‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్ బంద్ చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్ సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’
మణిపూర్‌లో జరిగిన హింస నోటితో చెప్పలేనిది. అంకెలు, గణాంకాలు లెక్కించలేనిది. ఆదివాసీ అనే వారిని ఏ స్థాయిలో ఉన్నా మెయిటీ మూకలు వదలలేదు. వ్యవసాయం, పశుఆరోగ్యం అనే ప్రభుత్వ విభాగానికి సెక్రెటరీగా ఉన్న 57 ఏళ్ల గౌజావుంగ్ నూ, ఆమె కొడుకునూ కారు నుండి బయటకు లాగి చంపేశారు. జడ్జీల మీద కూడా దాడులు చేశారు. అయితే ఈ హత్యలకు ప్రతిస్పందన వేరుగా ఉంది. ఆత్మరక్షణ కోసం ఆదివాసులు ఆయుధాలు పట్టుకున్నారు కానీ, ప్రతిహత్యలు జరిగిన సందర్భాలు తక్కువ. చురచందాపూర్‌లో ఉన్న మెయిటీ ప్రజల ప్రాణాలను అక్కడి ఆదివాసీ మహిళలు రక్షించారు. వారి వీరోచిత ప్రయత్నాల వలన అక్కడి మెయిటీ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. లోయలో ఉన్న తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు చనిపోయిన వార్తలు వస్తున్నపుడే ఆదివాసీ మహిళలు ఈ పనంతా చేశారు.
మణిపూర్‌లో హింసోన్మాదం కొనసాగుతున్న కాలమంతటిలో ఇంఫాల్ కేంద్రంగా పని చేస్తున్న మీడియా ఆదివాసుల పట్ల ప్రతినాయకిగా వ్యవహరించింది. మెయిటీ ప్రయోజనాలకనుగుణంగా అసత్యాలను ప్రచారం చేయటంలో ఛాంపియన్‌గా ఉంది. అనేక కల్పిత కథనాలను ప్రసారం చేసింది.
రాజ్యాంగాన్ని నమ్మే ఆదివాసులు భారత జెండాను కాల్చివేసినట్లు వీడియో ప్రసారం చేసింది. నిజానికి ఆ జెండాను కాల్చినవాళ్లు మెయిటీలు. భారతీయ జాతీయ జెండాను కాల్చటం వాళ్లు ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేస్తారు. జంతర్‌మంతర్‌లో మెయిటీల ధర్నాలో ఆదివాసీలు రేప్ చేశారని చెబుతూ ఒక మహిళ పెద్ద ఫోటోను ఆ టెంట్‌లో పెట్టారు. ఆ ఫోటో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక వరకట్న బాధితురాలిదని వెంటనే తెలిసి పోయింది. మెయిటీలు తక్కువగా నివసించే చురాచాంద్‌పూర్ జిల్లాలో ఒక మెయిటీ డాక్టర్‌ను మంటల్లో విసిరేశారనీ, అతని కూతుర్ని రేప్ చేశారనే వార్తలను ప్రచారం చేశారు. కొద్దిరోజుల తరువాత ఆ డాక్టర్ ఇంఫాల్ కేంద్రంగా ఉన్న ‘ఇంపాక్ట్ న్యూస్’తో మాట్లాడుతూ, ఆ వార్తలు అసత్యాలనీ, మతోన్మాద ప్రయోజనాల కోసం తన పేరూ, తన కుమార్తె పేరూ వాడుకున్నారని మండిపడ్డాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ జరగని ఘటన మీద ప్రతీకారంగా, ట్రైబల్ పురుషులు చేయని నేరానికి, వారి స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి.
ఇంకా కాలిపోతున్న ఆదివాసీ గ్రామాలను మెయిటీ గ్రామాలుగా చూపించారు. చురచాంద్‌పూర్‌లో మెయిటీ స్త్రీలను రేప్ చేశారని సోషల్ మీడియా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని డీజీపీనే ఖండించాడు. భారతీయుల సానుభూతి సంపాదించటం కోసం మిజోరాంలో ఉన్న మెయిటీల మీద దాడులు జరిగాయనే ఫేక్‌న్యూస్ ప్రచారంలోకి తెచ్చారు. మిజోరాం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయం అబద్దమని చెప్పారు. ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్ బంద్ చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికికౌంటర్ సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. హింస గాలి నుండి పుట్టదు. మణిపూర్‌లో జరిగిన హింసకు కారణాలు ఆధిపత్య అహంకార భూదాహ అధికార రాజకీయాలు. ప్రజాప్రాణాలను అవలీలగా తీయగలిగిన హంతకులకు శిక్ష రాహిత్యం. నరహంతక మణిపూర్ ముఖ్యమంత్రికి కేంద్ర మద్దతు. ఇంత మారణకాండ జరిగినా నోరు విప్పని ప్రధాన, గృహమంత్రులు. మణిపూర్‌లోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా బలవంతుల పక్షానే రాజ్యం నిలబడుతుందనే కనువిప్పు ఈ జాతి హననం కలిగించింది.
మెయిటీలు, ఆదివాసులు ఒక పంచలో కలిసి జీవించటం కష్టం అని ఈ ఘటనలు రుజువు చేశాయి. చారిత్రాత్మకంగా కూడా ఈ రెండు సమూహాల మధ్య భావోద్వేగపరంగా, మానసికంగా ఎంతో దూరం ఉంది. ఈ ఘటనలు జరిగాక ఆదివాసులు లోయ నుండి వచ్చేశారు. రెండు సమూహాలు సామూహికంగా తమ తమ స్థలాలకు తరలివెళ్లారు. ఇప్పుడిక భౌతికంగా, భౌగోళికంగా కూడా విడిపోవటం తప్పనిసరి అయ్యింది. రెండు సమూహాల మధ్య శాంతి, సుహృద్భావం నెలకొనటానికి రాజకీయ పాలనాపరమైన వేర్పాటు అవసరం. ఈ సమస్య పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆ దిశగా చర్యలు జరగాలి. బలహీన సమూహాలను బలిపశువులను చేసి, సమూలంగా నిర్మూలించదల్చిన హంతక రాజకీయాలకు చెక్ పెట్టాలంటే, దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలు ఆదివాసీలకు మద్దతుగా జరగాలి.
– రమా సుందరి




