మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

  • హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి
  • హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన
  • మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరేకృష్ణ ఫౌండేషన్‌ ‌ద్వారా ఇలాంటి మత వైషమ్యాలను రూపుమాపాలన్నారు. హైదరాబాద్‌ ‌కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో  మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రమని వెల్లడించారు. హరేకృష్ణ ఫౌండేషన్‌ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు.

హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారని చెప్పారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు. కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ఎన్నో సేవలు అందించిందని కొనియాడారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలని సూచించారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చాలామంది మ్యూజిక్‌ ‌థెరపీ తీసుకుంటున్నారని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ ‌ప్రతినిధులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *