భక్తులందరిపై సమక్క-సారలమ్మల దీవెనలు

అందరి సహకారంతో జాతర విజయవంతం
రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : దక్షిణ తెలంగాణ కుంభమేలా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 110 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహించారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహకారంతో నిరంతరం కృషి చేసిన ఇతర జిల్లా యంత్రాంగం మొత్తాన్ని శుక్రవారం  సీతక్క అభినందించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తమై జాతర నిర్వహణను విజయవంతం చేశారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మల దీవెనలు ప్రజలందరికి ఉండాలని, మంచి ఆరోగ్యం, వారి కుటుంబానికి సంక్షేమం ఇవ్వాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణలోనే అతిపెద్ద జాతర ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతుందని అన్నారు. అమ్మవార్లపై విశ్వాసంతో రానురాను ఈ జాతరకు భక్తులు పెరుగుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు, అలాగే విఐపిల దర్శనాలకు అన్ని చర్యలు తీసుకుంటూ మంత్రి సీతక్క ఎంతో కృషి చేశారన్నారు. ఈ జాతర నిర్వహణ మొత్తం ఐటీడీఏ పరిధిలో జరుగుతుందని తెలిపారు. ఆలాగే జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెంటనే 110 కోట్లు విడుదల చేసి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాలు, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) శ్రీజ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌ కుమార్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *