కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే
రెండూ మజ్లిస్ పంచన చేరుతాయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ దిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక నుంచి సూట్ కేసులు వొస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి దిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు వెళ్లల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దొందు దొందే అని విమర్శించారు. ఆ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలేనని, మజ్లిస్ పంచన చేరుతాయని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ కాబట్టి బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ మీద దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తే..విజిలెన్స్ పేరుతో కాలయాపన చేస్తున్నదని, విజిలెన్స్‌తో అయ్యేది లేదు.. పోయేది లేదన్నారు. కాంగ్రెస్ చెయ్యి భస్మాసుర హసమని, చేయి గుర్తుకు వోటేస్తే..అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక వారు జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుందన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వొస్తున్నా.. జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్, రూ. 450 కోట్లతో కాచిగూడ, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ కానుందన్నారు.
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలంటే మోదీ నాయకత్వం.. బీజేపీ నాయకత్వం అవసరమన్నారు. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చారని, వరంగల్ రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వొచ్చిందని, జోగిలాంబ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణం జరిగిందని, హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ ఆర్ రోడ్డును మోదీ మంజూరు చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీదని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిత్యం ఉగ్రవాదుల బాంబులతో రావణకాష్ఠంలా మండే కశ్మీర్‌లో 370 ఆర్టికల్ ఎత్తేసి.. అక్కడ శాంతి నెలకొల్పిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదన్నారు. దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల చేతిలో పలువురి హత్యలు జరిగేవని, మోదీ వొచ్చిన తర్వాత ఐఎస్‌ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారన్నారు. తొమ్మిన్నర ఏండ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. వొచ్చే 25 ఏండ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్‌ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారని, అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధమవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయని, అందుకే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వొచ్చిన తర్వాత మెదక్, సిద్ధిపేట రైల్వే లైన్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 రైల్వే బ్జడెట్‌లో తెలంగాణకు రూ.250 కోట్లు కేటాయిస్తే..ఇప్పుడు రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సవిూపంలో కొత్తపల్లి-మనోహరాబాద్ కొత్త రైల్వే మార్గంలో నూతన రైల్వే స్టేషన్‌కు కిషన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ ప్రభుత్వంలోనే రైల్వే రంగంలో వేగంగా అభివృద్ది జరుగుతుందని, యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క రైల్వే లైన్ కూడా రాలేదని, అన్యాయం జరిగిందని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లు కేటాయించబోతుందని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ భూసేకరణ చేస్తే వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గత ప్రభుత్వం భూసేకరణ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిందని, కొత్త ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి పాల్గొన్నారు. కొమురవెల్లి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వొస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీలు కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బండి సంజయ్‌తో పాటు గవర్నర్ తమిళిసైకు భక్తులు వినతిపత్రాలు అందించారు. దీనిని ఎంపీలందరూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలయానికి మూడు కిలోవిూటర్ల దూరంలో కొత్త రైల్వే స్టేషన్‌ను రైల్వేశాఖ మంజూరు చేసింది. దీంతో ఇవాళ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది.



