర్గానికి తలనొప్పిగా తయ్యారైంది. ఎన్నికలకు ముందే పార్టీ నాయకత్వాన్ని మార్చాలని హుజురాబాద్ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ లాంటివారు అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వొస్తున్నాయి. ఒక దశలో ఆయన పార్టీ మారుతాడా అన్న ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంఎల్‌ఏ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటివారు కూడా బండి సంజయ్ నాయకత్వంపైన పెద్దగా సంతృప్తికరంగా లేరని తెలుస్తున్నది. బండి సంజయ్ ప్రచారమంతా కేవలం కెసిఆర్‌ను విమర్శించడం, హిందుత్వంపైనే కొనసాగుతుండడంతో ప్రజలను పెద్దగా ఆకర్షించలేకపోతున్నాడన్న విమర్శలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపి పార్టీలో చేరికల వరద ఉంటుందనుకున్నారు.
ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో అవి నిలిచిపోయాయి. చేరికల కమిటీ చైర్మన్ అయిన ఈటల రాజేందర్‌కూడా ఆ విషయంలో చేతులెత్తేశాడు. బిఆర్‌ఎస్‌నుండి బహిష్కరించబడిన ఇద్దరు సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో తాను విఫలుడినయినానని తానే చెప్పుకోవడం గమనార్హం. గత నెల రోజులుగా వారికి ఎన్ని చెప్పినా, హామీలిచ్చినా వారే తనను కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించారే తప్ప తన మాటకు లొంగలేదని ఈటల రాజేందర్ అన్నారన్న వార్తలు చూస్తే బిజెపి గ్రాఫ్ తెలంగాణలో పడిపోతున్నదన్నది స్పష్టమవుతున్నది. ఆ వ్యాఖలు తను చేయలేదని ఈటల వివరణ ఇచ్చినా .. ఆ పార్టీలో చేరిన మరో సీనియర్ లీడర్ కొండా విశ్శేశ్వర్‌రెడ్డి స్వీయ పార్టీపైనే దిల్లీ కేంద్రంగా చేసిన ప్రకటనకూడా ఆ పార్టీలో సంచలనాత్మకంగా మారింది, ఇతర పార్టీల నుండి వొచ్చిన నాయకులతోనే కాకుండా బిజెపిలో సీనియర్ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పదవుల్లో, పార్టీ కేంద్ర కమిటీలో ఉన్నవారు కూడా సంజయ్‌పట్ల పెద్దగా ఆసక్తిగా లేరన్న వార్తలు వినిపిస్తున్నాయి.దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి ధర్మపురి ఆరవింద్ చేసిన విమర్శ వారి మధ్య ఉన్న విభేదాలను వెల్లడిస్తున్నది. ఇదే అదునుగా కాంగ్రెస్ విజృంభించడం ప్రారంభించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేయడంతో ఆ పార్టీకిప్పుడు పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. బిజెపిలో విబేధాలు పొడసూపుతుంటే, కాంగ్రెస్ పార్టీ విబేదాలను పక్కకు పెట్టి సంఘటితంగా ఎన్నికల్లో పోరాడి విజయాన్ని ముద్దాడలన్న దృఢ సంకల్పంగా ముందుకు పోతున్నది. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏవో కారణాలతో పార్టీని వీడి పోయిన వారంతా తిరిగి పార్టీలోకి రావాల్సిందంటూ ఆహ్వానించడం ఆ పార్టీలో కొత్త ఆశలను చిగురింపచేస్తున్నది. విభేదాలను మరిచి సహృదయంగా ఘర్ వాపసీ కార్యక్రమంలో పాల్గొనాలను ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో పంతాలకు పోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే తానే ఒకటికి నాలుగు మెట్లు కిందకు దిగడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో పార్టీని వీడి బిజెపి, ఇతర పార్టీల్లోకి వెళ్ళినవారిప్పుడు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం పాలు ఎక్కువ. ఇతర పార్టీలో నిరాదరణకు గురి అయ్యేకన్నా ఇంటి పార్టీలో సుఖములు బడయవచ్చు అన్నట్లుగా వారి ఆలోచనాధోరణిలో మార్పులు వొస్తున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. దానికి తోడు కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోకూడా ఎన్నికల హామీలను ఎన్నిక కాగానే అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించే విధంగా అధిష్టానవర్గం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రియాంకా గాంధీ తెలంగాణ సారధ్యాన్ని స్వీకరిస్తుందని, కర్ణాటకలో ఆమె విస్తృత ప్రచారం చేయడంవల్లే కాంగ్రెస్ గెలిచిందన్న భావన ఉంది. దీంతో ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అన్న వాతావరణం ఏర్పడుతున్నది. బిఆర్‌ఎస్ నాయకులుకూడా తమకు ప్రధాన పోటీదారు కాంగ్రెసేనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయ సమీకరణల్లో సత్వరమార్పులు జరుగుతూ వొస్తున్నాయి.





