మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది. ప్రవహించే జీవనదిలా మనిషికి చైతన్యపు సిరులు అద్దే కవిత్వమొక అనిర్వచనీయమైన చెలిమె. తన గమ్యం సరిగ్గా తెలుసుకొని కవిత్వమొక విశాలాకాశమని గమనించి తన అనుభవాల అనుభూతుల్ని కలం సిరాలో రంగరించి రాసిన స్వీయ కవితల్ని కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య బెంగుళూరు ప్రధాన కార్యదర్శి, కవి డా. నరేంద్రబాబు సింగూరు తొలకరి చినుకులు సంపుటిగా పాఠక లోకానికి అందించారు.

ఇది ఆయన తొలి కవితా సంపుటి అయినప్పటికీ చేయి తిరిగిన కవి రాసే పరిణత కవితా వాక్యాలతో కూడిన 53 కవితలిందులో ఉన్నాయి. కవితల క్రమానికి కూడా పుస్తక శీర్షికకు కలిసే విధంగా చినుకుల వరుస అని పేరు పెట్టారు. ఈ సంపుటికి కవే స్వయంగా ముఖ చిత్రాన్ని వేసి తన చిత్రకళా  సృజన  నైపుణ్యాన్నిచూపడమొక ప్రత్యేకత. శిధిలమవుతున్న కంటి చూరు కింద/  రంగు వెలసిన కలలను గురించి తొలికవిత తొలకరి చినుకులలో ప్రస్తావించారు. గొంతెండిన నేల దుఃఖం/  రాలిపడ్డ చినుకుతో ఊపిరి పోసుకుంది/  శ్వాసకు మట్టివాసన విత్తునిచ్చింది అని మేఘం నదిలోకి ఒలికిన నీటి బొట్టు కోసం ఇంకా వెదుకుతూనే ఉందనడంలోనే  కవిలోని అంతరంగపు ఉద్విగ్నత చల్లని చినుకుగా మారి వర్షించింది.

ఎదిగే మనిషి మనీషిగా మారాలి తప్ప కిరాతకుడవ్వకూడదని యవ్వనంలో బాల్యం అన్న కవితలో చెప్పారు. ద్వేషం స్థానే సామరస్యం/  క్రూరత్వం స్థానే సహనత్వం/ ఆవేశం స్థానే అనురాగం ఉండాలని బలీయంగా కోరుకున్నారు. బాల్యం నుంచి యవ్వనంలోకి బాధ్యతతో నడిస్తే  భవిష్యత్తు సుందరంగా, ఉజ్వలంగా ముందుకు సాగుతుందని చెప్పారు. జనాల్ని పావుల్ని చేసి ఆడుకునేదే రాజకీయ చదరంగమని తెలిపారు. జనం పులులై తిరగబడితే రాజకీయుల  కుతంత్రాలన్నీ ఒక్క ఉదుటున కొట్టుకొని పోతాయని చెప్పారు.

పోరాటాన్ని మర్చిపోతే/  నడిచే బాట ఇరుకైపోతుంది/  ప్రయాణారంబాన్ని మర్చిపోతే / గమ్యం శిథిలమై పోతుంది అన్న సత్యాన్ని ఇందులోని పోరాటం – గమ్యం కవిత స్పష్టంగా చెప్పింది. కెరటాలు, కిరణాలు, సిరిమువ్వ, ప్రేమలకు అంతమంటూ లేదని అన్నారు. అరమోడ్పు కన్నుల భాష ప్రేమకు అర్థం కావాలని చెప్పారు. హృది కాగితంపై చెరగని తీపి గురుతును గుర్తు చేసుకుని జీవితమంటే ఇంతేనా అని వలపోశారు. స్వేచ్ఛ జీవితానికా, మనిషికా, మనిషిలోని ఆశకా అని సూటిగా కవి ప్రశ్నించారు. నవ  నిర్మాణ స్వేచ్ఛావాదాన్ని కవి కోరుకున్నారు. కాగితంపై ఎద మంట కవితాక్షరమై అగ్నిని కురిసిందని చెప్పారు. తెలియకో… తెలిసో కవితలో బతుకు పయనంలో ఆక్రందనలు, మృత్యునాదఘోషలు మార్మోగుతుంటే మనసు మార్పులు సహజమా/  మనిషి మరుపులు సహజమా/  నిరంతర రాజీ తప్పదా/  లేక… నిశ్చేష్టతే శరణ్యమా…? అని ఎంతో  వేదన చెందారు. కన్నీటి బొట్లు మహా సముద్రమైతే హృదయ ఘోషకు కొలమానమేమిటో తప్పక తెలుస్తుందన్నారు.

దుష్ట స్వార్థపు రాజకీయ విహంగాన్ని ఎవరివి నీవని నిలేసి ప్రశ్నించారు. ఆశను తనకోసం రక్తంలో ఎర్రదనమై కలిసి రమ్మని  ఆహ్వానించారు. రాగానుబంధమే సిసలైన అనుబంధమని విశ్వాసంతో ప్రకటించారు. నిశ్చల రూపం, చిరు దరహాసం అలసిన మనసుకు అసలైన ఓదార్పు అని భావించారు. శకుని కూడా సిగ్గుపడే విధంగా ఇప్పటి రాజకీయాలు రోతకీయంగా మారాయని ఎంతో నొచ్చుకున్నారు. స్వేచ్ఛలోని  హద్దులను విధిగా తెలుసుకోమన్నారు.
పల్లెను ఆశల శ్వాసగా అనుబంధాల నిలయంగా వర్ణించారు. మహా నగరాన్ని మాయా నగరంగా పేర్కొని ఆనందం అదృశ్యమైపోయిందన్నారు. స్వార్థం కంచెగా స్వేచ్ఛ బంధింపబడిరదని తెలిపారు. స్వేచ్ఛగా వెల్లివిరియాలనుందన్నారు. అన్నీ తీరాక/ అన్నీ ముగిసాక/ ఇక అంతేగా అన్నట్టుగా లోకం తయారైందని చెప్పారు. కళ్లల్లో ఆనందభాష్పాల బదులు దుఃఖాశ్రువులు కనిపిస్తుంటే కష్టం ఎంతటిదో తెలుసుకొమ్మన్నారు. తరాల అంతరాలను అధిగమించి గమ్యాన్ని గమనించి విజయాన్ని స్వంతం చేసుకోవాలన్నారు. మంచుకన్నా శరవేగంగా మనసే కరుగుతుందని చెప్పారు. గతాన్ని వదిలేసి ఆ గతానికి పునాదులు నిర్మించమన్నారు.

ఆకాశానికి నేలకు అనుసంధానకర్త నా కన్నీళ్ళే అంటూ ఆకాశాన్ని చూసే కళ్ళను, నేలను తాకే కన్నీళ్ళను గురించి హృదయద్రావకంగా వివరించారు. కష్టాలను భరించలేక పేదోడి గుండె గావుకేక పెడుతుందని చెప్పారు. దుష్ట జలగలు పెరిగి రక్తం పీల్చే లోకంలో సామాన్యుని జీవనం రోజురోజుకూ  బహు కష్టమైందని ఆవేదన చెందారు. పిడికిలితో ఒడిసిపట్టి రాసి దుమ్ముపట్టిన రాజకీయపు దుమ్ము దులుపుతానన్నారు. ప్రశ్న ఆయుధం, చర్చ సాధనమని గ్రహించమని తెలిపారు. క్షణమైనా చలించని రాతి గుండెలు ఉండి ఎవరికి లాభమని ప్రశ్నించారు. దూరంగా ఉండాలన్నది విధి వింత నాటకం కాదని, కరోనా ఆడిస్తున్న జగన్నాటకమని చెప్పారు. ధరిత్రిలో ఆసత్యమే సత్యంగా మారిందని తెలిపారు. కాంతి కిరణాల చంద్రరేఖల్ని, నింగిలో తేలియాడే నీలి మేఘాల్ని, నిరీక్షణల విరహ సముద్రంలో ఎగసే అలల నురగల్ని, ఆశల బరువుల్ని చక్కగా విశదీకరించారు.

తేనెలొలుకు తెలుగు భాషను బాధ్యతతో కాపాడుకోవాలన్నారు. అమ్మభాష  ఔన్నత్యం కోసం ఉద్యమించాలని  చెప్పారు. ఉగాదిని అభివర్ణిస్తూ ప్రతి ఏడూ కొత్తదనమే, కొత్త అనుభవమే అని చెబుతూ ప్రతి గడిచిన ఏడు నేర్పిన పాఠమే /  జీవితం షడ్రుచుల సమ్మేళనమేనని తెలిపారు. కరోనా కన్నీళ్ళను కూడా  దూరం చేసిందని వేదనపడ్డారు. శ్రమయే ఆయుధంగా అన్న కవితలో నీవు చిందించిన స్వేదం/  జనజీవన వేదం/  తీరుస్తుంది  ప్రగతి దాహం అని శ్రమ విలువను తెలుసుకొని హక్కుల కోసం పోరాడడం కార్మిక ధర్మమని తెలిపారు. నీవు కరిగించే కండ/  దేశాభివృద్ధికి అండ అన్నారు. నమ్మకాన్ని కొందరు అపనమ్మకంగా మారిస్తే దానిని జీవిత పర్యంతం భరించడం ఎంతో కష్టమని చెప్పారు. మనిషిది యాంత్రిక జీవితమే అంటూ పెదాలపై నవ్వు యాంత్రికమే/  ఆలోచన యాంత్రికమే/  ఆచరణ యాంత్రికమే అని స్పష్టంగా తెలిపారు. వర్ణశోభిత వసంత హోళీని తలపోస్తూ జీవితమే ఒక హోళీ అని చెప్పారు. కరోనా వల్ల ఖరీదైన కాలంలో జీవితం ఎంతో చౌకగా మారిపోయిందన్నారు. ఏ గుడి కేగినా….. నీ గొంతు పాట నైవేద్యమే అని అమర గాయకుడు ఎస్‌పి బాల సుబ్‌ఎహ్మణ్యంకు అంజలి ఘటించారు. భారతీయులకు గాంధీ మార్గం శిరోధార్యమని ఓ మహాత్మా అన్న కవితలో చెప్పారు. ఓటరుని మేల్కొలిపి ఓట అనే నీ చేతిలోని వజ్రాయుధాన్ని ప్రజాస్వామ్య ప్రతిష్టాపనకు బాధ్యతతో ప్రయోగించమన్నారు. ఆలోచననే మార్గం చేసుకొని, సమాజాన్నే రణస్థలంగా మార్చుకొని పీడిత, తాడిత ప్రజల పక్షాన పోరాడిన మహా ప్రస్థాన మహాకవి శ్రీశ్రీని స్మరించారు. తళుక్కున మెరిసే ఓ కన్నీటి చుక్క అని అజరామరమైన ప్రేమకు ప్రతీకగా చివరి కవితలో తాజ్‌మహల్‌ను చూపారు.

చెర్నోకోలా వంటి కొసమెరుపులతో ఈ సంకలనంలోని చాలా కవితలున్నాయి. కవితల సిరా తొలకరింపు పేరుతో డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ రాసిన ముందుమాటలో ఈ కవిని రహస్య కవితా ఋషి అని సంబోధించడానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా ఎన్నో కవితా వాక్యాలు కన్పిస్తాయి. పొత్తూరి సీతారామరాజు కవిలోని భావాగ్నిని, ఆకెళ్ళ శివప్రసాద్‌ గాఢమైన ఆలోచనలను, ప్రొఫెసర్‌ కెవిఎస్‌జి మురళీకృష్ణ వినూత్నమైన అక్షర సేద్యాన్ని, డాక్టర్‌ బుడమగుంట మధుసూదన్‌ అర్థవంతమైన, అద్భుతమైన పదరవళిని ఉటంకిస్తూ ఈ సంపుటికి తమ అభిప్రాయాలను రాశారు. నిజ జీవన ఒత్తిడుల నుంచి మనిషికి స్వాంతనను, చక్కని సృజన మనోల్లాసాన్ని అందించాలన్న యజ్ఞం లాంటి కవి ప్రయత్నానికి నిదర్శనంగా ఈ కవితలు నిలుస్తాయి.
 -డా.తిరునగరి శ్రీనివాస్‌, 9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *