మాన్యువల్‌ స్కావెంజర్ల హక్కుల ఉద్యమకారుడు!

కొంత మంది తమ కోసం ఆలోచిస్తారు. మరి కొంత మంది ప్రజలు కోసం ఆలోచిస్తారు. ఇంకొంతమంది సామాజిక మార్పు కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. అటువంటి వారిలో  బిందేశ్వర్‌ పాఠక్‌ ఒకరు.  బిందేశ్వర్‌ పాఠక్‌ అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ సులభ్‌ కాంప్లెక్స్‌ (ప్రజా మరుగుదొడ్లు) పేరును చూడని వారు, వాటి గురించి వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. బస్‌ మరియు రైల్వే స్టేషన్లలోను, నగరాలు, పట్టణాలలో రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ సులభ్‌ కాంప్లెక్స్లు ఉన్నాయి. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జనలు చేయకుండా ఇవి ఆపగలుతున్నాయి. నగరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నాయి. భారతదేశంలో వీటిని ప్రతీ రోజూ సుమారుగా కోటి మందికి పైగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థను నెలకొల్పిన మహానుభావుడు పాఠక్‌.

బిందేశ్వర్‌ పాఠక్‌ ఏప్రిల్‌ 2, 1943 న బీహార్‌ రాష్ట్రం లోని హాజీపూర్‌ లో జన్మించారు. 1964 సం.లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రం లో డిగ్రీని,1980 లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పట్టా  పొందారు.  1985 లో పాట్నా విశ్వవిద్యాలయయం నుండి పి.హెచ్‌.డి ని పొందారు. 1968 లో  బీహార్‌ లో  గాంధీ శతాబ్ది ఉత్సవాల కమిటీలోని భాంగీ-ముక్తి (స్కావెం జర్ల విముక్తి) సెల్‌లో చేరినప్పుడు ఈయన స్కావెంజర్ల కష్టాలును మొదటి సారిగా విన్నారు. మాన్యువల్‌ స్కావెంజర్లు, డ్రై లెట్రిన్‌ల నుండి మానవ విసర్జనను శుభ్రపరిచే వ్యక్తుల దుస్థితిని తగ్గించడానికి నడుం బిగించారు. స్కావెంజింగ్‌ అనేది మానవరహిత పద్ధతి అని నమ్మి 1970 సం.లో సులభ్‌ ఇంటర్నేషనల్‌  సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఎవరూ మలవిసర్జన కోసం  బయటికి వెళ్లకూడదు మరియు భారతదేశంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనేది డాక్టర్‌ పాఠక్‌ ఉద్వేగభరితమైన కోరిక. గాంధీ తర్వాత పారిశుధ్యం మరియు అంటరానివారి అభ్యున్నతిని తమ జీవిత లక్ష్యంగా భావించిన అతికొద్ది మంది వ్యక్తులలో డాక్టర్‌ పాఠక్‌ ఒకరు. అతను లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన పారిశుధ్యం మరియు సామాజిక సంస్కరణల చిహ్నం.

అతని కృషితో గతంలో అంటరానితనం పాటించే ప్రజలు స్కావెంజర్లుతో కలిసిపోవడానికి, వారితో సమానంగా జీవించడానికి, భోజనం చేయడానికి మరియు దేవాలయాలలో ప్రార్థనలు చేయడానికి సమాజం అనుమతించింది. పేదలను అక్కున చేర్చుకుని శ్రమ గౌరవాన్ని చాటిచెప్పే కొత్త సంస్కృతిని ఆయన సృష్టించారు. పర్యావరణ క్షీణత మరియు ఆరోగ్య ప్రమాదాలకు దారితీసే పారిశుద్ధ్య సంబంధిత కాలుష్యాన్ని సవాలుగా తీసుకుని సామాజిక సంస్కరణ-పర్యావరణ నవీకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ దాని దాదాపు 40 సంవత్సరాల ఉనికిలో పారిశుద్ధ్య దృష్టాంతంలో నిశ్శబ్ద విప్లవాన్ని చూసింది. ప్రజల దృక్పథంలో ప్రాథమిక మార్పు మెరుగైన పారిశుద్ధ్య పద్ధతుల పట్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అతను సామాజిక దురాచారాన్ని అధ్యయనం చేయడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడిన టాయిలెట్‌-టెక్నాలజీ  అందించారు.  దేశవ్యాప్తంగా పారిశుధ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా స్కావెంజింగ్‌  అమానవీయ చర్యలను రద్దు చేయడంలో అతని సహకారం చాలా ముఖ్యమైనది.  స్కావెంజర్ల సామాజిక అప్‌గ్రేడేషన్‌కు ప్రత్యామ్నాయాన్ని అందించే ప్రక్రియలో భాగంగా పాఠక్‌ 50,000 మంది వాలంటీర్లతో పాన్‌-ఇండియన్‌ నెట్‌వర్క్‌ను సృష్టించి సులభ్‌ పారిశుద్ధ్య ఉద్యమానికి నాంది పలికారు.

పర్యావరణ అనుకూలమైన టు-పిట్‌, పోర్‌-ఫ్లష్‌ కంపోస్ట్‌ టాయిలెట్‌ టెక్నాలజీని కనిపెట్టారు. ఈ టాయిలెట్‌ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్ల మందికి ఐక్యరాజ్య సమితి సంస్థలు గ్లోబల్‌ బెస్ట్‌ ప్రాక్టీస్‌గా సిఫార్సు చేశాయి మరియు యునైటెడ్‌ నేషన్స్‌ యొక్క ఆర్థిక మరియు సామాజిక మండలి సులభ్‌కు, దాని అత్యుత్తమ సేవకు గుర్తింపుగా జనరల్‌ కన్సల్టేటివ్‌ హోదాను మంజూరు చేసింది. డ్రై లెట్రిన్‌లను శుభ్రపరిచే అమానవీయ వృత్తిలో నిమగ్నమై ఉన్న స్కావెంజర్‌లను జాతీయ జీవన స్రవంతిలో తీసుకురావడంలో అతని బహుముఖ ప్రయత్నాలు సామాజిక న్యాయం కోసం ఒక ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. విముక్తి పొందిన స్కావెంజర్ల కోసం సమీకృత పునరావాస కార్యక్రమంలో భాగంగా వృత్తి శిక్షణా కేంద్రాలు మరియు పాఠశాలలను స్థాపించడం ద్వారా స్కావెంజర్లను గౌరవప్రదమైన వ్యాపారాలలోకి పునరావాసం కల్పించడంలో ఆయన చేసిన కృషి అనేక తరాల పూర్వపు స్కావెంజర్‌ కుటుంబాలు  విద్యను అందుకోవడానికి వీలు కల్పించింది. తక్కువ ఖర్చుతో కూడిన పారిశుధ్యం, బయో ఎనర్జీ మరియు బయోఎరువు, ద్రవ ఘన వ్యర్థాల నిర్వహణ రంగాలలో కూడా అతని రచనలు విస్తృతంగా ప్రసిద్ది చెందాయి. అతను పునరుజ్జీవనోద్యమ వ్యక్తి మరియు ఒక సామాజిక శాస్త్రవేత్త, ఇంజనీర్‌, నిర్వాహకుడు. అతను అణగారిన వర్గాలను సుసంపన్నం చేయడానికి మరియు శక్తివంతం చేయడానికి, సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి కృషి చేశారు.

భారతదేశంలోని ‘‘ఇతర అంటరానివారు’’ అని పిలవబడే బృందావనం మరియు వారణాసిలోని వితంతువుల ఉద్ధరణకు కూడా కృషి చేశారు. బృందావన్‌ మరియు వారణాసిలోని సంక్షేమ గృహాలలోని వితంతువులకు ద్రవ్య మద్దతు, వైద్య సహాయం మరియు వృత్తి శిక్షణ ద్వారా వారి దయనీయమైన జీవితంలో గౌరవాన్ని తెచ్చారు. 2013లో ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాన్ని ప్రభావితం చేసిన విపత్తు నేపథ్యంలో డాక్టర్‌ పాఠక్‌ కూడా బాధితులకు తన సహాయాన్ని అందించాడు. వితంతువుల గ్రామం’’ అనే ట్యాగ్‌ను పొందిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఈ వితంతువులలో ప్రతి ఒక్కరికి ఆర్థిక, వైద్య సహాయాలు అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అతను ఇటలీలో పర్యావరణం కోసం అంతర్జాతీయ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ప్రైజ్‌  పొందాడు. పర్యావరణాన్ని మెరుగుపరచడం మరియు పేదలకు నిస్వార్థ సేవ కోసం ఆయన చేసిన కృషిని పోప్‌ జాన్‌ పాల్‌-2  ప్రశంసించారు. వరల్డ్‌ వాటర్‌ వీక్‌ సందర్భంగా స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా 2009 సంవత్సరానికి స్టాక్‌హోమ్‌ వాటర్‌ ప్రైజ్‌ మరియు పారిస్‌లో జరిగిన కాంగ్రెస్‌ వరల్డ్‌ గ్రీన్‌ గేమ్స్‌ స్థాపన సందర్భంగా ఫ్రెంచ్‌ సెనేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ద్వారా ‘‘లెజెండ్‌ ఆఫ్‌ ప్లానెట్‌ అవార్డ్‌’’ అందుకున్నారు.

1991లో పద్మభూషణ్‌,  మరణానంతరం 2024లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ లభించింది. ఆరోగ్యం, పారిశుద్ధ్యం మరియు కుల ఆధారిత వివక్షకు సంబంధించిన విభిన్న అంశాలపై తరచుగా వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లలో రచనలు చేశారు. బిందేశ్వర్‌ పాఠక్‌ తన జీవితాన్ని మానవాళికి సేవ చేయడానికి, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి అంకితం చేసిన నిజమైన నాయకుడు. మాన్యువల్‌ స్కావెంజర్ల హక్కుల కోసం పోరాడిన మంచి మనసున్న మనిషి.  భారతీయ రైల్వేల స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సేవలందించారు. పాఠక్‌  ఆగస్ట్‌ 15 , 2023 న గుండెపోటుతో కన్నుమూశారు. పారిశుద్ధ్యానికి మార్గదర్శకుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారు.
జనక, మోహనరావు దుంగ,అధ్యాపకుడు,8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *