60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తల్లి
ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు
తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది
ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు
వంద రోజుల్లో అమలులోకి మిగితావి
సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిషలు కృషి
చేయూత, మహాలక్ష్మి పథకాల ప్రారంభం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి
ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు
తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది
ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు
వంద రోజుల్లో అమలులోకి మిగితావి
సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిషలు కృషి
చేయూత, మహాలక్ష్మి పథకాల ప్రారంభం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత గల ఒక పండుగ రోజని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009 లో ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం యూపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా..హోమ్ శాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం శాసన సభ సమావేశాల అనంతరం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా చేెయూత, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన అనంతరం సిఎం ఎఆర్‌ఆర్ మాట్లాడుతూ…డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం రోజున తెలంగాణ ప్రజలకు ఆమె రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏ ఆకాంక్షతో, ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో, వారి ఆలోచనను కార్యరూపం దాల్చిన ఈ రోజున సగర్వంగా రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని మనకు ఇచ్చారన్నారు. వారి స్ఫూర్తితో… ఆలోచనతో శాసనసభ ఎన్నికలలో వారే స్వయంగా తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చిండ్రన్నారు.
ఆనాడు 2004 కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల ఆలోచన, ఆకాంక్ష తనకు తెలుసని, అది నెరవేరుతుందని మాట ఇచ్చి, గ్యారంటీ ఇచ్చి 2014 జూన్ 2 నాడు నెరవేర్చిండ్రని, అదే స్ఫూర్తితో మళ్లీ సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆమె 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రని, వాటిలో నేడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని వాటిలో 2 గ్యారంటీలను ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నదన్నారు. అందులో భాగంగానే పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలనే ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల రూపాయలతో ప్రతీ పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్లను కుటుంబ సభ్యులుగా భావించి కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అందుకు అనుగుణంగా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకున్నామన్నారు. ఇక రెండో కార్యక్రమం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అణాపైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినమని, ఉక్కు మహిళగా, మహిళా లోకానికి ఆదర్శంగా నిలబడ్డ సోనియాగాంధీ జన్మదినం రోజు తన మంత్రి వర్గం, మాణిక్ రావు థాక్రే నాయకత్వంలో అందరు అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నమని సిఎం ఎఆర్‌ఆర్ తెలిపారు.
ఈ రోజే జెండా ఊపి ఆడబిడ్డలతో పాటు తమ మహిళా అధికారులు, మహిళా మంత్రులు, మహిళా శాసన సభ్యులతో పాటు తాము కూడా బస్సులో ప్రయాణం చేసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంకుబండ్ మీదకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మళ్లీ శాసనసభకు వొస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తన మంత్రి వర్గ సహచరులకు, శాసన సభ్యులకు , చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఇతర ఉన్నతాధికారులకు, కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసే మీడియా మిత్రులకు, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీకి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని, పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలని సిఎం ఎఆర్‌ఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని మాట ఇవ్వడం జరిగిందని, ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామని గ్యారంటీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో…అదే విధంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా నిక్కచ్చిగా 100 రోజుల్లో అమలుచేసి రాష్ట్ర ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా…అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ మాట ఇప్తున్నదని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌కు పాటియాలలో శిక్షణ పొందుతున్న నిఖత్ జరీనాకు ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు చెక్ అందించారు.



