భారతదేశ తత్వం ప్రపంచానికి స్ఫూర్తి

సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు భారతీయ తత్వవేత్తల కృషి
కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి16:  శాంతిమంత్రాన్ని బోధించే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో ఆయన పాల్గొని మాట్లాడారు. అతిథి దేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమని అన్నారు. ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా సాగేందుకు  ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో స్వామి వివేకానందుడు అందించిన సందేశం యావత్ ప్రపంచానికి భారతదేశ తత్వాన్ని గుర్తుచేసిందన్నారు. భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటికీ మిత్రదేశంగానే ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా.. భారతదేశం శాంతిమంత్రాన్నే బోధించిందని చెప్పారు. భారతదేశం  హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతానికి పుట్టినిల్లు అని  ఈ మతాలన్నీ శాంతి, సామరస్యం, పరోపకారాన్ని ప్రపంచానికి బోధించాయన్నారు.

ప్రాచీనకాలం నుంచి భారతదేశం ఆత్మశోధనకు కేంద్రంగా ఉందని,  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తత్వవేత్తలు, మేధావులు స్వయంశోధనకు భారతదేశం వచ్చేవారని గుర్తుచేశారు.  భారతదేశంలో తత్వవేత్తలు సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు కృషిచేశారని కొనియాడారు  ఇందులో ఆదిశంకారాచార్య, రామానుజాచార్య, బసవణ్ణ..  అరబిందో, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఉన్నారని తెలిపారు.  ప్రపంచమంతా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు భారత్ మొదట్నుంచీ కృషిచేస్తోందన్నారు. ప్రపంచశాంతి లక్ష్యంగా ఉద్దేశించిన ఈ కార్యక్రమం సంకల్పిత లక్ష్యాలను చేరుకోగలదనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్‌ఖర్, సుదేశ్ జగదీప్ ధన్‌ఖర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ  సాంస్కృతిక మంత్రి  జూపల్లి కృష్ణారావు, గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్  కమలేశ్ డి పటేల్ (దాజీ) తోపాటు . భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా   ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *