బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య  విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్న రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపిలు  బిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ ‌చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలుకూడా బిఆర్‌ఎస్‌ ఎదుటి పార్టీకి ‘బి’టీమ్‌గా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపిస్తున్నాయి. దాన్ని ఖండించుకునే క్రమంలో బిఆర్‌ఎస్‌ కూడా ఆ రెండు పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నది. ఈ క్రమంలో ఈ మూడు పార్టీలు ఒకరిపైన ఒకరు దూషణ లో పోటీ పడుతున్నాయి.  ఎవరు ఎవరికి కొమ్ముకాస్తున్నారన్నదే ఇక్కడ ప్రధానాంశంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రావడానికి ముందు నుండే రాష్ట్రంలో ఈ చర్చ జరుగుతున్నప్పటికీ ఇటీవల కాంగ్రెస్‌, ‌బిజెపికి చెందిన జాతీయ నాయకులు రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా  ‘బి’టీమ్‌పైన చర్చ జరుగుతున్నది. ఈ నెల 18నుండి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని ములుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన  రాష్ట్రంలోని అధికార బిఆర్‌ఎస్‌, ‌బిజెపిపైన తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకదాన్ని ఒకటి విమర్శించుకున్నట్లు బయటికి కనిపించినా అ రెండు ఒకటేనన్నది అందులోని సారాంశం. ఈ రెండు పార్టీలు అధికారం చేపట్టినప్పటినుండి ఒకదానికొకటి సహకరించుకుంటూనే ఉన్నాయన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. పార్లీమెంటు సమావేశాల సందర్భంగా, కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను బిఆర్‌ఎస్‌ ‌సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌గుర్తుచేస్తోంది. కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌ ‌కావాలన్న బిజెపి ఆకాంక్షలకు అనుగుణంగా బిఆర్‌ఎస్‌ ‌వ్యవహరిస్తూ  వొస్తుందంటోంది కాంగ్రెస్‌. ‌టిఆర్‌ఎస్‌ ‌నుంచి బిఆర్‌ఎస్‌ ‌మార్చే క్రమంలో కాంగ్రెస్‌, ‌బిజెపి మినహా దేశంలోని పార్టీలను ఐక్యం చేస్తానని చెప్పిన బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు వాస్తవ లక్ష్యం కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌తెలంగాణ ఏర్పాడలన్నదేనన్నది స్పష్టమైందంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. ఎన్డీయేకు దగ్గరై కల్వకుంట్ల కవితను కేంద్రంలో మంత్రిగా చేయాలని ఆ పార్టీ ప్రయత్నించిన విషయాన్ని కాంగ్రెస్‌ ‌గుర్తు చేస్తోంది. దేశంలో సంచలనం లేపిన లిక్కర్‌ ‌కేసులో కవితను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం వెనుక ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనే కారణమంటున్నాయి కాంగ్రెస్‌ ‌వర్గాలు. అంతటితో ఆగకుండా  బిఆర్‌ఎస్‌కు రాహుల్  ‌కొత్త నిర్వచనం చెప్పాడం విశేషం. బిఆర్‌ఎస్‌ అం‌టే  బిజెపి రిస్తేదార్‌ ‌సమితి అంటూ  రాహుల్‌గాంధీ దానికి కొత్త నామకరణంచేశారు. దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. మొదటినుండి బిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకే బి టీమ్‌గా వ్యవహరిస్తున్నదంటూ ఎదురు దాడి ప్రారంభించారు. రేవంత్‌రెడ్డిపైన ఉన్న వోటుకు  నోటు కేసు తొక్కిపెట్టడంలోనే ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందన్నది అర్థమవుతున్నదంటోంది బిజెపి. ప్రజలంతా ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో చూసిన ఘటనపైన ఇంతకాలంగా చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమంటున్నాయి బిజెపి వర్గాలు. ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డి అయితే రాహుల్‌కు ఛాలెంజీ విసిరారు. ఎవరికి ఎవరు బీ టీమ్‌ అన్నది తేల్చుకుందాం రా అని పిలుపిచ్చారు. ఎదురెదురుగా చర్చించుకున్నప్పుడు వాస్తవం బయటికి వొస్తుందంటూ, హైదరాబాద్‌  ‌ప్రెస్‌క్లబ్‌ ‌లేదా దిల్లీ  ప్రెస్‌ ‌క్లబ్‌ ఎక్కడైన దీనిపైన తాను చర్చకు సిద్ధమని , అందుకు రాహుల్‌ ‌సిద్దమా అని ఆయన బహిరంగ ఛాలెంజ్‌ ‌చేశారు. తన ఛాలెంజీపై స్పందించని పక్షంలో  తెలంగాణ సమాజానికి వెంటనే రాహుల్‌ ‌క్షమాపణ చెప్పాలని, హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల డిఎన్‌ఏలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్‌కు మధ్యవర్తిగా ఎఐఎం వ్యవహరిస్తున్నదంటూ ఆయన మరో ఆరోపణ చేశారు. అసలు ఎంఐఎంను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వోటు  బిజెపికి పడకుండా బిఆర్‌ఎస్‌ ‌కుట్రచేస్తోందంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేశారు కిషన్‌రెడ్డి.  ఎన్నికలను పురస్కరించుకుని ఆ పార్టీ ముఖ్యనేత, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు, ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరణ్‌ ‌చుగ్‌ ‌కూడా కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్‌ ‌బి టీమ్‌ అం‌టూ ప్రచారం చేశారు. కేవలం ఈ రెండు పార్టీలే కాదు మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కూడా అదే ఆరోపణ చేశారు. కెసిఆర్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీపెట్టి మహారాష్ట్రలో తమ పార్టీనే టార్గెట్‌ ‌చేస్తున్న విషయాన్ని శరద్‌పవార్‌కు ఇప్పటికైనా అర్థంచేసుకుంటే చాలని, బిఎస్‌పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ‌వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఆరోపణలను బిఆర్‌ఎస్‌ ‌సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్‌, ‌బిజెపిలకు సమాధానం  చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ఏర్పడింది. దీనిపై రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ ‌రామారావు తీవ్రంగా స్పందించారు.  తాము ఎవరికి బి టీమ్‌కాదని స్పష్టం చేశారు. ఆ మాటకు వొస్తే కాంగ్రెసే  సి టీమ్‌ అన్నారు. సి టీమ్‌ అం‌టే చోర్‌ ‌టీమ్‌ అని దాన్ని వివరించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో ఏ టు జడ్‌ ‌కుంభకోణాలే, ఆకాశం నుండి పాతాళం దాక దోచిన పార్టీకి తమను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు బిజెపి ఎంత దూరమో, బిఆర్‌ఎస్‌ ‌కూడా అంతే దూరమని స్పష్టంచేశారు. మోదీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్థిత్వంపైన దాడిచేస్తున్నారని, దేశం గర్వించే విధంగా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే ఈ పార్టీలు ఓర్వలేక పోతున్నారని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఎదురు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *