భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు. రైతుబంధు రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం అందులో ఇసుమంతా అనుమానం లేదు.నేరుగా రైతుకు నగదు బదలీ చేసే సాహసం మునుపెన్నడూ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేసిన చరిత్రలేదు.కలిసిరాని కాలాలతో సతమవుతూ కాడి-మేడి వదిలేయడానికి సిద్దమైన రైతాంగానికి నేనున్నానని ధైర్యమిచ్చే ఆత్మబంధు ప్రయత్నమే రైతుబంధు. అమలుకోసం రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలు మొత్తం ‘ధరణి’ అనే వెబ్‌ సైట్‌ లో పొందుపర్చినారు. పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో ధరణి రద్దు ప్రచారాస్త్రంగా ముందుకుసాగారు. ‘ధరణి’ తప్పుల తడకగా అభివర్ణించారు. రైతుబంధు అనేది ధనిక రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే తప్ప, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే కౌలు రైతులకు దీనివల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు.1990 దశకం నుంచి దేశంలో వ్యవసాయం మరింత సంక్షోభంలో పడిపోయింది.నాటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతుల సమస్యలకు పరిష్కారం దొరకలేదు. స్థూలంగా వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలతో.రైతులు అనుభవిస్తున్న ఖ్లేషాన్ని దూరంచేయడానికి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రైతు భరోసా స్కీమ్‌ కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చి, విజయం సాధించింది. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు వందల కోట్లు దోచి పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని గత కొంత కాలంగా చెప్పినప్పటికీ, ట్రెజరీలో నిధులు లేవని,ఇప్పటికిప్పుడు రైతు భరోసా అమలు కాదని వార్తలు వెలువడ్డాయి. ముందు జాగ్రత్తగా రైతు భరోసా విధి, విధానాలు ఖరారు కానందునే ఆలస్యానికి కారణం అయితే..రైతులు ఇబ్బంది పడుతారని గ్రహించి,ఈ దఫా రైతులకు యధావిధిగా  రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని  సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.నెల రోజులుగా ట్రెజరీ నుంచి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.ఇప్పటి వరకు రెండు ఎకరాల వరకు దాదాపు 46లక్షల మంది రైతులకు జమ అయినట్లు వివిధ ప్రాంతాల్లోని రైతులు చెప్పుకుంటున్నారు.ఇంతెందుకు నాకు ఎకరం ఉంటే నేల క్రిందనే జమ అయ్యింది.నా బిడ్డకు రెండు ఎకరాల భూమికి రైతుబంధు సాయం అందుకున్నది.ఇంతెందుకు ప్రతిపక్షాలు అన్నారని కాదు రెండు ఎకరాల రెండు గుంటలు ఉన్న నిరుద్యోగి నా కోడలుకు ఈ రోజు వరకు జమకాలేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం గత ప్రభుత్వం లాగ వారం రోజుల్లో రైతుబంధు పూర్తిచేయలేదు. బడ్జెట్‌ ను బట్టి  ట్రెజరీ విడుదల చేస్తున్నట్టుగా తతంగం కన్పిస్తున్నది. అటువంటిది ఇంకా రైతుబంధు రాలేదని విపక్షాలు రాదంతం చేయడాన్ని తప్పుపడుతున్నారు.కట్‌ చేస్తే.. అధికారంలో ఉండి మేం ఏమన్నా తక్కువా తిన్నామా అంటూ ప్రతిగా బాధ్యతారాహిత్యంగా చెప్పులతో కొట్టుతామని వ్యాఖ్యానించడం అన్నదాతలను అవమానపర్చడమే.

రాష్ట్రంలోని 90శాతానికి పైగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతు తలెత్తుకొని సగర్వంగా చెప్పుకొని బతికే స్థితికి తెచ్చింది ముమ్మాటికీ కేసీఆర్‌ ఆలోచనే. తెలంగాణ ఏర్పడేనాటికి రైతుల దైన్యాన్ని గమనించిన వారికి, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మార్పులు కలా ? నిజమా? అనే దిగ్భ్రమను కలిగిస్తున్నాయి.’ధరణి పోర్టల్‌’ తప్పుల తడకగా మారిందని, అసలు రైతులకు నష్టం జరిగిందని ఎన్నికల మ్యేనిఫెస్టోలో నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి  భూమాత తెస్తామని, ఎకరాకు 15000వేలు ఇస్తామని  చెప్పడం జరిగింది.రైతు భరోసా అమలు కావాలంటే మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇచ్చేది ఐదెకరాలా ? పదెకరాలా? స్పష్టత రావాల్సి ఉంది.రైతు భరోసా అమలులో పారదర్శకత ఉంటే వెంకీ పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టేనని ఇన్నాళ్లు లక్షలాది రూపాయలు దండుకున్న బడా భూస్వాములు కుక్క పేరు మీద, నక్క పేరు మీద రాసే ప్రయత్నం మొదలైంది.రాష్ట్ర రైతులను సాగులో నిలబెట్టి ఆర్థిక భరోసా కల్పించిన రైతుబంధు (రైతు భరోసా) రాష్ట్ర చరిత్రలో అద్భుత ఘట్టంగా ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించాయి.సీఎం రేవంత్‌ ఇచ్చినా హామీ ప్రకారం కౌలు రైతులను గుర్తించే విధానాన్నిసైతం ఖరారు చేయాల్సి ఉంది.ధరణి రద్దయితే రైతు భరోసా వల్ల అసలు రైతులు నష్టం జరగదనే నమ్మకం కల్గింది.రేవంత్‌ తీసుకున్న నిర్ణయంతో  ఇన్నాళ్లు పెళ్ళకదిలించని భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.అధికారంలో ఉండి ప్రతిపక్షంలా  మాట్లాడితే ఏం జరిగిందో మొన్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూసినాము కదా? అసలే కాంగ్రెస్‌ లో ప్రజాస్వామ్యం ఎక్కువ..జాగ్రత్త.

ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం కేసీఆర్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20పథకాలలో రైతుబంధు ఒకటి. ఇప్పటికి 11విడతల్లో మొత్తం రైతుబంధు పథకం ద్వారా 72,931 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది.కాంగ్రెస్‌ ఎన్నికల మ్యేనిఫెస్టోలో నాలుగు రోజులు ఆగండి..15000 ఇస్తాం అంటూ పదే పదే చెప్పినప్పటికి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానికి తర్జన, భర్జనతో ఈ దఫా :రైతు భరోసా’ జమకు నోచుకోక పాత పద్దతిలోనే ధరణి పోర్టల్‌ ఆధారంగా జమచేయడం ప్రారంభించింది. సీఎం రేవంత్‌ రైతు భరోసా అమలుకు సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ దఫా పెట్టుబడి సాయం పాత పద్దతిలో అమలుకు ఆదేశించింది.తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సాయంలో సాగు చేయని భూములను గుర్తించి,భూస్వాములను గుర్తించి భూమాత పోర్టల్‌ ద్వారా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఖరారు చేయాల్సి ఉంది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ చేపట్టిన పథకాన్ని ‘రైతు భరోసా’ పేరుతో సీఎం రేవంత్‌ అమలు ప్రయత్నం నాగలి దున్నే రైతు సమాజం స్వాగతిస్తున్నది.దుబారా ఖర్చును కట్టడి చేసి నిజమైన రైతు కష్టార్జితం వృధా కాకుండా చేయాలని ఎదిరిచూస్తున్నది. ఇన్నాళ్లు బీడు భూములకు,సాగు చేయని రోడ్లకు రైతుబంధు సాయం పొందినా.. వచ్చే ఖరీఫ్‌ సీజన్లో ప్రభుత్వం ఖరారు చేసే విధి ,విధానాలతో భూస్వాములకు ‘తడి’ బంధు ఖాయం. భూమాత ద్వారా ఇక భూస్వాముల లేని ‘మడి’ కి సాయం ఎండినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *