14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి నిందితులు
హైదరాబాద్: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు పెండింగ్లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనంతో పాటు వాటర్ ఫ్లాస్క్, సొంతంగా రెండు జతల బట్టలు, చలి దుస్తులు, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు అనుమతించింది. జైలులో ఇద్దరు నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఇరువురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. దిల్లీ మద్యం కుంభకోణంపై జరుగుతున్న విచారణ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు మీడియాకు అందజేస్తున్న వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణకి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారని, దర్యాప్తు సంస్థలు కావాలనే ఇదంతా చేస్తున్నాయని ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ మీడియా కో-ఆర్డినేటర్ విజయ్ నాయర్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మీడియా ఛానెళ్లు చేసిన రిపోర్టింగ్పై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈడీ, సీబీఐల అధికారిక ప్రకటనలను మాత్రమే మీడియా ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతున్నందున విచారణకు సంబంధించి ఎలాంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ మాత్రం.. ఇప్పటివరకు 3 పత్రికా ప్రకటనలు జారీ చేసిందని తెలిపింది. విజయ్ నాయర్ గురించి వచ్చిన మీడియా కథనాలు తమ ప్రకటన ఆధారంగా లేవని సీబీఐ కోర్టుకు వివరించింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ పత్రికా ప్రకటనకు, మీడియా కథనాలకు ఎలాంటి సంబంధం లేదని దిల్లీ హైకోర్టు వెల్లడించింది.




