బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌

 ( మండువ రవీందర్‌రావు )
     రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు. శాసనసభా సమావేశాలు ప్రారంభంనుండి ఇదే వరుస కొనసాగుతుండగా, శనివారంనాటి సభ మరింత రక్తికట్టించేదిగా మారింది. నీటిపారుదల రంగంపైన ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పత్రంపైన సభలో వేడి వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు, చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుల తడకలని పూర్వం ఆ శాఖను నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఆ విషయంమైన సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.  ఆవేశ పూరిత ఆరోపణల్లో అధికార, విపక్ష నాయకులు అదుపు తప్పి మాట్లాడటం, దాన్ని రికార్డునుండి తొలగించాలని సభాపతిని కోరడం లాంటి సంఘటనలు పలు సందర్భాల్లో చోటుచేసుకున్నాయి.

కాగా సాగునీటి రంగంలో గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, తాను చేసిన తప్పులను ఒప్పుకుని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలని అధికార పక్షం పలు సార్లు హరీష్‌రావును కోరడం, అందుకాయన తమకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏకరువుపెట్టి దానికి కాంగ్రెసే క్షమాపణ చెప్పాలనడంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావులు  ఒకరితర్వాత ఒకరుగా హరీష్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటూ గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలను ఏకరువు పెట్టడం ఒక విధంగా పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా తయారైంది హరీష్‌రావు పరిస్థితి. తాను ఒకరికి సమాధానం చెబుతుండగానే మరొకరు లేవడం, వారి ప్రశ్నకు  సమాధానం చెబుతుండగానే ఇంకొకరు ఆరోపణలు చేస్తూ అడుగడుగునా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలిన విధానం ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టేదిగా ఉంది.

దానికి తోడు సభలో హరీష్‌రావుకు కేటాయించిన సమయం అయిపోవచ్చిందంటూ మధ్యమధ్యలో సభాపతి హెచ్చరికలతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ అధికార పార్టీ చేసిన ప్రతీ ఆరోపణకు తన వద్ద సాక్షాధారాలు సిద్దంగా ఉన్నా యని, తగిన సమయం కేటాయిస్తే అన్నిటినీ సభలో వివరిస్తామంటూ ఆయన ప్రధానాంశాలను సభ దృష్టికి తెచ్చే ప్రయత్నంచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత నీటిపారుదల అంశం ఎప్పుడు చర్చకు వొచ్చినా అటుఇటు తిరిగి కాళేశ్వరంపైనే చర్చ కొనసాగుతూ వొస్తున్నది. కాళేశ్వరం బ్యారేజీ కుంగడానికి నిర్మాణంలో జరిగిన అవినీతే ప్రధాన కారణంగా కాంగ్రెస్‌ మొదటినుండీ ఆరోపిస్తున్నది. నిష్ణాతులైన ఇంజనీర్లను కాదని, నాటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ తానే ఇంజనీరింగ్‌ అవతారమెత్తిన ఫలితమే లక్షలాది  రూపాయలు వృధా అవడానికి కారణమైందన్న విషయాన్ని కాంగ్రెస్‌ మరోసారి అసెంబ్లీలో లేవనెత్తింది.

ఈ విషయంలో తమ తప్పిదాన్ని ఒప్పుకోవాలని కాంగ్రెస్‌ పట్టుపట్టింది. అయితే బ్యారేజీలు కుంగటం లేదా కూలడమన్నది కేవలం కాళేశ్వరంలోనే జరుగలేదని, కాంగ్రెస్‌ పాలనా కాలంలో నాగార్జున సాగర్‌ మొదలు కూలిన వివిధ ప్రాజెక్టుల పేర్లను ఏకరువు పెట్టిన హరీష్‌రావు, ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి జరిగిన కాల వ్యవధితో పాటు, నిర్మాణానికి పెరిగిన వ్యయాన్ని కూడా అంకెలతో వివరించడం ద్వారా కాంగ్రెస్‌ తప్పిదాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అయినా సరే తప్పు ఒప్పుకోవాల్సిందేనన్న అధికార పక్ష డిమాండ్‌కు.. వాదనలతో కాలయాపన చేసేకన్నా వర్షాకాలం రాకముందే మరమత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు చాకచక్యంగా కాంగ్రెస్‌ వాదనను తిప్పికొట్టారు. దానితోపాటు తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని కొత్త ప్రాజెక్టులను నిర్మాణంచేసింది, ఎంత నీటిని, ఎన్ని జిల్లాలకు మళ్ళించిన విషయాలను సోదాహరణగా వివరించారు.

కాగా, వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణస్థలాన్ని మార్చి తెలంగాణ ప్రజలపై నాటి సిఎం కెసిఆర్‌ మోయలేని భారాన్ని మోపాడని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాని పూర్వపరాలను వివరించిన తీరును కూడా హరీష్‌రావు తప్పుపట్టారు. తుమ్మడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సరైనదిగా, నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయిదుగురు ఇంజనీర్ల కమిటీ చేసిన సిఫారసులను నాటి ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణపై హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తమ ప్రయత్నంలో ఎలాంటి లోపంలేదని మహారాష్ట్రలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ తర్వాత వొచ్చిన బిజెపి ప్రభుత్వాలేవీ తుమ్మడిహెట్టి దగ్గర నిర్మాణాన్ని అంగీకరించకపోవడంవల్లే  సిడబ్ల్యుసి, కేంద్ర సంస్థ అయిన వ్యాప్కో సూచనల మేరకే మేడిగడ్డ, సుందిళ్ళను ఎంచుకోవాల్సి వొచ్చిందంటూ కౌంటర్‌ అటాక్‌ చేశారు. మొత్తం మీద నీటిపారుదల రంగానికి సంబంధించి  ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్‌పేపర్‌  ఫాల్స్‌ పేపర్‌గా ఆయన అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *