బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో విద్యా సంస్థలు

నీట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం
మోదీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు..కానీ పేపర్‌ లీకులను ఆపలేరు
యూజీసీ-నెట్‌ రద్దయింది…నీట్‌ రద్దయితుందో లేదో తెలియదు
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌
‘నీట్‌’పై నేడు దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 20 : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థలను ఖబ్జా చేసి వాటి గుప్పిట సంస్థలుగా మార్చుకున్నాయని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఒక్క విద్యాసంస్థలే కాకుండా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంటూనే ఉంటుందని రాహుల్‌ దుయ్యబట్టారు.

 

గురువారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా దేశం వ్యాప్తంగా నాన్‌ స్టాప్‌గా పేపర్‌ లీకులు జరుగుతున్నాయని పలువురు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రస్తుతం నీట్‌-యుజి, యీజీసీ-నెట్‌ పరీక్ష పేపర్‌లు లీక్‌ కాగా యీజీసీ-నెట్‌ పరీక్ష రద్దు చేయబడగా నీట్‌ సంగతి ఏమవుతుందో తెలియదని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగల ప్రధాని మోదీ కారణాలేవైనా పరీక్ష పేపర్‌ల లీక్‌లను మాత్రం ఆపలేక పోతున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అయితే చివరకు అన్నింటా వోడిపోయేది విద్యార్థులేనని, నెలలు, సంవత్సరాల తరరబడి కష్టపడి చదివిన వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని రాహుల్‌ దుయ్యబట్టారు.

 

రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నీట్‌ అంశాన్ని లేవనెత్తుతామని విలేఖరులు అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిచారు. వారి ప్రయోగశాలగా మధ్యప్రదేశ్‌లో వ్యాపంతో మొదలైన పేపర్‌ లీకులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించాయని బీజేపీని ఉద్దేశించి రాహుల్‌ విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ ఏ విధంగా దెబ్బతీశారో ఇప్పుడు విద్యావ్యవస్థలను కూడా అలాగే చేశారని విమర్శించారు. ఈ వ్యవహారాలన్ని జరుగడానికి, విద్యార్థులు బాధపడడానికి కారణం స్వతంత్ర, నిష్పాక్షికమైన విద్యావ్యవస్థను విధ్వంసం చేయడం వల్లనేనని, దోషులుగా ఉన్న వ్యక్తులను శిక్షించడం చాలా ముఖ్యమని రాహుల్‌ స్పష్టం చేశారు. అయితే తాను వ్యవస్థీకృత హైజాకింగ్‌ గురించి మాట్లాడుతన్నాని, ఇప్పటికీ అదే జరుగుతున్నదని అన్నారు. ప్రధాని ఈ వ్యవహారాన్ని సులభతరం చేయడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ అన్ని సంస్థలను ఖబ్జా చేసిందని విమర్శించారు. మెరిట్‌ ప్రకారం కాకుండా వారి భావజాలం ప్రకారం, ఒక సంస్థకు అనుబంధంగా ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడమే అందుకు కారణమన్నారు. వారు సంస్థలన్నీ స్వాధీనం చేసుకున్నందునే ఇది జరుగుతుందన్నారు.

 

వైస్‌-ఛాన్సలర్లుగా మెరిట్‌ ఆధారంగా కాకుండా ఒక నిర్దిష్ట సంస్థకు చెందినవారిని నియమించి ఆ సంస్థ, బిజెపి మన విద్యావ్యవస్థలోకి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేశాయని మండిపడ్డారు. కాగా ఇప్పుడు మోదీకి ప్రాధాన్యత అంతా స్పీకర్‌ ఎంపికపైనే అని, నీట్‌ గురించి పట్టించుకోవడం లేదని, దీని వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏదేమైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. కాగా నీట్‌-యుజి వివాదంపై విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్‌ నేడు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. శుక్రవారం భారీ నిరసనలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లను ఆదేశించింది.

నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌ మరియు కాపీయింగ్‌ కారణంగా వేధింపులకు గురైన విద్యార్థులను  కలుసుకుని  కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సం భాషించారు.నరేంద్ర మోదీ, ఆయన మంత్రుల చేతకానితనం వల్ల ఇలాంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని  పేర్కొంటూ దేశంలోని యువతకు అన్యాయానికి వ్యతిరేకంగా తను  వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో పేపర్‌ లీకేజీలు, పరీక్షల కాపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలపడంతో పాటు వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *