మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి..

అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి
కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైంది..
మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

వొచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పీఠంపై  కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వొచ్చిందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపించాలని  అన్నారు. గురువారం  మల్కాజిగిరి పార్లమెంట్‌ నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. తాను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ నాయకులదేని కొనియాడారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కూడా..  కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను దిల్లీకి పంపించారని చెప్పారు.

2,964 బూత్‌ లలో ప్రతీ బూత్‌ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని, దేశంలోనే ఈ నియోజకవర్గం అతిపెద్దదని తెలిపారు.  నాటి మల్కాజిగిరి గెలుపు.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచే మొదలైందన్నారు. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని, మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలను అమలు చేసుకుంటున్నామని చెప్పారు.  మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని రేవంత్‌ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామన్నారు.  మెట్రో, ఎంఎంటీఎస్‌ రావాలన్నా.. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్‌ ను గెలిపించుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వొచ్చినట్లు గెలిచినా.. మల్కాజిగిరి పార్లమెంట్‌ లో  ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలను గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. పార్లమెంట్‌ తో పాటు కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలవాలని అన్నారు. హొలీ పండుగ లోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదేని భరోసా ఇచ్చారు.  మనకు బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలని, వారికి పోలింగ్‌ బూత్‌ ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కంటోన్మెంట్‌ లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలని,  ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందేనని ఆదేశించారు.  ప్రణాళికబద్ధంగా ప్రచారం నిర్వహించుకోవాలని, మల్కాజిగిరి క్యాంపెయిన్‌ మోడల్‌ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలని సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నిక అభ్యర్థిది కాదు… ముఖ్యమంత్రిదని, తన బలం.. బలగలం కార్యకర్తలేనని, ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందేనని  రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *