- నితీశ్ బలపరీక్షకు ముందే స్పీకర్ రాజీనామా
- అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్ కుమార్ సిన్హా
- ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ
- దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి
పాట్నా, ఆగస్ట్ 24 : బీహార్ రాజకీయాలు మరోమారు చర్చగా మారాయి. ఓ వైపు నితీశ్ బలపరీక్ష, అంతకుముందే స్పీకర్ రాజీనామా జరిగిపోయాయి.మరోవైపు సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ సాగుతుంది. ఇలా నీతీశ్ కుమార్ సర్కార్ బలపరీక్షకు ముందు బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పదవికి భాజపాకు చెందిన విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. ఇటీవల ఏర్పడిన మహాగట్ బంధన్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కునే ముందే అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. తనపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆవేదన చెందారు. తనపై వొచ్చిన ఆరోపణలేవీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. భాజపాకు చెందిన ఆయన విధాన సభను 2 గంటలకు వాయిదా వేసి గందరగోళం నడుమ బయటకు వెళ్లారు. బలపరీక్షకు నేతృత్వం వహించాల్సిందిగా జేడీయూకు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ పేరును సిన్హా సూచించారు. అంతకుముందు సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అస్పష్టంగా ఉందని, నియమ నిబంధనలు పాటించలేదని తెలిపారు. ‘స్పీకర్‌ను అనుమానించి రు ఎలాంటి సందేశం పంపుదామని చూస్తున్నారని, ప్రజలే నిర్ణయం తీసుకొంటారని వ్యాఖ్యానించారు.
చివరకు రాజీనామా చేసిన అనంతరం హడావుడిగా తీవ్ర భావోద్వేగంతో సభను వీడి బయటకు వెళ్లారు. అదే సమయంలో భాజపాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాషాయ కండువాలు ధరించి ‘భారత్ మాతాకీ జై’, ’జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అంతకుముందు భాజపా ఎమ్మెల్యేలు విధాన సభ ముందు నిరసనలు చేశారు. రోవైపు మహా గట్‌బంధన్ సర్కారు బలపరీక్ష రోజే పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సహా పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఆర్‌జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కలిసి జేడీయూకు చెందిన నీతీశ్ కుమార్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ ప్రభుత్వం ఈ నెల 10న కొలువుదీరింది. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. భాజపాకు చెందిన అసెంబ్లీ స్పీకర్ సిన్హా రాజీనామా చేయలేదు. సాధారణంగా ప్రభుత్వం మారితే అంతకుముందు ఎన్నికైన స్పీకర్ రాజీనామా చేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం.. అసెంబ్లీ సెక్రటేరియట్ రెండు రోజుల సెషన్ షెడ్యూల్‌లో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సూచనల మేరకు మార్పులు చేసింది. పదవిని వీడేందుకు నిరాకరిస్తున్న సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఈ మార్పులు జరిగాయి. దీంతో సిన్హా బుధవారం రాజీనామా చేయక తప్పలేదు.ఈ క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. సర్కారు బలపరీక్ష రోజే పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది.
పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సహా పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఐటీ, ఈడీ, సీబీఐ ఈ మూడు భాజపా కిందే పనిచేస్తాయని, వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుందని ఆర్జేడీ నాయకులు మండిపడ్డారు. అయితే సీఎం నీతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకే సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ అన్నారు. బలపరీక్ష రోజు.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ’ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలపై సింగ్ స్పందిస్తూ..’ఇప్పటికే ఒక సారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్ కరీం ఇంటిపై కూడా సీబీఐ నేడు దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ ’ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు.. భాజపా దాడులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి భాజపా కిందే పనిచేస్తాయి. వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుంది. నేడు బిహార్ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది.. అదే సమయంలో ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. 2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పని చేశారు. రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం 2009లో జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్-డి ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతీతో పాటు ఉద్యోగాలు పొందిన పలువురిని సీబీఐ నిందితులుగా చేర్చింది. అయితే ఈ దాడులకు వెరవబోమని మాజీ సిఎం రబ్రీదేవి అన్నారు. కేంద్రం కుట్రమేరకు దాడులు జరుగుతున్నాయని అన్నారు.




