స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో కనీసవాటా దక్కలేదు. నాడు పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు బీసీల గురించి ఆరాటపడ్డది తక్కువే. నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి బడుగులకు అవకాశాలు కల్పించడం వల్లనే చట్టసభల్లో బీసీల వాణి విన్పించకల్గుతున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 10శాతం కూడాలేని అగ్రవర్ణాల చేతిలో రాజ్యం నడుస్తుంది. అటువంటిది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బీసీ సూర్యోదయంగా రేవంత్ నిలిచారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరు మహాత్మాజ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి బీసీల గుండెల్లో చోటు సంపాదించింది.తొమ్మిది దశాబ్దాలుగా కులగణన కావాలి,మా బీసీల వాటా తెల్చాలని మొత్తుకున్నా సామాజిక అవసరాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేతో కులాలవారీగా జనగణన చేసి ఆయా కులాల బలాలను బట్టి కులాలకు పెద్దపీట వేసింది.బీసీల బలం తేలితే ఉన్నత కులాలకు నష్టం జరుగుతుందని, కుట్రపన్ని ప్రజలకు అందుబాటులోకి తేలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కులగణన ఆమోదించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఉన్నది కానీ, నోచుకోలేదు.కాల చక్రం గుండ్రంగా తిరుగుతుందంటే గిదేనేమో.
తెలంగాణ రాష్ట్రంలో 54శాతం ఉన్న బలహీన వర్గాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్,బీజేపీ ఇచ్చిన సీట్లలో 19మంది మాత్రమే శాసనసభకు ఎన్నికైనారు. బీసీలకు ఆర్థికస్థోమత లేదని ఒకపార్టీ, ఓడిపోయే సీట్లను ఇచ్చిన మరో పార్టీ, అభ్యర్థులు కరువై బీసీలకు పెద్దపీట అని చెప్పుకునేందుకు సీఎం చేస్తానని చెప్పిన పార్టీ పుణ్యమాని గెలిచింది. సింహభాగం 52శాతం ఓసీలే.ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించలేదని, జనాభాలో 10శాతం ఉన్న అగ్రకులాలకే అధిక సీట్లు కేటాయించారని బీసీ సంఘాలు అడపా, దడపా ఆగ్రహం వ్యక్తం చేసినాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జనగణన చేయకుండా కాలయాపన చేస్తుంది. ఎన్నికల సమయంలో పార్టీలు వాగ్దానాలకే పరిమితం కావడం వల్ల చట్టసభల్లో మన ప్రాతినిధ్యం కన్పించడం లేదు. మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసైనా బీజేపీ ఓబీసీల ఉసెత్తలేదు. అయితే వారి భరోసా అంతాకూడా ఇంకా వంద సంవత్సరాలు గడిచినా బీసీలు ఒక్కగొడుగు కిందకు రారు,వచ్చినా చైతన్య స్ఫూర్తి నిండదనే మితిమీరిన విశ్వాసం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, నాణ్యమైన విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసి బడుగుల మన్ననలు పొందినారు.రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల అవసరాలను గుర్తించకుండా గోర్లను,బర్లను చూపెట్టి కొంత నిర్లక్ష్యం చేసింది.నాటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న సుప్రీం హైకోర్టు సాకుతో బీసీ రిజర్వేషన్లు 34శాతం నుంచి 22కు తగ్గించిందనే విమర్శ ఉంది.నాడు పాలించిన ప్రభుత్వాల కుట్రలో భాగంగా గణాంకాలు లేక విద్యా,ఉద్యోగాలలో, చట్టసభల్లో రిజర్వేషన్లకు నోచుకోలేదనేది జగద్విదితం.
నాగపూర్ వేదికగా ఓబీసీల జనగణన చేస్తామని రాహుల్ గాంధీ మరోమారు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో జనగణనకు కట్టుబడి అసెంబ్లీలో తీర్మానం చేయడం బడుగుల మొఖాల్లో వెలుగు జిగేల్ మంటుంది.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మొదటి సారిగా నితీష్ ప్రభుత్వం కులగణన చేసి ఆదర్శంగా నిలిచింది.బీజేపీ భయపడుతున్నట్టుగానే 63శాతం ఓబీసీలు ఉన్నారని గణాంకాలు తేలింది.రిజర్వేషన్లు 50శాతం దాటవద్దన్న ఉన్నత న్యాయస్థానానికి బిన్నంగా 75శాతానికి పెంచింది.బీహార్ ప్రభుత్వం చూపెట్టిన స్ఫూర్తి అట్టడుగు వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు మొద్దుబారిన ప్రభుత్వాలకు తెలియజేసింది.అదేబాటలో మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పయనించడం ముధావహం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని గద్దెనెక్కిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందనే ఆశలు చిగురించాయి.
గెలుపు గుర్రాలు లక్ష్యంగా ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు దొరకని బీసీలను గుర్తించి వివిధ హోదాల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.దేశ జనాభాలో సింహభాగం ఉన్నా ఓబీసీల జనగణన చేస్తామని శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ సామాజిక భాద్యతగా క్యేబినెట్‌లో ఆమోదం తెలిపడం,అసెంబ్లీలో బీసీ మంత్రి ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం బీసీల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది.రేవంత్ ప్రభుత్వం నిర్ణయం వల్ల విద్యా,ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకత్వంలో రిజర్వేషన్లు అధిగమించవచ్చు.నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు లేకపోతే 31మంది ముఖాలు చూసే అదృష్టం దక్కక పోయేదని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
-డా. సంగనిమల్లేశ్వర్
రాష్ట్ర అధ్యక్షులు, ఫూలే ఆశయసాధన సమితి, తెలంగాణ రాష్ట్రం,
సెల్: 9866255355





