మధ్యప్రదేశ్‌లో దారుణం.. మోటర్‌ ‌సైకిల్‌పై డెడ్‌బాడీ తరలింపు

భోపాల్‌, అగస్టు 1 : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన షాదోల్‌ ‌జిల్లాలో జరిగింది. చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి వాహనాన్ని సమకూర్చకపోవడం అక్కడి మెడికల్‌ ‌సిబ్బంది నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. దీంతో చేసేదేం లేక ఆ డెడ్‌ ‌బాడీని మోటార్‌ ‌సైకిల్‌ ‌కు కట్టి 80 కిలో టర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రైవేటు వాహనానికి రూ. 5000 అడగడంతో.. అంత మొత్తాన్ని చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఆ కుమారులు.. చివరికి తన బైక్‌ ‌పైనే.. ఆ తల్లి బాడీని తీసుకొని తమ సొంతూరైన గుడారుకు వెళ్లారు.

రూ.100 పెట్టి చెక్క పలకలు కొని… దానిపై ఆ తల్లి మృతదేహాన్ని మోటారు సైకిల్‌ ‌కు కట్టి తీసుకెళ్లే వీడియో ప్రస్తుతం వైరల్‌ ‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా తమ తల్లి చికిత్స కోసం అనుపూర్‌ ‌జిల్లా నుండి షాడోల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీకి వచ్చామని… సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే తమ తల్లి చనిపోయిందని వారు వాపోయారు. కనీసం ఆమె మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనాన్ని ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఛాతీ నొప్పితో బాధపడుతున్న  తమ తల్లిన జిల్లా ఆస్పత్రిలో చేర్చామని… పరిస్థితి విషమించడంతో వైద్య కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని నిట్టూర్చారు. తన తల్లి మృతికి జిల్లా ఆసుపత్రి నర్సులు, మెడికల్‌ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని ఆ కుమారులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *