మణిపూర్ గురించీ ఆలోచిద్దాం..!!

దూరప్రాంతంలోని ఘర్షణలతో మనకేం సంబంధం అనుకోకుండా, బాధితులకు కనీస స్థాయిలో అయినా చేయూతని అందించగలిగిన డాక్టర్స్, శిక్షణపొందిన కౌన్సెలర్లు, సైకియాట్రిక్ డాక్టర్లు, ట్రామా స్పెషలిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు వంటి ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్లి సాయం అందిస్తే అంతకంటే మానవీయత మరొకటుండదు. ఇలాంటి వారి అవసరం ఇప్పుడక్కడ ఎంతో వుంది.
ఈశాన్య రాష్ట్రాలు పచ్చటి కొండలతో బాగుంటాయి అనుకోవటం తప్పించి అక్కడి భౌగోళిక, సామాజిక జీవనం గురించి, అక్కడి ఉద్యమాలు, సమస్యలు, సంక్షోభాలు ఎలా ఉంటాయో మిగతా ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి పెద్దగా తెలీదనే చెప్పాలి. ప్రజలకి అవగాహన లేదని ఎందుకు చెబుతున్నానంటే, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సహాయపడటం కోసం పనిచేసిన గ్రూపులు సంయుక్తంగా నిర్వహించిన హెల్ప్ లైన్స్ వల్ల హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, కోయంబత్తూరు వంటి ప్రాంతాల నుంచీ కూడా రేషన్ కోసం, హాస్పిటల్ సపోర్ట్ కోసం ఫోన్ కాల్స్ వచ్చేవి. అందులో ఈశాన్య రాష్ట్రాల వారినుంచి  కూడా వుండేవి. అలా మమ్మల్ని విజయవాడ నుంచీ సపోర్ట్ అడిగిన వాళ్లు మణిపూర్ నుంచీ చదువుకోవటానికి వచ్చిన నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు. చైనా, కొరియా, మయన్మార్, జపాన్ లకి మన ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలవారికీ మధ్య భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితులలో వుండే తేడాలు మన వాళ్ళకి తెలియవు, అర్థంకావు. అర్థం చేసుకోవాలని కూడా ప్రయత్నం జరగదు. అందుకే, మన ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల రూపురేఖలు వేరుగా వుండటంతో, వాళ్లు తమ హాస్టల్ నుంచి ఏ చిన్న అవసరం కోసం బయటకు వచ్చినా గానీ వారిని హేళన చేయటం, మీ చైనావాళ్ల వల్లనే ఇదంతా జరిగిందని కోపంగా అరవటం వంటి ఘటనలు పరిచితుల నుంచి అపరిచితుల నుంచి కూడా ఎదుర్కొన్నారు. మేము భారత పౌరులం, మాది ఫలానా రాష్ట్రం అని చెప్పినా గానీ అదే విధమైన వివక్ష పెరుగుతుండటంతో ఆ విద్యార్థినులు భయపడి బయటకు వెళ్లటమే మానేశారు. దానికి తోడు, కోవిడ్ నిబంధనలతో హాస్టల్ లో అందరికీ ఒకే విధమైన ఆహారం… అదీ కోస్తాఆంధ్ర కారం వంటకాలు మాత్రమే పెట్టటంతో రోజుల తరబడి వారికి అలవాటైన ఆహారం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతకు ముందు కనీసం వారికి అవసరమైనవి బయటకు వెళ్లి తెచ్చుకుని వాళ్ళలో వారు అందరూ సర్దుబాటు చేసుకునేవారు. ఈ వ్యాసం కోవిడ్ లాక్ డౌన్ లో వాళ్ళెదుర్కొన్న సమస్యల గురించి కాదు. రూపురేఖల కారణంగా బయట దేశంవాళ్లు అనే వివక్ష ఎలా పనిచేస్తుందో వివరించడం కోసమే ఈ చిన్న ఉదాహరణ. దాదాపు ఇలాంటి పరిస్థితినే బెంగళూరు, ఇతర ప్రాంతాల నుండి ఫోన్ చేసినవాళ్ళు కూడా చెప్పారు. అంటే, దక్షిణ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల జీవన స్థితిగతుల గురించి చీమ తలకాయంత కూడా విషయం తెలియదు. ఏవో పైపైన అంశాలు తప్పించి! అలాగే, మన విషయాలు కూడా వారికి ఏమీ తెలియవనే అనుకోవాలి.
          బహుశా, మణిపూర్ రాష్ట్రంలో భూములు, ఆదివాసీ హోదా కోసం జరుగుతున్న ఘర్షణలల్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రాకుండా వున్నట్లయితే అక్కడ మతం పేరుతో జరుగుతున్న దుర్మార్గమైన మానవహక్కుల ఉల్లంఘన ఏదో కొద్దిమందికి తప్పించి ఇతర రాష్ట్రాల వారికి పట్టని విషయంగానే మిగిలిపోయేది. అత్యంత అమానవీయ ఘటనకు గురయిన మహిళలకు యావత్ దేశం క్షమాపణలు చెప్పాలి. భారత్ మాతాకి జై అనే గొంతుకలతోనే ఇదంతా ఎలా చేయగలిగారని నేరస్థులను నిలదీయాలి. ఆ సంఘటనకు పాల్పడిన ప్రతి వొక్కరిని, వారిని ప్రేరేపించిన వారిని చట్టబద్ధంగా శిక్షించాలి. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ సంఘటనను సుప్రీంకోర్ట్ సువోమోటోగా తీసుకుని, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మీద ఆగ్రహం వ్యక్తంచేయటం, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించడం గమనార్హమైన విషయం.  సంఘటనల క్రమాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుందనే విషయం ఇతర రాష్ట్రాలలో స్త్రీలపై జరిగే హింసతో దీనిని పోల్చకూడదని చెప్పటం వల్ల అర్థమవుతోంది.
          పోలీసుల సమక్షంలోనే మే 4న ఘటన జరిగితే, దానిమీద పద్నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వీడియో బయటకు రాకపోయివుంటే ఈ సంఘటన మీద ఎలాంటి చర్యలు చేపట్టేవారు కాదని జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఆదివాసీలు కానీ మైతేయీ సమూహానికి ఆదివాసీ హోదాను కట్టబెట్టడానికి జరుగుతున్న అధికార పార్టీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆదివాసీ కుకీలు ఇతర తెగలు నిర్వహించిన ప్రదర్శన మీద హింసాత్మక దాడులతో మొదలయిన ఘర్షణ రెండు నెలలు దాటినా ఆరలేదు. రాష్ట్రం తగలబడి పోయింది. ఇంకా తగలబడుతూనే వుంది. ఇంటర్నెట్ ఆపేశారు. కుకీలకు చెందిన చర్చీలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు వందలాదిగా ధ్వంసమయ్యాయి. దాడి, ప్రతిదాడుల్లో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిరంతర  కర్ఫ్యూలతో ప్రజల జీవితం అల్లకల్లోలమయింది. రాజ్యాంగ విలువలను పరిరక్షించటంలో పూర్తిగా విఫలమైన రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయకుండా కేంద్రప్రభుత్వం శాంతిభద్రతలను మాత్రం తన చేతిలోకి తీసుకుంది కానీ హింసను ఆపలేకపోయింది. బహుశా ఆపాలని అనుకోవటం లేదన్న విషయం అనేక సంఘటనల ద్వారా రుజువవుతోంది. బయటకు వచ్చిన వీడియో మీద తప్పనిసరై పెదవి విప్పాల్సివచ్చిన ప్రధానమంత్రి గారి మాటలే దీనికి నిదర్శనం. జాతి ఉన్మాదంతో వున్న మూకలు చేసిన నిర్వాకాన్ని తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో జరిగే సంఘటనలతో పోల్చటం ఎలా సమంజసమో వారికే తెలియాలి! నిజానికి వారు వల్లించే బేటీ పడావో, బేటీ బచావో అనేవి కేవలం నినాదాలేననేది లైంగిక వేధింపులపై మహిళా మల్లయుద్ధ క్రీడాకారులు దేశ రాజధానిలో సుదీర్ఘంగా చేపట్టిన పోరాటం తేటతెల్లం చేసింది కూడా.
         మణిపూర్ కి వందలాది మైళ్ల దూరంలో ఉన్న మనమేం చేయాలి ఇప్పుడు? మొట్టమొదటగా.. జాతుల మధ్య సంఘర్షణల్లో స్త్రీల శరీరాలను సాధనంగా ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదని అన్ని రాజకీయ పార్టీలకు గట్టిగా చెప్పి తీరాలి. మణిపూర్ లో సాగుతున్న మారణహోమం తక్షణమే ఆపాలని, అన్ని రకాల హింసాత్మక చర్యలను నిలిపివేయాలని, ముఖ్యంగా స్త్రీలు, వృద్ధులు, పిల్లలపై దాడులకు పాల్పడటం తగదని, జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యాపార సముదాయాలను ధ్వంసంచేయటం ఆపాలని, ఇళ్లను, విద్యా- ఆరోగ్య కేంద్రాలను కూల్చడం, వాటిని దహనం చేయడం వంటివి చర్యలు తగదని, మత ప్రదేశాలను ధ్వంసంచేయటం ద్వారా మత విశ్వాసాలను దెబ్బతీయటం తక్షణమే ఆపి, విభేదాల పరిష్కారానికి అవసరమైన శాంతియుత చర్యల వైపు అడుగులు వేయాలని, ఈ దిశగా ఇరుపక్షాల సమూహాలతో ఒక సంభాషణ జరగాలని తెలుగు రాష్ట్రాల పౌర, మహిళా, హక్కుల, ప్రజా సంఘాలుగా మనందరం ఎలుగెత్తి కోరాలి.  హత్యలు, చిత్రహింసలు, శిరచ్ఛేదాలు, లైంగిక హింస, అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులను చట్టప్రకారం చర్యలు చేపట్టి శిక్షించాలని, ఎటువంటి వివక్ష లేకుండా పునరావాస కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాల మీద వొత్తిడి చేయాలి.
        దూరప్రాంతంలోని ఘర్షణలతో మనకేం సంబంధం అనుకోకుండా, బాధితులకు కనీస స్థాయిలో అయినా చేయూతని అందించగలిగిన డాక్టర్స్, శిక్షణపొందిన కౌన్సెలర్లు, సైకియాట్రిక్ డాక్టర్లు, ట్రామా స్పెషలిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు వంటి ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్లి సాయం అందిస్తే అంతకంటే మానవీయత మరొకటుండదు. ఇలాంటి వారి అవసరం ఇప్పుడక్కడ ఎంతో వుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రిలీఫ్ లో భాగమైన మహిళా హక్కుల కార్యకర్తలు పునరావాస కేంద్రాల్లో బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినిందని, కోలుకోవటానికి సరైన వైద్య, నిపుణులతో థెరపీలు అవసరమని చెబుతున్నారు. ఇతరత్రా అక్కడి బాధితులకు ఎలాంటి అవసరాలున్నాయో తెలుసుకుంటూ అది అందించటానికి మనలో విజ్ఞులు అందుకు సంసిద్ధంగా వుండాలి.
       మణిపూర్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అధ్యక్షురాలు ‘అనీ రాజా’ లాంటి సీనియర్ యాక్టివిస్టుల మీద, అక్కడి పరిస్థితిని విశ్లేషిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖంఖాన్ సువాన్ హౌసింగ్, డాక్టర్ మేరీ గ్రేస్ జౌల మీద పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పౌరసమాజం డిమాండ్ చేయాలి.  స్వతంత్రంగా పనిచేసే విద్యావేత్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు మణిపూర్ లో పర్యటించి అక్కడ జరిగిన, జరుగుతున్న అన్ని సంఘటనల మీదా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి న్యాయస్థానానికి నివేదించే విధంగా ప్రయత్నాలు జరగాలి.  నిర్వాసిత శిబిరాలలో వుంటున్న బాధితులందరి స్టేట్మెంట్లను రికార్డు చేయాలి. ఇళ్లు, జీవనోపాధులు కోల్పోయిన అందరికీ పునరావాస సహాయం అందించాలి. దాడుల్లో గాయపడిన వారికి తక్షణం వైద్యం అందేలా చూడాలి. లైంగికహింసకు గురయిన మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పరచాలి. వీటన్నిటి కోసం ఒక ప్రత్యేకమైన పాలసీని తయారుచేసేలా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించాలి. అప్పుడే బాధితుల గుండె మంట కాస్తయినా చల్లారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *