బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ తేదీన బేటీ జరిగింది. ప్రవీణ్‌కుమార్‌ స్వయంగా హైదరాబాద్‌ నందినగర్‌లోని బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఇంటికి వెళ్ళి పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో సుదీర్ఘంగా చర్చించి ఒక అవగాహనకు వొచ్చారు. అయితే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే నాలుగు స్థానాల్లో బిఆర్‌ఎస్‌ తమ అభ్యర్ధులను ప్రకటించింది. కాగా మిగతా స్థానాల విషయంలో  కెసిఆర్‌, మాయావతి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.కానీ బిఎస్‌పీ అధినేత్రి కుమారి మాయావతి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ తో కలిసి పోటీ చేయదనీ,పొత్తుల పై వొస్తున్న  వార్తలను నమ్మవొద్దని తెలిపారు.

గడచిన శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా మరే పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేశాయి. అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు విమర్షనాస్త్రాలను సంధించుకోవడం  తెలియందికాదు. ముఖ్యంగా అప్పటికే తొమ్మిదిన్నర ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీపైన, నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైన ప్రవీణ్‌కుమార్‌  అనేకసార్లు తీవ్రంగా విరుచుకు పడ్డారు. విచిత్రమేమంటే అయన తెలంగాణరాష్ట్రంలో సాంఫ్నీక సంక్షేమ శాఖ (గురుకులాల) కార్యదర్శిగా పనిచేసినప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆనాడు ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ కూడా ప్రోత్సహించారు. ఎప్పుడ్కెతే ఆయన ప్రభుత్వ పదవిని వొదులుకుని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడో అప్పటినుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తీవ్రంగా తప్పుపట్టడం ప్రారంభించారు.

దొరల తెలంగాణ కాదు ప్రజలందరి తెలంగాణ కావాలని, బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా ఎదగాలంటూ ఆయన బహుజనుల అభివృద్దికోసమే రాజకీయాల్లోకి వొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కెసిఆర్‌కు నిజంగానే దళితులపైన ప్రేమ ఉంటే ఆయన ఆస్తులను అమ్మి దళితులకోసం ఖర్చు చేయాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తొలిరోజున్నే విరుచుకుపడ్డారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బహజనరాజ్యం ఆవిర్భవిస్తుందన్న నమ్మకాన్ని కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. బిఎస్పీ అధికారంలోకి వొస్తే ప్రవీణ్‌కుమారే కాబోయే ముఖ్యమంత్రి అని, ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించింది కూడా. కాగా బిఎస్పీ తెలంగాణలో సుమారు 108 శాసనసభ స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టింది. ప్రధానంగా కెసిఆర్‌ను ఓడిరచాలన్న లక్ష్యంగా కామారెడ్డిలో తమ అభ్యర్థిని నిలిపారు. ప్రవీణ్‌కుమార్‌ కూడా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్‌ అభ్యర్థితో పొటీపడ్డారు. కాని, ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బిఎస్పీ గెలుచుకోలేకపోయింది.

కనీసం డిపాజిటు ్లకూడా రాలేదు.  సిర్పూర్‌లో తన ఓటమికి బిఆర్‌ఎస్సే కారణంగా ఆయన ఆరోపించారు. ఇక్కడ బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ వోటర్లను బెదిరించిందని, డబ్బు పంపిణీ చేసిందని, తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించిందంటూ పలు ఆరోపణలు చేశారు. అయినా 44వేల వోట్లతో తనను అభిమానించిన సిర్పూరు ప్రజల మధ్యనే ఉంటానని వారికి అభయమిచ్చారు. ఆ ఎన్నికలు ముగిసి ముచ్చటగా మూడు నెలలు కావొస్తుండగా, ఇప్పుడు విచిత్రంగా బిఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తుకు బిఎస్పీ సిద్ధమైంది. దేశంలో క్షీణిస్తున్న సెక్యులర్‌ విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడేమో దేశంలో కాంగ్రెస్‌ బలహీనపడిఉంది. రాష్ట్రంలో  కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇలాంటి దశలో సెక్యులర్‌ భావాలు కలిగి, దేశంలో సెక్యులరిజాన్ని కాపాడకలిగే బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకోవడమే సరైందని తమ పార్టీ భావించినట్లు ప్రవీణ్‌కుమార్‌ పేర్కొనడం గమనార్హం. తమ అధిష్టానంకూడా బిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నదంటున్న ప్రవీణ్‌కుమార్‌,  కేవలం వోట్లు, సీట్లకోసమే కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తమ పార్టీల కలయిక వల్ల ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో దూకుడుగా దూసుకువొస్తున్న కాంగ్రెస్‌, బిజెపిని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమన్న భావనతోనే బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ బిఎస్పీతో పొత్తుకు అంగీకరించి ఉంటాడనుకుంటున్నారు. గత ఎన్నికల్లో  కేవలం రెండు శాతం వోట్ల తేడాతో చాలా స్థానాలను కోల్పోవాల్సి వొచ్చిన నేపథ్యంలో  బిఎస్పీ కలయికతో ఆ పర్సంటేజ్‌ కలిసివొస్తుందని బిఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లుంది. ఏదిఏమైనా ఇప్పటికే దళిత బంధు, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు తదితర పథాకాలతో వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ అందించిన సేవలను ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారన్నది బిఎస్పీ కలయిక ద్వారా స్పష్టమవుతుందంటున్నాయి బిఆర్‌ఎస్‌ వర్గాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *